Begin typing your search above and press return to search.

కలుగును మూసి మూకను మట్టుబెట్టి... 'ఆపరేషన్ మహాదేవ్' సాగిందిలా..!

అవును... పహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన ముగ్గురు ముష్కరులను 'ఆపరేషన్‌ మహాదేవ్‌' ద్వారా హతమార్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటులో ప్రకటించిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   30 July 2025 5:19 PM IST
కలుగును మూసి మూకను మట్టుబెట్టి... ఆపరేషన్  మహాదేవ్ సాగిందిలా..!
X

కలుగులో దాక్కొన్న ఎలుకను పట్టాలంటే.. అందులో పొగబెట్టాలని అంటారు. ఇదే క్రమంలో ఓ కలుగును నమ్ముకుని సరిహద్దు దాటాలకునున్న ఉగ్రమూకలకు.. ఆ కలుగుతోనే షాకిచ్చి, బయటకు రప్పించి హతమార్చాయి భారత భద్రతా దళాలు. ఈ సందర్భంగా.. తాజాగా పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం ఎలా మట్టుబెట్టిందనే విషయం వెలుగులోకి వచ్చింది.

అవును... పహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన ముగ్గురు ముష్కరులను 'ఆపరేషన్‌ మహాదేవ్‌' ద్వారా హతమార్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటులో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు చివరిసారిగా ఎం-9తో పాటు రెండు ఏకే 47 తుపాకులు ఉపయోగించారని వెల్లడించారు. వారి పేర్లను ప్రకటించారు.

ఇందులో భాగంగా... వారిలో పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సులేమాన్ కాగా.. మిగిలిన ఇద్దరూ అతడికి ఆ దాడి విషయంలో సహకరించిన ఉగ్రవాదులు అఫ్గానీ, జిబ్రాన్‌ అని తెలిపారు. వీరు బైసరన్ లోయలో మారణహోమం సృష్టించిన తర్వాత ఎవరికంటా పడకుండా దాక్కున్నారు. ఈ సమయంలో కొంతమంది స్థానికులు వీరికి సహకరించారు.

ఇక.. ఈ దాడి అనంతరం వచ్చిన దారి గుండానే తిరిగి పాకిస్థాన్ లోకి వెళ్లిపోవాలని వీరు ప్లాన్ చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే... భద్రతా దళాల వ్యూహం కారణంగా అది వారికి సాధ్యం కాలేదు. దీంతో... దాడి జరిగినప్పటి నుంచీ వీళ్లు అక్కడక్కడే నచ్చాడుతూ.. తిరిగి తమ దేశంలోకి వెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో వారికున్న హోప్ ఓ టన్నెల్!

ఈ 8 కిలోమీటర్ల టన్నెల్ మార్గం ద్వారానే వీరు భారత్ లోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. పహల్గాంలో దాడి అనంతరం ఇదే మార్గం ద్వారా తిరిగి పాక్ లోకి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో... ఈ ముష్కరులు చొరబాటుకు ఉపయోగించిన ఆ రహస్య టన్నెల్‌ ను భద్రతా బలగాలు గుర్తించాయి. వెంటనే ఆ సొరంగాలను వరదలతో ముంచెత్తించారు.

దీంతో... ఇక ఆ రహస్య సొరంగ మార్గ గుండా పాక్ వెళ్లలేక ఇబ్బందులు పడిన ముష్కరులను.. భద్రతా దళాలు ట్రాక్‌ చేశాయి. వారు ఉంటున్న ప్రాంతాన్ని పక్కాగా గుర్తించాయి. అనంతరం పక్కా ప్లానింగ్ తో వారిని మట్టుబెట్టాయి. అనంతరం... ఈ ముగ్గురూ పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులే అని అధికారులు పలు రకాల ప్రయత్నాల్లో కన్ ఫాం చేశారు.

ఎలా కన్ ఫాం చేసుకున్నారంటే..?:

ఆపరేషన్ మహాదేవ్ లో మట్టుబెట్టిన ముగ్గురు ఉగ్రవాదులు.. పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులే అని ఎలా గుర్తించింది అమిత్ షా పార్లమెంటులో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్.ఐ.ఏ. గతంలోనే అరెస్టు చేసిందని.. వారితోనే ఈ మృతదేహాలను గుర్తించమని కోరామని అన్నారు. అలా కన్ ఫాం చేశామని తెలిపారు.

ఈ సమయంలో... మరింత నిర్ధారణ కోసం.. పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై దాడి జరిగిన స్థలం నుండి స్వాధీనం చేసుకున్న బుల్లెట్ షెల్స్ ఫోరెన్సిక్ నివేదికలను ఉపయోగించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా... ఈ ఉగ్రవాదులను చంపిన తర్వాత, వారి రైఫిల్స్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అందులో ఒక ఎం9, రెండు ఏకే-47లు ఉన్నాయని.. ఈ రైఫిల్స్‌ చండీగఢ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించామని తెలిపారు. అనంతరం.. వీరి వద్ద దొరికిన తుపాకులలోని బుల్లెట్లను, పహల్గాంలో దొరికిన వాటితో వాటిని సరిపోల్చామని.. అప్పుడు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ఈ విషయంలో ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదని వెల్లడించారు.