నగరానికి పుట్టిన రోజు... ఒంగోలు సంబరం!
కానీ, చిత్రమే అయినా.. ఏపీలో ఒక నగరానికి పుట్టిన రోజువేడుకలు నిర్వహిస్తున్నారు. అదే.. ఒంగోలు నగర పాలకసంస్థ.
By: Garuda Media | 30 Sept 2026 6:11 PM ISTఒక వ్యక్తికి పుట్టిన రోజు ఉంటుంది. ప్రేమగా చూసుకునే పెంపుడు జంతువులకు పుట్టిన రోజులు ఉంటాయి. వాటిని ఘనంగా కూడా చేసుకుంటారు. కానీ, చిత్రమే అయినా.. ఏపీలో ఒక నగరానికి పుట్టిన రోజువేడుకలు నిర్వహిస్తున్నారు. అదే.. ఒంగోలు నగర పాలకసంస్థ. ఈ నగరం ఆవిర్భావం.. తర్వాత రూపు మార్చుకుని కార్పొరేషన్‌గా ఎదిగిన వైనం.. నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఒంగోలు పురపాలక పుట్టినరోజు పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. `ఒంగోల్ @ 150` థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పెద్దలు చాలా మంది పార్టిసిపేట్ చేశారు.
సరిగ్గా 1876, సెప్టెంబర్ 30న ఒంగోలు మూడో గ్రేడ్ మున్సిపాలిటీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం కార్పొరేషన్‌గా కొనసాగుతోంది. మొత్తంగా 150 వసంతాల్లోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని స్థానికంగా ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు అంటేనే గిత్తలకు ప్రసిద్ధి. ఈ క్రమంలో 150 గిత్తలతో భారీ ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. ఒంగోలు పౌరుషానికి, రైతు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ ఒంగోలు జాతి ఎద్దులతో మినీ స్టేడియం నుండి అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ఊరేగింపు, అందాల పోటీలు నిర్వహించారు.
'హెరిటేజ్ వాక్': సాంస్కృతికి వారసత్వాన్ని పది మందికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో భారీ హెరిటేజ్ వాక్ నిర్వహించి నగర చరిత్రను చాటిచెప్పారు. అలాగే, 'ఒంగోలు వైభవం` పేరుతో ఒంగోలు చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తూ 150 మంది మహిళా కళాకారులతో సాంస్కృతిక నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
అంచెలంచెలుగా..
ఒంగోలు నగరం అంచెలంచెలుగా అభివృద్ది చెందింది. స్వాతంత్ర సమర సమయంలో ఇక్కడ నుంచి టంటుటూరి ప్రకాశం పంతులు జాతీయస్థాయిలో వెలిగిపోయారు. చీరాల పేరాల ఉద్యమం ఇక్కడే సాగింది. ఇక, 1876లో ఒంగోలు మూడో గ్రేడ్ మునిసిపాలిటీగా ఆవిర్భవించినా.. ఆ తర్వాత కార్పొరేషన్‌గా మారింది. 1876 సెప్టెంబరు 30న ఒంగోలు మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి.1970లో ద్వితీయ శ్రేణి మునిసిపాలిటీగా ప్రకటించారు. 1983లో స్పెషల్‌గ్రేడ్ మునిసిపాలిటీగా, 2012లో కార్పొరేషన్‌గా ఎదిగింది.
