ఓపెన్ AIలో 'స్పై' కలకలం: సౌదీ ఉద్యోగి అరెస్ట్.. FBI ఇంటరాగేషన్!
ఓపెన్ఏఐ (OpenAI) కంపెనీలో సౌదీ అరేబియాకు చెందిన ఒక ఇంజనీర్ రహస్యంగా రికార్డింగ్ పరికరాన్ని అమర్చాడనే ఆరోపణలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపాయి.
By: Sivaji Kontham | 15 Oct 2026 1:00 AM ISTఓపెన్ఏఐ (OpenAI) కంపెనీలో సౌదీ అరేబియాకు చెందిన ఒక ఇంజనీర్ రహస్యంగా రికార్డింగ్ పరికరాన్ని అమర్చాడనే ఆరోపణలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికా సాంకేతిక భద్రతపై ఈ ఉదంతం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రరాజ్యాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న ఈ సమయంలో అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగే కాన్ఫరెన్స్ రూమ్‌లోనే గూఢచర్యానికి యత్నించడం గమనార్హం.
అమెరికా ఫెడరల్ అధికారులు- ఓపెన్ఏఐ వెల్లడించిన సంయుక్త వివరాల ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓపెన్ఏఐ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. 2025 జూలై నుండి అక్కడ పనిచేస్తున్న 35 ఏళ్ల సౌదీ ఇంజనీర్ అబ్దుల్రహ్మాన్ అల్ఫోజన్.. ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ రూమ్‌లోని టెలివిజన్ వెనుక ఒక యూఎస్బీ రికార్డింగ్ పరికరాన్ని టాయిలెట్ పేపర్లో చుట్టి దాచినట్లు గుర్తించారు. సెప్టెంబర్ చివరి వారంలో సంస్థ భద్రతా బృందం ఈ పరికరాన్ని కనుగొని వెంటనే ఎఫ్‌బీఐ (FBI) కి సమాచారం అందించింది. దీంతో అక్టోబర్ 9న అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.
పరిశీలనలో అల్ఫోజన్కు ఆ కాన్ఫరెన్స్ రూమ్‌లో జరిగే సమావేశాలకు హాజరయ్యే అనుమతి లేదని తేలింది. అయినప్పటికీ అతడు పలుమార్లు ఆ గది పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరగడం.. టీవీ వెనుక భాగాన్ని పరిశీలించడం సిసిటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అంతేకాకుండా ఓపెన్ఏఐ ఆఫీస్ భవనాలు, మీటింగ్ రూమ్‌లు, కీలక అధికారుల షెడ్యూళ్లు.. లొకేషన్ల సమాచారం కోసం ప్రత్యేక టూల్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు. అతడి భార్య చాట్‌బాట్ అకౌంట్లో కూడా రిమోట్ ఆడియో రికార్డింగ్.. మెమరీ కార్డ్ ఎన్క్రిప్షన్ గురించి వెతికినట్లు వెల్లడైంది.
ఈ ఘటన భద్రతాపరంగా ఆందోళన కలిగించినా తమ సోర్స్ కోడ్ , మోడల్ వెయిట్స్ లేదా కస్టమర్ డేటా ఏదీ చోరీకి గురికాలేదని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది. దొంగతనంగా సంభాషణలను రికార్డ్ చేయడానికి యత్నించిన నేరానికి గానూ అల్ఫోజన్పై ఫెడరల్ కేసులు నమోదయ్యాయి. ఈ నేరం రుజువైతే అతడికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష.. అలాగే 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై అమెరికా జాతీయ భద్రతా విభాగాలు తీవ్రంగా దృష్టి సారించాయి.
ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఇంటెలిజెన్స్ సాధించేందుకు ఏఐ పోటీ తీవ్రమవుతున్న వేళ... అమెరికా మేధో సంపత్తిని విదేశీ ముప్పుల నుండి కాపాడుకోవడం జాతీయ భద్రతా పరంగా ఎంతో కీలకమని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో పలు గ్లోబల్ టెక్ కంపెనీల్లో విదేశీ గూఢచర్యం... సమాచార చోరీయత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఏఐ రంగానికి ఒక హెచ్చరికగా నిలిచింది.
