వన్-ఇన్, త్రీ-అవుట్.. సముద్రపు నీటితో ఇంధనం.. చైనా సంచలనం!
దీంతో ఈ ప్రాజెక్టు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కారణం... ఇది రెండు విలువైన వనరులను సృష్టించడానికి ఒకే యంత్రాన్ని ఉపయోగిస్తుంది.
By: Raja Ch | 19 Dec 2025 12:00 AM ISTఈ ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదగాలని.. అమెరికాను మించి విజయాలు సాధించాలని నిత్యం కలలు గంటూ, అందుకు సహకరించే సరికొత్త సంచలన ఆవిష్కరణలు అవిరామంగా చేస్తుంటుంది చైనా. ఈ క్రమంలో తాజాగా నీటి కొరత, పెరుగుతున్న ఇంధన వ్యయాలతో పోరాడుతున్న దేశాలకు ఊహించని ఓ శుభవార్తను వెల్లడించింది. సముద్రపు నీటిని అతి తక్కువ ఖర్చుతో అటు తాగు నీరుగా, ఇటు ఇంధనంగా మార్చింది.
అవును... రిజావో నగరంలో కొత్తగా ప్రారంభించబడిన ప్రాజెక్టులో.. క్యూబిక్ మీటర్ కు కేవలం పాతిక రూపాయల లోపు ఖరీదు చేసే సముద్రపు నీటిని ఒకే ప్రక్రియలో తాగునీరు, స్వచ్ఛమైన ఇంధనంగా మార్చవచ్చని చూపించింది. దీంతో.. శాస్త్రవేత్తలు దీన్ని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మలుపుగా అభివర్ణిస్తున్నారు. మరికొంతమంది ఆర్థికవేత్తలు మాత్రం ఇది అత్యంత విధ్వసకర ఆవిష్కరణలలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.
దీంతో ఈ ప్రాజెక్టు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కారణం... ఇది రెండు విలువైన వనరులను సృష్టించడానికి ఒకే యంత్రాన్ని ఉపయోగిస్తుంది. సముద్రపు నీరు, సమీపంలోని ఉక్కు, పెట్రోకెమికల్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వేడిని మాత్రమే ఉపయోగించి.. ఆల్ట్రా ప్యూర్ డ్రింకింగ్ వాటర్, గ్రీన్ హైడ్రోజన్లు ఉత్పత్తి చేస్తుంది. దీంతో... ఈ ప్రక్రియ సంచలనంగా మారింది.
వన్ ఇన్, త్రీ అవుట్!:
ఈ క్రమంలో దీన్ని వన్ ఇన్, త్రీ అవుట్ పద్దతిగా చెబుతున్నారు. ఇందులో సముద్రపు నీరు వ్యర్థ వేడితో కలిపి ఒక ఇన్ పుట్ అనుకుంటే.. దాని నుంచి మూడు వేర్వేరు అవుట్ పుట్ లు వస్తున్నాయి. అందులో మొదటిది తాగునీరు. దీని ప్రకారం.. ప్రతీ ఏటా 800 టన్నుల సముద్రపు నీటిని ప్రాసెస్ చేసి 450 క్యూబిక్ మీటర్లు (1,18,877 గ్యాలన్లు) ఆల్ట్రా ప్యూర్ నీటిని ఉత్పత్తి చేస్తారు.
ఇక రెండోది... ప్రతి ఏటా సుమారు 1,92,000 క్యూబిక్ మీటర్ల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో ప్రతీ సంవత్సరం సుమారు 100 బస్సులు 3,840 కి.మీ. ప్రయాణించడానికి సరిపోతుందని చెబుతున్నారు. మూడోది.. ఈ ప్రక్రియ 350 టన్నుల ఖనిజ సంపన్నమైన ఉప్పునీటిని కూడా అందిస్తుంది. ఈ విధంగా వన్ ఇన్, త్రీ అవుట్ ఆర్థిక వ్యవస్థను సాధిస్తుంది.
ప్రధానంగా దీనివల్ల చైనాలో నీటి ధర సగానికి పైగా తగ్గుతుందని అంటున్నారు. ఉదాహరణకు బీజింగ్ లో కుళాయి నీటి ధర ప్రస్తుతం 5 యువాన్లుగా ఉంది. అయితే, ఈ ప్లాంట్ లో సముద్రం నుంచి తయారు చేయబడిన నీటి ధర 2 యువాన్లు మాత్రమే అని చెబుతున్నారు.
