తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్..? జంపింగ్ లు వీరే!
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు వస్తారని కొత్తగా వాదన తెచ్చారు.
By: Tupaki Political Desk | 17 Nov 2025 9:35 AM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది.. కానీ, తెలంగాణలో కొత్త రాజకీయానికి తెరలేవనుంది.. అదే ఆపరేషన్ ఆకర్ష్..! వాస్తవానికి ఎన్నికల అనంతరమే మొదలుపెట్టిన ఈ ఆకర్ష్ లో పదిమంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తమవైపు తిప్పుకొంది. అయితే, వీరిలో కొందరి చేరికపై వివాదం నెలకొంది. ఫిరాయింపులకు సంబంధించి ప్రస్తుతం కేసు కూడా నడుస్తోంది. వీటన్నిటి మధ్యన వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడంతో పరిణామాలు మారనున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం, వరుసగా రెండో ఉప ఎన్నిక (నిరుడు కంటోన్మెంట్, నేడు జూబ్లీహిల్స్)లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆపరేషషన్ ఆకర్ష్ మళ్లీ ప్రస్తావనకు వస్తోంది. అటువైపు బిహార్ ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్.. తెలంగాణలో బలం చాటుకోవాలంటే కూడా ఆపరేషన్ ఆకర్ష్ కీలకమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆ వచ్చేది ఎవరు?
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు వస్తారని కొత్తగా వాదన తెచ్చారు. ఈ పదిమంది ఎవరు? అనేది చర్చగా మారింది. ఇప్పటికే మొగ్గుచూపిన పదిమందిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ వారు ఉంటారని పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందటి ఎన్నికల్లో రాజధాని హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేదు. దీంతో మొన్నటివరకు మంత్రి పదవి కూడా ఎవరికీ ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట మాజీ ఎంపీ, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారు అని కథనాలు వచ్చాయి. ఒకరిద్దరు చేరినా.. ఆ తర్వాత దీనికి అడ్డుకట్ట పడింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలోని పదిమంది ఎమ్మెల్యేలు కారు దిగనున్నట్లు చెబుతున్నారు.
అధిష్ఠానం కూడా సుముఖం
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరిక అటు కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా అంగీకారమే అన్నట్లు తెలుస్తోంది. కాకపోతే, న్యాయ, రాజకీయ పరమైన చిక్కులు ఎదురవకుండా చూసుకోవాలని భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు అనంతరం సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలోనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునే అంశాన్ని సీఎం రేవంత్ అధిష్ఠానం వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
