కేతన్ హత్య కేసులో షాకింగ్ నిజాలు : మ్యారేజ్ షాపింగ్ పేరుతో రూ.కోటి కొట్టేసి.. ప్రియుడి బిజినెస్‌కు మళ్లించిన సియా
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజురోజుకీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
By: A.N.Kumar | 29 Jun 2026 4:25 PM ISTదేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజురోజుకీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు విచారణను ముమ్మరం చేయడంతో నిందితుల గుట్టు ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతోంది. కాబోయే భర్తను నమ్మించి గొంతు కోయడమే కాకుండా అతని నుంచి భారీగా డబ్బులు లాగి ప్రియుడికి చేరవేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పెళ్లి షాపింగ్ పేరుతో భారీ వసూళ్లు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితురాలు సియా గోయల్... కేతన్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతనితో ప్రేమ నాటకం ఆడింది. పెళ్లి ఏర్పాట్లు, మ్యారేజ్ షాపింగ్, నగలు కొనుగోలు చేయాలనే నెపంతో కేతన్ అగర్వాల్ నుంచి విడతల వారీగా దాదాపు రూ.కోటి వరకు వసూలు చేసింది. కాబోయే భార్యే కదా అని నమ్మిన కేతన్, ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చాడు.
అయితే ఈ డబ్బును ఆమె పెళ్లి కోసం కాకుండా తన ప్రియుడు చేతన్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టినట్లు విచారణలో నివ్వెరపోయే నిజం బయటపడింది. ఒకవైపు కేతన్‌తో పెళ్లి ముచ్చట్లు చెబుతూనే.. మరోవైపు అతని సొమ్ముతో ప్రియుడి బిజినెస్‌ను సెటిల్ చేసే పనిలో పడింది. ఈ వ్యవహారం ఎక్కడా బయటపడకుండా సియా ఎంతో చాకచక్యంగా వ్యవహరించిందని అధికారులు పేర్కొన్నారు.
మూడేళ్ల పాటు పెళ్లి వాయిదా.. పక్కా స్కెచ్!
డబ్బులు మళ్లించిన విషయం కేతన్‌కు తెలిస్తే తమ గుట్టు రచ్చకెక్కుతుందని భావించిన సియా, ప్రియుడు చేతన్‌తో కలిసి అతడిని అడ్డుతొలగించుకోవాలని పక్కా స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే కేతన్‌ను దారుణంగా హత్య చేశారు. అయితే హత్య జరిగిన వెంటనే తామిద్దరూ పెళ్లి చేసుకుంటే అందరికీ అనుమానం వస్తుందని ఈ కిరాతక జంట ముందుగానే ఊహించింది.
పోలీసుల విచారణలో నిందితుల వాంగ్మూలం
"హత్య తర్వాత కనీసం మూడేళ్ల వరకు ఒకరినొకరు పెళ్లి చేసుకోకూడదని.. అప్పటివరకు వేర్వేరుగా ఉంటూ సాధారణ జీవితం గడపాలని ప్లాన్ చేసుకున్నాం. అలా చేస్తే పోలీసులకు ఎలాంటి అనుమానం రాదని.. నేరం నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చని భావించాం’’ అని నిందితులు ఒప్పుకున్నారు.
ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తు.. కీలక ఆధారాలు లభ్యం
ఇప్పటికే పోలీసులు నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. నిందితుల వాంగ్మూలాలతో పాటు సాంకేతిక ఆధారాలు ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. సియా, చేతన్ బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా రికార్డులు, వారి మధ్య జరిగిన డిజిటల్ చాటింగ్‌లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కేతన్ ఖాతా నుంచి సియా ఖాతాకు బదిలీ అయిన రూ.కోటి లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలు నిందితులకు ఉరితాడు బిగించనున్నాయి.
ప్రేమ, నమ్మకం పేరుతో మొదలైన ఈ పరిచయం చివరకు భారీ ఆర్థిక మోసం, పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా ముగిసింది. ఈ కేసులో ఇంకా ఎవరైనా సహకరించారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
