Begin typing your search above and press return to search.

గర్భిణికి వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరణ.. కంపెనీకి రూ.211 కోట్ల భారీ జరిమానా..

పని చేసే చోట మానవత్వం మర్చిపోతే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో చెప్పే సంఘటన ఇది.

By:  Madhu Reddy   |   22 March 2026 12:06 AM IST
గర్భిణికి వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరణ.. కంపెనీకి రూ.211 కోట్ల భారీ జరిమానా..
X

పని చేసే చోట మానవత్వం మర్చిపోతే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో చెప్పే సంఘటన ఇది. గర్భిణి అని కూడా చూడకుండా, అత్యవసర పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరించిన ఒక కంపెనీకి అమెరికాలోని ఒహాయో జ్యూరీ ఏకంగా రూ. 211 కోట్ల (22.5 మిలియన్ డాలర్లు) భారీ జరిమానా విధించింది. కంపెనీ మొండితనం వల్ల ఒక పసిప్రాణం గాలిలో కలిసిపోవడమే ఈ కఠిన తీర్పుకు కారణం. అసలు ఆ మహిళకు ఏమైంది? కోర్టు అంత పెద్ద శిక్ష ఎందుకు వేసింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

హై రిస్క్ ప్రెగ్నెన్సీ - కంపెనీ మొండితనం:

బాధిత మహిళ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఆమె గర్భం దాల్చిన తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా అది 'హై రిస్క్ ప్రెగ్నెన్సీ'గా మారింది. డాక్టర్ల సూచన మేరకు ఆమె తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని తన కంపెనీని వేడుకుంది. కానీ, సదరు సంస్థ ఆమె విన్నపాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కచ్చితంగా ఆఫీసుకే రావాలని నిబంధన విధించింది. ఇక ఉద్యోగం పోతుందనే భయంతో, ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా ఆమె ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది.

తీరని లోటు - పసిబిడ్డ మరణం:

ఆఫీసుకు వెళ్లడం వల్ల కలిగిన శారీరక శ్రమ, ఒత్తిడి కారణంగా ఆమెకు నెలలు నిండకుండానే ప్రసవం జరిగింది. అత్యవసర స్థితిలో బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, ఆ చిన్నారి కేవలం కొన్ని గంటలు మాత్రమే ప్రాణంతో ఉంది. నెలలు నిండకముందే పుట్టడం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ఆ పసికందు మరణించింది. తన బిడ్డ మరణానికి కంపెనీ యాజమాన్యమే కారణమని సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. ఇక తన అనారోగ్యాన్ని, డాక్టర్ల రిపోర్టులను కంపెనీ బేఖాతరు చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

కోర్టు ఘాటు తీర్పు - రూ. 211 కోట్ల జరిమానా:

ఈ కేసును విచారించిన ఒహాయో జ్యూరీ, కంపెనీ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల కనీస అవసరాలను, ప్రాణాపాయ స్థితిని గుర్తించడంలో యాజమాన్యం ఘోరంగా విఫలమైందని తేల్చింది. ఆ పసిబిడ్డ మరణానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేస్తూ, బాధితురాలి కుటుంబానికి సుమారు రూ. 211 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇక ఇది కేవలం జరిమానా మాత్రమే కాదు, భవిష్యత్తులో ఏ కంపెనీ కూడా ఇలాంటి తప్పు చేయకూడదనే హెచ్చరిక అని కోర్టు అభిప్రాయపడింది.

సంస్థ రియాక్షన్ - భవిష్యత్తు సవాళ్లు:

అయితే, ఈ భారీ జరిమానాపై సదరు కంపెనీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇంత పెద్ద మొత్తంలో జరిమానా కట్టడం సాధ్యం కాదని వాదిస్తోంది. కానీ, ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల ఆరోగ్యం, ముఖ్యంగా గర్భిణీల పట్ల సంస్థలు ఎంత బాధ్యతగా ఉండాలో ఈ కేసు నిరూపించింది. ఇక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి మొండికేయడం వల్ల ఒక ప్రాణం పోవడం నిజంగా క్షమించరాని నేరమని జ్యూరీ భావించింది.