Begin typing your search above and press return to search.

ఒడిశాలో అమానవీయ ఘటన.. ఆఖరి మజిలీ కూడా మనసు కరిగించలేదా?

ఆపదలో ఉన్నప్పుడు తోడుగా నిలబడటం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మన సంస్కృతిలో భాగం.. దీన్నే మానవత్వం అని అంటారు.

By:  Tupaki Political Desk   |   26 Jun 2026 12:26 PM IST
ఒడిశాలో అమానవీయ ఘటన.. ఆఖరి మజిలీ కూడా మనసు కరిగించలేదా?
X

ఆపదలో ఉన్నప్పుడు తోడుగా నిలబడటం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మన సంస్కృతిలో భాగం.. దీన్నే మానవత్వం అని అంటారు. అందుకే మానవతా విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని పెద్దలు చెబుతారు. కానీ, కొందరు కొన్ని సామాజిక రుగ్మతలతో మానవత్వాన్నే మరచిపోతున్నారు. దీనికి తాజా ఉదాహరణ ఒడిశాలోని కంటాపడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు మరణిస్తే, ఆమె అంతిమ ప్రయాణానికి పాడె మోసేందుకు గ్రామంలో ఏ ఒక్కరు సహరించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వృద్ధురాలి కుమారులు సైకిల్‌పైనే తల్లి మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది. ఈ సంఘటనతో మన సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయంగా నెటిజన్లు మండిపడుతున్నారు.

గ్రామంలో ఎంతో మంది ఉన్నప్పటికీ వృద్ధురాలి అంతిమ సంస్కారాలు చేసేందుకు నలుగురు కలిసి రాకపోవడం అత్యంత ఘోరమని అంటున్నారు. ఇలా గ్రామం అంతా ఆ కుటుంబాన్ని శిక్షించడానికి కారణం కూడా పెద్దదేమీ కాదు. వృద్ధురాలి కుమారులు ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్నారన్న ఏకైక కారణంతో, ఆ గ్రామానికి చెందిన పెద్దలు ఆ కుటుంబంపై సామాజిక బహిష్కరణ విధించారు. సమాజంలో అందరితో కలిసి ఉండాల్సిన వారు, కేవలం వ్యక్తిగత నిర్ణయాల వల్ల అంటరానివారిగా చూడబడటం ఎంతో బాధాకరం. వృద్ధురాలు మరణించిన తర్వాత, ఆమె అంతిమ సంస్కారాలకు కనీసం నలుగురు వ్యక్తులు ముందుకు రాకపోవడం, ఆ గ్రామంలోని కుల వివక్ష ఎంతటి అగాధాన్ని సృష్టించిందో స్పష్టం చేస్తోంది.

సాధారణంగా చావు ఏదైనా, మనిషి మరణించిన తర్వాత కులమతాలకు అతీతంగా గౌరవించడం మన సంప్రదాయం. కానీ, ఇక్కడ మరణం కూడా ఆ గ్రామస్థుల కఠిన మనసులను కరిగించలేకపోయింది. అప్పటివరకు పక్కనే ఉన్నవారు, చివరకు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లే సమయంలో కూడా అడ్డుపడటం లేదా కనీసం స్పందించకపోవడం దారుణం. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఇద్దరు కుమారులు, తమ తల్లి మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి శ్మశానానికి తరలించడం చూస్తుంటే, మానవత్వం ఎంతటి దుస్థితిలో ఉందో అర్థమవుతుంది.

ఈ హృదయవిదారక దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, గ్రామస్థుల వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 21వ శతాబ్దంలో, సాంకేతికతతో ప్రపంచం పరుగులు తీస్తున్న తరుణంలో, ఇలాంటి ఛాందస భావాలు, కుల అహంకారాలు ఇంకా బతికే ఉండటం సమాజ వికాసానికి గొడ్డలి పెట్టు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వృద్ధురాలి ఆఖరి మజిలీని కూడా కులానికి ముడిపెట్టడం అమానవీయమని అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం చట్టాలే సరిపోవని, సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోనంత వరకు, మనం ఎంత అభివృద్ధి చెందినా అది శూన్యమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒడిశాలోని ఈ ఘటన, సమాజంలోని మూఢాచారాలకు ఒక హెచ్చరికలాంటిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరణం తర్వాత అందరూ సమానమేనని, ఆ విషయాన్ని గుర్తించి ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడటమే నిజమైన మానవత్వమని మనం గుర్తించాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు.