Begin typing your search above and press return to search.

భారత్ లో చార్టర్ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్... దయనీయంగా దృశ్యాలు!

ఈ సంఘటనను బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ధృవీకరించారు. విమానంలో ఉన్నవారందరినీ సురక్షితంగా తరలించామని.. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

By:  Raja Ch   |   10 Jan 2026 7:02 PM IST
భారత్  లో చార్టర్  ఫ్లైట్  క్రాష్  ల్యాండ్... దయనీయంగా దృశ్యాలు!
X

గత ఏడాదిలో భారత్ లో విమానాలకు సంబంధించిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమాన ప్రమాదం నుంచి మొదలు అన్నట్లుగా.. వరుసగా విమానాలకు సంబంధించిన ఘటనలు పలు చోటు చేసుకున్నాయి! ఈ నేపథ్యంలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. ఒడిశాలో మినీ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన దృశ్యాలు దయనీయంగా ఉన్నాయి.

అవును... భువనేశ్వర్ నుంచి రూర్కెలా వెళ్తుండగా.. జల్డా సమీపంలో మినీ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారని ఒడిశా వాణిజ్య, రవాణా మంత్రి బిబి జెనా తెలిపారు. నైన్ సీట్స్ ప్రైవేటు మినీ విమానం ప్రమాదానికి గురైందని.. ప్రయాణికులకు గాయాలయ్యాయని.. దేవుని దయవల్ల ఇది పెద్ద ప్రమాదం కాదని.. ఇది రూర్కేలా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్డా వద్ద జరిగిందని మంత్రి జెనా వెల్లడించారు.

ఈ సంఘటనను బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ధృవీకరించారు. విమానంలో ఉన్నవారందరినీ సురక్షితంగా తరలించామని.. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మరోవైపు.. ఈ సంఘటన గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి సమాచారం అందిందని.. ఈ సందర్భంగా అధికారులు ప్రమాద స్థలిని సందర్శించి అంచనా వేస్తారని అంటున్నారు. ఈ విమానాన్ని ప్రైవేట్ క్యారియర్ ఇండియా వన్ ఎయిర్ నడుపుతుంది!

ఈ విమానంలో నలుగురు ప్రయాణికులు.. ఇద్దరు సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు! ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని.. ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని చెబుతున్నారు! మరోవైపు ఈ సంఘటన వద్ద రక్తంతో, విపరీతమైన నొప్పితో నేలపై పడి బాధపడుతున్న ప్రయాణికులు, సిబ్బంది ఫోటోలు దయనీయంగా ఉన్నాయి!

ఈ సందర్భంగా స్పందించిన జిల్లా సీనియర్ అధికారి ఒకరు... విమానం ల్యాండింగ్‌ కు కొద్ది క్షణాల ముందు సాంకేతిక లోపం సంభవించిందని.. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ కు సమాచారం అందించిన వెంటనే అత్యవసర ప్రోటోకాల్‌ లు యాక్టివేట్ చేయబడ్డాయని తెలిపారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న గ్రామస్తులు ముందుగా వచ్చి ప్రయాణీకులను శిథిలాల నుండి బయటకు తీయడంలో సహాయపడ్డారని.. సమాచారం అందిన వెంటనే రూర్కెలా నుండి పోలీసు, ఫైర్, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు.