ఇండియా రివర్స్ ఇంజనీరింగ్...పాక్ కి చుక్కలే !
ఈ మధ్య కాలంలో అధిక సుంకాలను విధిస్తూ అమెరికా భారత్ మీద అనవసరంగా పంతానికి పోతోంది.
By: Satya P | 22 Oct 2025 9:04 AM ISTపాకిస్థాన్ బుద్ధి ఎప్పుడూ మారదు, ఆ దేశం ద్వేషమూ మారదు. కోరి మరీ అఖండ భారతం తో విడిపోయిన పాకిస్తాన్ గత ఎనభై ఏళ్ళుగా తాను నాశనం అవుతోంది అదే కుళ్ళుతో అక్కసుతో భారత్ మీద పడి ఏడుస్తోంది. ప్రపంచంలో అన్ని దేశాలకు పావుగా మారి ఒక్క భారత్ మీద మాత్రం పాముగా మారి కాటేయాలని చూస్తోంది. అయితే భారత్ ముందు పాక్ కుప్పిగెంతులు ఏ మాత్రం సాగడం లేదు, దెబ్బకు దెబ్బ తీస్తోంది భారత్. దానికి లేటెస్ట్ ఉదాహారణ ఆపరేషన్ సింధూర్.
అమెరికా అండ చూసుకుని :
ఈ మధ్య కాలంలో అధిక సుంకాలను విధిస్తూ అమెరికా భారత్ మీద అనవసరంగా పంతానికి పోతోంది. అది ఆ దేశంలో కూడా చర్చగా ఉంది సహజ మిత్రులు ప్రజా స్వామ్య దేశాల మధ్య ఈ రకమైన పరిస్థితి ఏమిటి ఎందుకు అన్నది పక్కన పెడితే భారత్ ని కాస్తా అమెరికా దూరం పెట్టడం దాయాది పాక్ కి ఎంతగానో నచ్చేస్తోంది. అందుకే పిలిచినా పిలవకపోయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కన నిలబడి ఆ దేశ అధినేతను తెగ పొగుడుతూ పాక్ ప్రధాని అలాగే సైన్యాధ్యక్షుడు ఇద్దరూ కూడా భారత్ మీద తమ మంటను చల్లార్చుకుంటున్నారు. లేటెస్ట్ గా పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అయితే భారత్ మీద విషమే చిమ్మాడు అణు ఆయుధాలు ప్రయోగిస్తమని అన్నాడు, భారత్ ని అన్ని విధాలుగా నష్టపరుస్తామని అన్నాడు. ఇంకా చాలనే అన్నాడు. ఇదంతా అమెరికా అండ చూసుకుని రెచ్చిపోవడం కిందకే వస్తుందని దౌత్య నిపుణులు అంటున్నారు.
ఆఫ్ఘాన్ తో యుద్ధం వెనక :
మరో వైపు చూస్తే ఆఫ్ఘాన్ భారత్ దోస్తులుగా మారిపోయాయి. ఈ మధ్యనే తాలిబన్ విదేశాంగ మంత్రి భారత్ విచ్చి వెళ్ళారు. ఇక పాక్ పీచమణచేందుకు తాలిబన్లు సిద్ధంగా ఉన్నారు. యుద్ధం కూడా జరుగుతోంది. వీటి వెనక భారత్ ఉందని పాక్ అనుమానంతో రగిలిపోతోంది. అయితే శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నది ఒక రాజనీతి భారత్ దీనిని అమలు చేసినా తప్పు లేదు, పాక్ ని ఎడా పెడా తాలిబన్లు వాయించేస్తే అది భారత్ కి ఎంతో సంతోషకరమైన వార్త గానే ఉంటుంది. సో పాక్ రెచ్చిపోవడానికి సవాలక్ష కారణాలలో ఇది ఒకటి.
పాక్ కి ఇక సవాలే :
భారత్ తలచుకుంటే పాక్ పని పట్టడం చాలా సులువు. అది ఈ మధ్యనే ఆపరేషన్ సింధూర్ తో రుజువు అయింది. ఇపుడు చేతికి మట్టి అంటకుండా తాలిబన్లు ఆ పని చూస్తున్నారు. అయినా భారత్ పాక్ ఈసారి ఏమైనా తోక జాడిస్తే దాని పని పట్టేందుకు కొత్త ఆలోచనలు చేస్తోంది. అదే రివర్స్ ఇంజనీరింగ్ అన్న మాట. ఇంతకీ అదేంటి ఎలా అన్నది ఒక ఆసక్తికరమైన విషయం. శత్రువు వదిలిన ఆయుధాల నుంచి దాని మూల టెక్నాలజీని స్వాధీనం చేసుకుని దానిని తమ సొంత స్వీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఆయుధాలలో చేర్చి మరింత శక్తివంతంగా తయారు చేసి అదే శత్రువు మీద అవసరం అయినప్పుడు తిరిగి ప్రయోగించడం అన్న మాట. ఇపుడు అదే పనిలో భారత్ ఉంది.
పీఎల్ 15 ఈ మీద :
పాక్ తో గత మే నెలలో యుద్ధం జరిగినపుడు భారత్ మీద పాక్ ప్రయోగించిన అన్ని క్షిపణులూ తుత్తునియలు అయ్యాయి. దానికి మన ఎస్ 400 ఎయిర్ ఫోర్స్ వారి బ్రహాస్త్రం కారణం. అయితే ఒక్క క్షిపణీ మాత్రం భారత్ ని తాకి నేలకొరిగింది. దాని పేరే పీఎల్ 15 ఈ. ఇది చైనా నుంచి పాక్ అందుకున్న దిగుమతి సరుకు అన్న మాట. ఈ ఆయుధాన్ని భారత్ మీద పాక్ ప్రయోగించింది. కానీ లక్ష్యాన్ని చేరకుండానే చతికిలపడింది. ఇపుడు ఈ పీఎల్ 15 ఈలో ని టెక్నాలజీని ఏమిటి అన్నది భారత్ డీఆర్ డీఓ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తోంది. దీనిని ఎలా తయారు చేశారు, దాని వెనకాల ఉండే సైన్స్ ఏమిటి అన్నది పరిశోధిస్తోంది. దీని వెనకాల టెక్నాలజీతో భారత్ తిరిగి ఒక పదునైన అస్త్రాన్ని రెడీ చేసి అవసరం అనుకుంటే దానిని పాక్ మీద ప్రయోగిస్తుంది అన్న మాట. ఇలాగే పాక్ పేలాపన సాగుతూ ఉంటే కనుక పాక్ రెచ్చగొట్టుడు విధానాలు కొనసాగుతూ ఉంటే కనుక ఈ రివర్స్ ఇంజనీరింగ్ తో రెడీ చేసిన అస్త్రానికి పాక్ గురి కాక తప్పదని అంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ది మాటల యుద్ధం అయితే భారత్ ది చేతల యుద్ధం అని ఇప్పాటికైనా దాయాది గ్రహిస్తే మంచిదని అంటున్నారు.
