Begin typing your search above and press return to search.

నాన్న మాదిరి మాటలేనా? చేతలు లేవా చిన్నబాబు?

దీంతో.. తెలుగుదేశం వర్గీయులు.. సానుభూతిపరులు చంద్రబాబుపై తీవ్ర అసంత్రప్తితో రగిలిపోతున్నారు.

By:  Garuda Media   |   2 Oct 2025 11:00 AM IST
నాన్న మాదిరి మాటలేనా? చేతలు లేవా చిన్నబాబు?
X

పాతతరం రాజకీయానికి.. కొత్తతరం రాజకీయానికి.. ఈ రెండింటికి మధ్య నడిచే సంధిదశకు ప్రతినిధిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పాలి. 75 ఏళ్ల వయసులో ఉన్న టీడీపీ అధినేత కం ఏపీ ముఖ్యమంత్రిని ఈ కాలానికి తగ్గ నేతగా మారాలనుకోవటం అత్యాశే అవుతుంది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనట్లుగా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవటమే కాదు.. సరైన కేసు కాకున్నా.. వెనుకా ముందు చూడకుండా అరెస్టు చేసేయటం.. వారాల తరబడి జైల్లో ఉంచేయటం లాంటికి ఆయన ఫేస్ చేశారు. ముఖ్యమంత్రి పదవి.. ప్రతిపక్ష నేత హోదా ఆయనకు కొత్తేం కాకున్నా.. గతంలో ఆయనకు ఎప్పుడూ ఎదురుకాని చేదు అనుభవాలు వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుకు ఎదురయ్యాయి.

చివరకు ఆయన సతీమణిపై అసెంబ్లీ వేదికగా చేసుకొని వ్యాఖ్యలు చేసిన వేళ.. తీవ్రమైన భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న తీరు.. ఆ సందర్భంగా ప్రదర్శించిన ఆగ్రహం.. ఆ తర్వాత ఆ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు బాధ్యులైన వారిపై అంతకంతకూ బదులు తీర్చుకుంటానని చెప్పటం తెలిసిందే. కూటమి సర్కారు కొలువు తీరి ఎడాదిన్నర కావొస్తోంది. ఆయన ఎలా వ్యవహరించారు? విపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన మాటలకు.. ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరిస్తున్న తీరుకు ఏ మాత్రం సంబంధం లేదన్న సంగతి తెలిసిందే.

దీంతో.. తెలుగుదేశం వర్గీయులు.. సానుభూతిపరులు చంద్రబాబుపై తీవ్ర అసంత్రప్తితో రగిలిపోతున్నారు. అదే సమయంలో పాతకాలం రాజకీయ నేత అన్న విషయాన్ని గుర్తు చేసుకొని.. అంత పెద్ద మనిషి.. నేటి దూకుడు రాజకీయాలకు తగ్గట్లు వ్యవహరించాలని భావించటం అత్యాశే అవుతుందని తమను తాము సమాధానపర్చుకుంటున్న పరిస్థితి. ఇలా కొంతసేపు ఆగ్రహాన్ని.. మరికొంతసేపు అనునయాన్ని ప్రదర్శిస్తున్న తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు చినబాబును గురి పెడుతున్నారు.

పెద్దాయన పరిస్థితి అర్థమవుతుంది. గతకాలపు మనిషి నుంచి ఇప్పటి కాలపు దూకుడ్ని ఆశించటం అత్యాశే అవుతుందని.. చంద్రబాబులో లేని కాఠిన్యం.. లోకేశ్ లో లేకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇష్టారాజ్యంగా వ్యవహరించమని చెప్పట్లేదని.. అడ్డదిడ్డంగా వ్యవహరించే అధికారులు.. ఉన్నతాధికారుల విషయంలోనూ.. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరించకుంటే ఎలా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. విపక్షంలో ఉన్న వేళ.. పార్టీ నేతలు.. క్యాడర్ కు ఎదురవుతున్న దారుణ పరిస్థితుల వేళ.. రెడ్ బుక్ కాన్సెప్టు తీసుకొచ్చి కొత్త ఉత్సాహాన్ని నింపిన లోకేశ్. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఎప్పటికప్పుడు రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావటమే తప్పించి.. దాని సత్తా చూపటం లేదన్న ఫిర్యాదు అంతకంతకూ పెరుగుతోంది.

రెడ్ బుక్ వ్యవహారం ఎలా ఉందంటే.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న మాటను తరచూ ఎలా చెబుతారో., అలా చెప్పుకుంటూ పోవటమే తప్పించి.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న నర్మగర్భ మాటకు ఎఫెక్టు ఎంత ఉంటుందో తెలిసిందే. అలాంటిదేమీ రెడ్ బుక్ కు సంబంధించి మాటలే తప్పించి.. ఎలాంటి చేతలు ఉండట్లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

ప్రత్యర్థి పార్టీ నేతలు.. క్యాడర్ సంగతి తర్వాత.. సొంత పార్టీకి చెందిన నేతలు తోక జాడిస్తూ.. తమ సొంత ప్రయోజనాల కోసం మిత్రధర్మరాన్ని మరుస్తూ.. కూటమి కోటకు బీటలు వారేలా చర్యలు చేపడుతుంటే.. చినబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడాలన్న ఆలోచన కలలో రావటానికి సైతం ఇష్టపడని వైసీపీ నేతలకు తీరుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు ఉంటున్నారు? వారికి అంత బరితెగింపు ఎలా వస్తోంది? అన్న ప్రశ్నల్ని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కఠినంగా వ్యవహరించకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చని.. కానీ చినబాబు దూకుడుగా వ్యవహరించిన తీరు తెలుగు తమ్ముళ్లను నిరుత్సాహానికి గురి చేస్తోంది. చినబాబు మరీ ‘చిన్న’బాబుగా మారాడన్న విమర్శ అంతకంతకూ పెరుగుతోంది. తెలుగుదేశం క్యాడర్ లో పెరుగుతున్న అసంత్రప్తిని చంద్రబాబు.. లోకేశ్ లు గుర్తిస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.