Begin typing your search above and press return to search.

'ఆపరేషన్‌ సిందూర్‌'పై వాడీవేడి చర్చ... రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్... ఆపరేషన్‌ సిందూర్‌ లో వంద మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు.

By:  Raja Ch   |   28 July 2025 6:30 PM IST
ఆపరేషన్‌ సిందూర్‌పై వాడీవేడి చర్చ... రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్య చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది.. ఉగ్రవాదులను వణికించేసింది. ఈ నేపథ్యంలో... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ ను వణికించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పార్లమెంటులో వాడీవేడి చర్చ మొదలైంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... సోమవారం పార్లమెంట్ లో ఆపరేషన్ సిందూర్ పై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్... ఆపరేషన్‌ సిందూర్‌ లో వంద మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. మే 7 రాత్రి భారత బలగాలు తమ శక్తి, సామర్థ్యాలు చాటిచెప్పాయని.. ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపారని.. కేవలం 22 నిమిషాల్లో ఈ ఆపరేషన్‌ పూర్తి చేశారని తెలిపారు.

అనంతరం పాక్‌ సైన్యం మనపై దాడికి దిగిందని.. ఈ క్రమంలో దాయాది దాడులను సమర్థంగా తిప్పికొట్టామని రక్షణ మంత్రి తెలిపారు. మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడ్డారని.. ఈ సమయంలో పాక్ లోని మిసైల్‌ లాంఛింగ్‌ స్టేషన్‌ ధ్వంసమైందని.. శత్రువుల దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని.. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని తెలిపారు.

ఈ సందర్భంగా... సరిహద్దులు దాటి వెళ్లడం.. ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యం కాదని చెప్పిన రక్షణ మంత్రి... ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో... యుద్ధం మా లక్ష్యం కాదు.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే మా విధానం అని పునరుద్ఘాటించారు.

ఈ సమయంలోనే భారత్ దెబ్బకు పాక్‌ కాళ్ల బేరానికి వచ్చిందని.. ఈ సందర్భంగా మన త్రివిధ దళాలను తట్టుకోలేక పాక్‌ డీజీఎంవో వెంటనే మనకు ఫోన్‌ చేశారని.. కాల్పుల విరమణకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు! ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్‌ అధికారులు పాల్గొన్నారని.. దీనిని బట్టి వారిని ఆ దేశం ఎలా పెంచి పోషిస్తుందో స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు.

ఇదే సమయంలో భారత్, పాక్ లతో వాణిజ్యాన్ని తగ్గించుకుంటామని తాను బెదిరించడం వల్లే ఆ రెండు దేశాల మధ్య శత్రుత్వాలు ముగిశాయని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోసిపుచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ ను ఎటువంటి ఒత్తిడితోనూ ఆపలేదని.. లక్ష్యాలు పూర్తిగా సాధించింనందుకే దాడులను నిలిపివేసాయని నొక్కి చెప్పారు.