టిప్ ఇస్తేనే క్యాబ్.. లేదంటే జాబ్.. ఓలా తెలివితేటలకు కేంద్రం రూ. 10 లక్షల యాడ్-ఆన్ షాక్
క్యాబ్ త్వరగా లభించాలంటే అదనంగా టిప్ ఇవ్వాలంటూ ప్రాంప్ట్‌లు చూపిస్తున్న ఓలాకు కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ విధానం వినియోగదారుల ఆందోళనను సొమ్ము చేసుకునే డార్క్ ప్యాటర్న్గా పేర్కొంది. 15 రోజుల్లోగా ఈ ప్రాంప్ట్‌లను యాప్, వెబ్సైట్ నుంచి తొలగించాలని ఆదేశించింది.
By: A.N.Kumar | 13 Nov 2026 7:00 PM ISTమనకు అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలి. చేతిలో ఫోన్.. స్క్రీన్ మీద ఓలా యాప్. క్యాబ్ బుక్ అయింది.. డ్రైవర్ కోసం వెతుకుతున్నాం అంటూ స్క్రీన్ మీద చక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది. నిమిషాలు గడుస్తుంటాయి.. మన గుండె వేగం పెరుగుతుంటుంది. సరిగ్గా అదే టైమ్‌లో యాప్ స్క్రీన్ మీద ఓ చిన్న మెసేజ్ ప్రత్యక్షమవుతుంది.. ఓ పది.. ఇరవై రూపాయలు టిప్ విసిరేస్తే క్యాబ్ రయ్‌మని వచ్చే ఛాన్స్ ఉంది గురూ అని.. అంటే అసలు ఛార్జీ కంటే ఎక్స్ట్రా ఇస్తేనే క్యాబ్ వస్తుందా? ఇవ్వకపోతే మనల్ని రోడ్డు మీదే వదిలేస్తారా? అన్న అనుమానం రాకమానదు. ఇలా ప్రయాణికుల కంగారునే తమ ఆదాయ మార్గంగా మార్చుకున్న ఓలా సంస్థకు కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) గట్టిగానే ఝలక్ ఇచ్చింది. ఏకంగా రూ.10 లక్షల జరిమానా విధించి ఈ తరహా ఆశపెట్టే ప్రాంప్ట్‌లను తక్షణమే ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
క్యాబ్ బుక్ చేసేటప్పుడు టిప్ యాడ్ చేస్తే త్వరగా రైడ్ దొరికే అవకాశం ఉంది అంటూ రూ.10 నుంచి రూ.40 వరకు ఆప్షన్లు చూపించడం ఓలాకు అలవాటు. సరే నిజంగానే ఇలా ఎక్స్ట్రా డబ్బులు కొట్టిన వారికి డ్రైవర్లు రాకెట్ వేగంతో వస్తున్నారా? అని సీసీపీఏ అడిగితే.. ఓలా దగ్గర సమాధానం లేదు.. శాస్త్రీయ ఆధారాలూ లేవు.. కేవలం ప్రయాణికుల మానసిక ఆందోళనను క్యాష్ చేసుకునే డార్క్ ప్యాటర్న్ ఎత్తుగడ ఇది అని కేంద్రం తేల్చేసింది.
ఇక్కడ ఓలా వేసిన మరో మాస్టర్ ప్లాన్ ఏంటంటే.. టిప్ అని అడిగితే జనం, అధికారులు అభ్యంతరం చెబుతున్నారని 2025 మే నెలలో తెలివిగా దానికి యాడ్-ఆన్ అని నామకరణం చేసింది. పాత సీసాలో కొత్త సారా పోసినట్లు పేరు మార్చి అదే పాత దందాను కొనసాగించింది. "ఆ డబ్బులన్నీ డ్రైవర్లకే వెళ్తాయి.. కస్టమర్లే ఇష్టపడి ఇస్తున్నారు" అని ఓలా చెప్పిన కబుర్లను సీసీపీఏ ఏమాత్రం నమ్మలేదు. అసలు ప్రయాణమే మొదలవ్వకముందే ఇచ్చే దాన్ని 'టిప్' అని ఎలా అంటారు? అది ముమ్మాటికీ ముందస్తు వసూలేనని స్పష్టం చేసింది.
వినియోగదారుల రక్షణ చట్టం-2019 నిబంధనలను తుంగలో తొక్కినందుకు రూ.10 లక్షల ఫైన్ కట్టడంతో పాటు 15 రోజుల్లోగా ఈ ఎక్స్ట్రా వసూళ్ల డిజైన్లను యాప్.. వెబ్సైట్ల నుంచి పీకేసి రిపోర్ట్ ఇవ్వాలని సీసీపీఏ హుకుం జారీ చేసింది.
ఈ తీర్పు క్యాబ్ ప్రయాణికులకు పెద్ద ఊరట. ఇకపై క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఇస్తేనే వస్తాం అనే పరోక్ష బెదిరింపులకు కాలం చెల్లినట్లే. టిప్ అనేది ప్రయాణం పూర్తయ్యాక డ్రైవర్ సేవ నచ్చితే సంతోషంగా ఇవ్వాల్సింది కానీ రైడ్ దొరకదనే భయంతో ముందే సమర్పించుకునే లంచం కాదని కేంద్రం గట్టిగానే బుద్ధి చెప్పింది.
