బీజేపీ జమిలి అంటే కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందా ?
జమిలి ఎన్నికల మీద బీజేపీ దూకుడు మీద ఉంది. 2029 ఎన్నికల నాటికి జమిలితోనే పోవాలని చూస్తోంది.
By: Satya P | 3 July 2026 9:04 AM ISTజమిలి ఎన్నికల మీద బీజేపీ దూకుడు మీద ఉంది. 2029 ఎన్నికల నాటికి జమిలితోనే పోవాలని చూస్తోంది. జూలై 20 నుంచి మొదలవబోతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో అనేక కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. అందులో కీలకమైనది జమిలి ఎన్నికల బిల్లు అని అంటున్నారు. ఈ బిల్లు కనుక సభ ఆమోదం పొందాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ప్రస్తుతం డీలిమిటేషన్ బిల్లు విషయంలో మ్యాజిక్ నంబర్ 362 కి చేరువ అయ్యేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో ఆ బిల్లుతో పాటు జమిలి బిల్లుని కూడా లోక్ సభ ముందుకు తెస్తుందని అంటున్నారు.
కీలక రాష్ట్రాలను కలుపుతూ :
ఇక జమిలి ఎన్నికల బిల్లు కనుక పార్లమెంట్ ఆమోదం పొందితే 2028 లో జరిగే కీలక రాష్ట్రాల ఎన్నికలను ముందో వెనక్కో జరిపి కనీసంగా అరడజన్ రాష్ట్రాలతో మినీ జమిలి ఎన్నికలకు రెడీ అవాలని చూస్తోంది అని అంటున్నారు. ఒకవేళ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక యూపీ ఎన్నికలను కాస్తా వెనక్కి జరిపి అన్నీ కలిపి 2028 లోనె ఎన్నికలకు సిద్ధపడొచ్చు అని అంటున్నారు. అపుడు మరిన్ని రాష్ట్రాలు కూడా చేరి జమిలి ఎన్నికలు రంజుగా సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ యూపీ ఎన్నికలతో లోక్ సభ ఎన్నికలు ముడిపెట్టాలని చూస్తోంది అని అంటున్నారు. అందుకోసమే జమిలి ఎన్నికల బిల్లుని తేబోతున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది.
విపక్షాన్ని దెబ్బ కొట్టాలని :
జమిలి ఎన్నికల వ్యూహం వెనక బీజేపీ ఆలోచనలు విపక్షాన్ని దెబ్బ కొట్టాలనే ఉన్నాయని అంటున్నారు. జమిలి ఎన్నికలు పెడితే ముందుగా ప్రాంతీయ పార్టీలు కొట్టుకుని పోతాయి. అలాగే రాష్ట్రాలు ప్రాంతీయ సమస్యలు ఎన్నికల అజెండాగా ఉండే చాన్స్ లేదు, అదే సమయంలో జాతీయ అంశాలే చర్చకు వస్తాయి. అలా మోడీ మేనియాతో అంతా కమ్మేయాలని దేశమంతా కమలం వికాసం జరిగేలా చూడాలని బీజేపీ ఎత్తుగడగా ఉంది అని అంటున్నారు.
కాంగ్రెస్ పై ఎత్తుతో :
అయితే బీజేపీ జమిలి మంత్రానికి కాంగ్రెస్ కొత్త మంత్రాన్ని పఠిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది అని అంటున్నారు. బీజేపీ జమిలి అంటే ప్రాంతీయ పార్టీలకు కూడా కలవరం రేగుతుంది. చాలా పార్టీలు ఈ రోజుకు న్యూట్రల్ గా ఉంటూ వస్తున్నాయి. అయితే జాతీయ వాదంతోనూ జాతీయ సమస్యలతోనూ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే బాగా నష్టపోతాయి అని అంటున్నారు. అందుకే దేశంలో అపుడు ఉన్న రెండే కూటములలో ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ఏపీలో వైసీపీ లాంటి పార్టీలకు ఇది ఒక విధంగా అగ్ని పరీక్షగానే చూడాలని అంటున్నారు. అయితే ఎన్డీయే కూటములు ఉన్న చోట ప్రాంతీయ పార్టీలు కచ్చితంగా ఇండియా బ్లాక్ లో చేరాల్సి ఉంటుంది. అలా కాంగ్రెస్ కి కొత్త బలం వస్తుందని అంటున్నారు.
కాంగ్రెస్ లన్నీ కలుస్తాయి :
ఇక దేశంలో కాంగ్రెస్ తో విడిపోయిన ఇతర పార్టీలు కొత్తగా ఏర్పాటు చేసుకున్న సొంత పార్టీలు అన్ని వచ్చి అఖండ కాంగ్రెస్ అయిన జాతీయ కాంగ్రెస్ లో చేరక తప్పదని అంటున్నారు. లేకపోతే ఆ పార్టీల ఉనికినే ముప్పు వస్తుందని అంటున్నారు. ఈ విషయాలను ఊహించి ఇప్పటికే మహారాష్ట్రలో శరద్ పవర్ కాంగ్రెస్ లో తన ఎన్సీపీని విలీనం చేసేందుకు సిద్ధపడుతున్నారు. అలా తృణమూల్ కాంగ్రెస్ వైసీపీ సహా ఇతర పార్టీలు కాంగ్రెస్ తో కలిసినా ఇండియా కూటమిలో చేరినా అపుడు విపక్ష శిబిరం బలోపేతం అవుతుందని అంటున్నారు. ఒక విధంగా జమిలి తో దెబ్బ కొడదామని బీజేపీ ఆలోచిస్తూంటే అదే జమిలి కాంగ్రెస్ కి కొత్త శక్తిని ఇస్తుందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి జమిలి చేసే మ్యాజిక్ ఎవరి జాతకం మారుస్తుందో.
