ఎక్కడికి వెళ్లినా ‘ఆధార్’.. ఇప్పుడు ఏం అవుతుందో తెలుసా?
దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 21 Nov 2025 3:22 PM ISTదేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆధార్ వ్యవస్థతో గుర్తింపు, పంపిణీ, సేవా రంగాలను సమూలంగా మార్చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆఫ్ లైన్ ఆధార్ వ్యవస్థను తీసుకురావాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే దేశ పౌరులు ఇకపై ఎక్కడికి వెళ్లినా తమ ఆధార్ గుర్తింపును చూపాల్సివుంటుందని అంటున్నారు. సినిమా చూసేందుకు థియేటర్ లోకి వెళ్లాలన్నా.. హోటల్ కి వెళ్లినా, గేటెడ్ కమ్యూనిటీలో ప్రవేశించాలన్నా.. ఇలా ఒకటేంటి అడుగు తీసి అడుగు వేస్తే మీ ఆధార్ చూపాల్సివుంటుందని అంటున్నారు.
ఈ విధానం వల్ల దేశభద్రతను మరింత మెరుగుపరచవచ్చని కేంద్రం భావిస్తోందని అంటున్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా ఆధార్ వివరాలను సమర్పించాల్సివస్తే పౌరుల వ్యక్తిగత జీవితంలోకి చొరబడినట్లు అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్రం ఈ విషయంపై మరింత అధ్యయనం చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదనల్లో ఉన్న ‘ఆఫ్ లైన్ ఆధార్’ వ్యవస్థలో పౌరులు తమ ఆధార్ కార్డును ఆయా చోట్ల ఏర్పాటు చేసే పరికరాల వద్ద స్కాన్ చేయాల్సివుంటుంది. ఇలా చేయడం వల్ల వచ్చి ఆయా చోటుకు వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలు నమోదు అవుతాయి. భవిష్యత్తులో ఏదైనా సంఘటనపై విచారణ జరిపాల్సిన అవసరం వస్తే ఈ వివరాలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని అంటున్నారు.
ఆధార్ వినియోగాన్ని విస్తృత పరిచేలా ‘ఆఫ్ లైన్ ఆధార్’ అనే కొత్త సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ సూచనలతో ఆధార్ ను పర్యవేక్షించే యూఐడీఏఐ ఓ కొత్తయాప్ ను రూపొందిస్తోంది. ప్రస్తుతం దీనిపై తుదిదశ పరీక్షలు జరుగుతున్నాయని, యాప్ నియంత్రించే నిబంధనల రూపకల్పన మీద కూడా కసరత్తు జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరికొన్ని నెలల్లో ఈ యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.
ఆఫ్ లైన్ ఆధార్ అందుబాటులోకి వస్తే ఇప్పటిలాగా ఆధార్ కార్డు లేదా దాని జెరాక్స్ కాపీని వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. క్యూఆర్ కోడ్ తరహాలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెబుతున్నారు. యూఐడీఏఐ సర్వర్ తో అనుసంధానం కాకుండానే ఆఫ్ లైన్ ఆధార్ పనిచేస్తుందని అంటున్నారు. అయితే దీనిపై పూర్తి సాంకేతిక వివరాలు ఇంకా బయటకు రాలేదు. ప్రభుత్వం కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. అయినప్పటికీ పలు ఆంగ్ల వెబ్ సైట్లలో దీనిపై కథనాలు వస్తున్నాయి. ఇక నిత్య జీవితంలో అడుగడుగునా గుర్తింపును ధ్రువీకరించుకోవాల్సిన పరిస్థితి వస్తే వ్యక్తిగత స్వేచ్ఛ మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే దేశ భద్రత, ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు వంటి సందర్భాల్లో ఈ తరహా ఏర్పాట్లు మేలు చేస్తాయని అంటున్నారు.
