Begin typing your search above and press return to search.

సోషల్ ప్రెజర్ బలహీనతగా మారుతోందా?.. సింగిల్స్‌పై స్కామ్ అలర్ట్!

సమాజంలో వయసు పెరుగుతున్న కొద్దీ 'పెళ్లెప్పుడు?' అనే ప్రశ్నలు ఎక్కువవుతాయి. ఇంటి నుంచి ఒత్తిడి, చుట్టూ ఉన్న స్నేహితుల పెళ్లిళ్లు, వీటన్నింటి మధ్య పెళ్లికాని యువత తీవ్రమైన ఒంటరితనానికి గురవుతున్నారు.

By:  Madhu Reddy   |   16 Sept 2026 1:15 PM IST
సోషల్ ప్రెజర్ బలహీనతగా మారుతోందా?.. సింగిల్స్‌పై స్కామ్ అలర్ట్!
X

సమాజంలో వయసు పెరుగుతున్న కొద్దీ 'పెళ్లెప్పుడు?' అనే ప్రశ్నలు ఎక్కువవుతాయి. ఇంటి నుంచి ఒత్తిడి, చుట్టూ ఉన్న స్నేహితుల పెళ్లిళ్లు, వీటన్నింటి మధ్య పెళ్లికాని యువత తీవ్రమైన ఒంటరితనానికి గురవుతున్నారు. సరిగ్గా ఇదే ఆందోళనను సైబర్ నేరగాళ్లు తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్ మ్యాట్రిమోనీల పేరుతో అందమైన ఆశలు చూపిస్తూ, యువత మానసిక బలహీనతలతో ఆడుకుంటున్నారు. అసలు ఈ డిజిటల్ ప్రేమ వలలో మనవాళ్లు ఎలా చిక్కుకుంటున్నారో, దానికి కారణమవుతున్న అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఒంటరితనమే వాళ్ల పెట్టుబడి:

పెళ్లి కావట్లేదనే బాధలో ఉన్నవారికి ఒక తోడు దొరికితే చాలు అనే భావన ఉంటుంది. క్రిమినల్స్ ఈ డిజిటల్ లోన్లీనెస్‌ను సరిగ్గా వాడుకుంటున్నారు. ఇక నకిలీ ప్రొఫైళ్లతో మాట కలిపి, మధురమైన సంభాషణలతో ఎదుటివారిలో నమ్మకాన్ని పెంచుతారు. బాధితుడు తన మనసులోని బాధనంతా పంచుకోవడం మొదలుపెట్టాక, నెమ్మదిగా స్కామర్లు తమ ప్లాన్ అమల్లోకి తెస్తారు.

కుటుంబాల సోషల్ ప్రెజర్:

మన సమాజంలో ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి కాకపోతే ఒక రకమైన చులకన భావం ఉంటుంది. కుటుంబం నుంచి వచ్చే నిత్య ఒత్తిడి తట్టుకోలేక, ఏదోక సంబంధం త్వరగా ఓకే చేసుకోవాలనే కంగారు యువతలో పెరుగుతుంది. ఇక ఈ ఆర్జన్సీ లేదా తొందరపాటే నేరగాళ్లకు ప్లస్ పాయింట్ అవుతోంది. వెరిఫికేషన్ లేకుండానే గుడ్డిగా డబ్బులు కట్టేలా చేస్తుంది.

ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ట్రాపింగ్:

ఇది కేవలం ఆర్థిక మోసం మాత్రమే కాదు, అంతకుమించిన మానసిక దాడి. ముందుగా ప్రేమ, ఆప్యాయత నటిస్తూ మహిళా టెలీకాలర్లతో మాట్లాడిస్తారు. సంబంధం దాదాపు ఖాయమైపోయిందనే భ్రమ కల్పిస్తారు. మెంబర్‌షిప్, ప్రాసెసింగ్ ఫీజుల పేరిట వేల రూపాయలు లాగిన తర్వాత, ఉన్నట్టుండి ఆ ప్రొఫైల్ గాయపడిపోతుంది. ఇక దీంతో బాధితులు ఆర్థికంగానే కాక మానసికంగా తీవ్ర కుంగుబాటుకు గురవుతున్నారు.

జాగ్రత్తగా ఉండటమే ఏకైక మార్గం:

ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ వేదికలను వాడుతున్నప్పుడు కేవలం ఫొటోలు, తీపి మాటలు చూసి మోసపోకూడదు. సదరు వ్యక్తి ప్రొఫైల్ నిజమైనదో కాదో ఐడీ ప్రూఫ్‌లు, నేరుగా కలవడం ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి. ఇక ప్రొఫైల్ వెరిఫికేషన్ లేకుండా ముందస్తుగా డబ్బులు అడిగితే వెంటనే అనుమానించడం నేర్చుకోవాలి.

అవగాహనే మన రక్షణ:

సమాజం నుంచి వచ్చే సోషల్ ప్రెజర్‌ను తలకెక్కించుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం డేంజర్. మన ఒంటరితనం వేరొకరికి వ్యాపారంగా మారకూడదంటే ప్రతి అడుగు చూసి జాగ్రత్తగా వేయాలి. ఇక పెళ్లి సంబంధాల విషయంలో ఆత్రుత కంటే ఆచి తూచి అడుగు వేయడమే మిమ్మల్ని మోసాల నుంచి కాపాడుతుంది.