పోలీస్ భయం.. మగాళ్లంతా జంప్!!
పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఒడిశాలోని ఓ గ్రామంలోని మగాళ్లు అంతా పరార్ అయ్యారు
By: Tupaki Political Desk | 17 Feb 2026 8:15 AM ISTపోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఒడిశాలోని ఓ గ్రామంలోని మగాళ్లు అంతా పరార్ అయ్యారు. రెండు రోజులుగా గ్రామానికి రాకుండా తిరుగుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో కేవలం మహిళలే ఉన్నారు. పురుషులు ఎప్పుడు వస్తే, అప్పుడు అరెస్టు చేద్దామనే ఉద్దేశంతో పోలీసులు కూడా గ్రామంలోనే కాచుకు కూర్చున్నారని అంటున్నారు. దీంతో ఆ గ్రామంలో అరెస్టుల వ్యవహారంపై విస్తృత చర్చ జరుగుతోంది. గ్రామంలోని పురుషులు అంతా ఊరు విడిచివెళ్లిపోవడానికి కూడా పెద్ద కారణమే ఉందని అంటున్నారు. మొత్తానికి దొంగ పోలీస్ కథలా ఉన్న ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒడిశాలోని గంజాం జిల్లా భంజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సార్దుల అనే గ్రామంలో ఓ వ్యక్తిపై గ్రామస్థులు సామూహికంగా దాడి చేశారు. ఈ ఘటనలో కొంధమాల్ జిల్లాకు చెందిన బాణధర ప్రధాన అనే 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మృతుడితోపాటు మరో ముగ్గురు గత శుక్రవారం అనుమానాస్పదంగా గ్రామంలో సంచరిస్తుండగా, అనుమానంతో పోలీసులు వారిని వెంబడించారు. ముగ్గురు తప్పించుకోగా, బాణధర ప్రధాన్ గ్రామస్థులకు దొరికిపోయాడు. అతడిని ఓ స్తంభానికి కట్టేసి కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.
దీంతో తమను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందనే భయంతో గ్రామంలో ఉన్న పురుషులు అంతా ఊరు విడిచి వెళ్లిపోయారని కథనాలు వస్తున్నాయి. అయితే ఈ సంఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామని అదనపు ఎస్పీ రంజన్ కుమార్ దే ప్రకటించారు. దీంతో గ్రామస్థులు అరెస్టు భయంతో గ్రామానికి రావడానికి భయపడుతున్నారు. ఒడిశాలో ఇలా పోలీసు భయంతో గ్రామీణులు ఊరు విడిచి వెళ్లిపోవడం సర్వసాధారణంగా చెబుతున్నారు. అక్రమ ఇసుక మైనింగ్, పరిశ్రమల స్థాపనకు భూ సేకరణ చేసే సందర్భాల్లో ఇలాంటి ఉదంతాలు గతంలో చోటుచేసుకున్నాయి.
ఒడిశా పల్లెల్లో పేదరికం ఎక్కువగా ఉండటం కూడా పోలీసులు, అరెస్టులు అంటే గ్రామీణులు ఎక్కువగా భయపడుతుంటారు. గ్రామస్థులు సామూహికంగా ఊర్లు విడిచి వెళ్లడం లేదా గ్రామాల సరిహద్దులను మూసివేసి నిరసన తెలపడం వంటివి చేస్తుంటారని చెబుతున్నారు. అదేవిధంగా గంజాయి నిర్మూలకు పోలీసులు గ్రామాల్లో సివిల్ డ్రెస్సుల్లో పర్యటిస్తే, వారిని కిడ్నాపర్లుగా భావించి గ్రామస్థులు దాడిచేసిన ఉదంతాలు ఈ రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇలా దాడులు చేసిన తర్వాత పోలీసుల ప్రతికార చర్యలకు భయపడి ఆయా గ్రామాల్లో పురుషులు నెలలు తరబడి ఇళ్లకు రాకుండా తప్పించుకుంటూ ఉంటుంటారని అంటున్నారు.
