ఆపరేషన్ సింధూర్ : భారత్ దెబ్బ నిజం..లష్కర్ ఉగ్రవాది అంగీకరించిన నిజం
లష్కరే కమాండర్ల అంగీకారం వైరల్ అయిన ఒక వీడియోలో లష్కరే టాప్ కమాండర్ ఖాసిమ్ మాట్లాడుతూ.. మురిద్కేలో భారత్ దాడిలో ధ్వంసమైన తమ మర్కజ్ తయ్యిబా శిథిలాలపై నిలబడి ఉన్నానని తెలిపాడు.
By: A.N.Kumar | 19 Sept 2025 11:00 PM ISTపాకిస్థాన్ గడ్డపై భారత్ జరిపిన "ఆపరేషన్ సిందూర్" సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆపరేషన్‌లో భారత్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందన్న నిజం ఇప్పుడు బహిర్గతమైంది. లష్కరే తయ్యిబా (LeT) టాప్ కమాండర్ ఖాసిమ్ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించడంతో పాకిస్థాన్ ప్రచారం చేసినవన్నీ అబద్ధాలని తేలింది.
లష్కరే కమాండర్ల అంగీకారం వైరల్ అయిన ఒక వీడియోలో లష్కరే టాప్ కమాండర్ ఖాసిమ్ మాట్లాడుతూ.. మురిద్కేలో భారత్ దాడిలో ధ్వంసమైన తమ మర్కజ్ తయ్యిబా శిథిలాలపై నిలబడి ఉన్నానని తెలిపాడు. గతంలో ఈ కేంద్రంలో అనేకమంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చామని కూడా అంగీకరించాడు. పాకిస్థానీ యువతను ఉగ్రవాద శిక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చాడు.
మరో వీడియోలో లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ మాట్లాడుతూ పాక్ ప్రభుత్వం , సైన్యం తమ ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణానికి నిధులు అందిస్తున్నాయని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఇది పాక్ అబద్ధాలకు, ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న నిజానికి స్పష్టమైన రుజువు.
* ఆపరేషన్ సిందూర్.. భారత్ దళాల ప్రతీకారం
"ఆపరేషన్ సిందూర్"లో మొత్తం తొమ్మిది కీలక ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని నిఘా సంస్థలు ధృవీకరించాయి. ఈ దాడిలో మురిద్కే క్యాంప్ ప్రధానమైనది. పహల్గాంలో లష్కరే జరిపిన దాడిలో 26 మంది అమాయకులు చనిపోయిన ఘటనకు ప్రతీకారంగానే భారత దళాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి.
భవిష్యత్ సవాళ్లు
లష్కరే తయ్యిబా 2026 ఫిబ్రవరి 5న జరగబోయే "కశ్మీర్ సంఘీభావ దినోత్సవం" కోసం మురిద్కేలో కొత్తగా నిర్మించబోయే కాంప్లెక్స్‌ను వేదికగా మార్చాలని చూస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇది మరోసారి ఉగ్రవాద శిక్షణ, కార్యకలాపాలకు కేంద్రంగా మారే ప్రమాదం ఉంది.
మసూద్ అజర్ కుటుంబానికి నష్టం
జైషే మహ్మద్ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ కూడా తన ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజర్ కుటుంబం తీవ్ర నష్టం చవిచూసిందని అంగీకరించాడు. ఇది ఈ దాడుల తీవ్రతను స్పష్టం చేస్తోంది.
ఈ పరిణామాలు ఉగ్రవాదంపై భారత్ ఎటువంటి రాజీ లేకుండా పోరాటం చేస్తోందని, పాకిస్థాన్ మాత్రం అబద్ధాల ప్రచారంతో నిజాలను దాచిపెడుతోందని నిరూపిస్తున్నాయి. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాక్ ప్రభుత్వ వైఖరి, కమాండర్ల అంగీకారంతో బట్టబయలైంది.
