ఒకే రోజు రెండు ఎన్‌కౌంటర్లు.. 14 మంది మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'లో శనివారం రెండు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి.
By: Tupaki Political Desk | 3 Jan 2026 5:25 PM ISTఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'లో శనివారం రెండు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటరులో 12 మంది మరణించారు. మరోచోట చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొంఠా ఏరియా కమిటీ కార్యదర్శి సచిన్ మంగ్దు అలియాస్ మంగడు ఉన్నారని చెబుతున్నారు. ఘటనా స్థలంలో ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధానం చేసుకున్నాయి.
సుక్మా జిల్లాలో మావోయిస్టుల సంచారంపై సమాచారం అందుకున్న వెంటనే రిజర్వు గార్డుతోపాటు బలగాలు రంగంలోకి దిగాయి. మావోయిస్టులను నలువైపులా చుట్టుముట్టాయి. వేకువజామున చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు 222 ఎన్‌కౌంటర్లు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 475 మంది వరకు మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో 285 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బస్తర్ డివిజన్ లోనే 257 మంది మరణించారని పోలీసు లెక్కలు చెబుతున్నాయి.
దండకారణ్యాన్ని సేఫ్ గా భావించిన మావోయిస్టులకు ఆపరేషన్ కగార్ తో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ విముక్త భారత్ ఆవిష్కరిస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత పరిణాలు చూస్తుంటే ఈ లోగానే మావోయిస్టుల ఉద్యమం ముగిసిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఒకప్పుడు దేశంలో సుమారు 16 రాష్ట్రాల్లో ఉనికి చాటుకున్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు మనుగడ సాగించడం పెను సవాల్ గా మారింది. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులపై పోలీసులు పట్టు సాధించడంతో వందల మంది ప్రాణాలు కోల్పోగా, వేల మంది లొంగిపోయారు. రానున్న రోజుల్లో ఈ లొంగుబాట్లు కొనసాగే పరిస్థితులు ఉన్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు.
పోలీసుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు ఉద్యమం కకావికలమైంది. 473 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్, మిలటరీ కమిషన్ చీఫ్ హిడ్మాతో పాటు చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, ఉయికా గణేష్, ఏవోబీ సెక్రటరీ సుధాకర్, జగదీష్, రేణుక వంటివారు హతమయ్యారు. అదేవిధంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఆశన్న, మల్లోజుల వేణుగోపాల్ వంటివారు ఆయుధాలతో సహా లొంగిపోయారు. సుమారు 2,354 మంది ఉద్యమాన్ని వీడగా, పోలీసులు 1,183 మందిని అరెస్టు చేశారు.
