పాక్ మళ్లీ అదే కుట్ర... తిప్పికొడుతున్న భారత్!
జమ్ముకశ్మీర్‌లోని కిష్తివాడ జిల్లాలో(పాక్ సరిహద్దు)కి ముగ్గురు ఉగ్రవాదులు గత రాత్రి ప్రవేశించారు.
By: Garuda Media | 5 Nov 2025 12:37 PM ISTఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల మారణ హోమం.. భారత ప్రజల కళ్లముందు నుంచి ఇంకా కరిగిపోలేదు. దీనికి ప్రతిగా భారత్.. పాకిస్థాన్ లోని ఉగ్ర స్తావరాలు, ఉగ్రవాదులు లక్ష్యంగా జరిపిన దాడి నుంచి ఇంకా.. పాక్ కోలుకోనుకూడా లేదు. పైగా తాము విజయం దక్కించుకున్నామని చెబుతున్న తీరు.. ప్రపంచదేశాలను కూడా నివ్వెర పోయేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా మరోసారి అదే కుట్రకు పాక్ పాల్పడింది.
జమ్ముకశ్మీర్‌లోని కిష్తివాడ జిల్లాలో(పాక్ సరిహద్దు)కి ముగ్గురు ఉగ్రవాదులు గత రాత్రి ప్రవేశించారు. పక్కా ప్లాన్‌తో వారు వచ్చినట్టు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో హుటాహుటిన స్పందించిన భద్రతా బలగాలు.. `ఆపరేషన్ ఛత్రు` పేరుతో ఉగ్రమూకల అంతానికి రంగంలోకి దిగాయి. బుధవారం ఉదయం నుంచి ఇరు పక్షాల మధ్య కాల్పులు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఉగ్రమూకల రాకపై మరికొన్ని కథనాలు కూడా వస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలోనే వారు దొంగచాటుగా.. జమ్ము కశ్మీర్‌లోకి ప్రవేశించారని.. అక్కడే నక్కారని అంటున్నారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ముగ్గురు ఉన్నారని భావిస్తున్నా.. వీరి సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. వారిని సాధ్యమైనంత వరకు సజీవంగా పట్టుకునేలా ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తీవ్రంగా భావిస్తున్న కేంద్రం..
తాజా పరిణామాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఎలాంటి పరిస్థితి నైనా తట్టుకుంటామని ప్రకటించాయి. ఒక్కరి ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లకుండా బలగాలు క్షేత్రస్థాయిలో మోహరించాయని చెప్పాయి. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ సింగ్ కూడా ఈ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
