రూ.7 కోట్ల ధార్ వాహనాలకు 5 కోట్ల మెరుగులా? అటవీశాఖపై యాక్షన్ షురూ
ఈ ఖర్చుపై విమర్శలు రావడంతో అటవీశాఖ అధికారులు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. ఒడిశాలో దండకారణ్యం, తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి.
By: A.N.Kumar | 24 Dec 2025 4:00 AM ISTప్రభుత్వ సొమ్ము అయితే చాలు పప్పు బెల్లాల్లా ఖర్చు పెట్టేస్తారు అధికారులు, ప్రజాప్రతినిధులు. తమ సుఖం సౌక్యం కోసం ఎంతకైనా వెచ్చించడానికి వెనుకాడరు. ఇప్పుడూ అదే జరిగింది. తాజాగా ఒడిశా అటవీ శాఖలో వెలుగుచూసిన ‘థార్ వాహనాల కొనుగోలు తర్వాత మార్పుల వ్యవహారం’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అటవీ శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివాదానికి కారణం ఏమిటి?
ఒడిశా అటవీ శాఖ అధికారులు అడవుల పర్యవేక్షణ కోసం రూ.7 కోట్లతో అత్యాధునిక మహీంద్రా థార్ వాహనాలను కొనుగోలు చేశారు. అయితే కేవలం కొనుగోలుతో ఆగకుండా వాటికి అదనపు హంగులు, అత్యాధునిక లైట్లు, ఇతర పరికరాలను అమర్చడం కోసం మరో రూ.5 కోట్లు ఖర్చు చేశారు. అంటే వాహనాల ధరలో 70 శాతం మొత్తాన్ని కేవలం అలంకరణలు.. మార్పుల కోసమే వెచ్చించడం ఇప్పుడు వివాదాస్పదమైంది.
విధి నిర్వహణకు అంటూ దుబారా
ఈ ఖర్చుపై విమర్శలు రావడంతో అటవీశాఖ అధికారులు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. ఒడిశాలో దండకారణ్యం, తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇలాంటి ఎగుడుదిగుడు ప్రాంతాల్లో ప్రయాణించడానికి సాధారణ వాహనాలు పనికి రావు. కలప అక్రమ రవాణాదారులను పట్టుకోవాలన్నా.. వన్యప్రాణులను కాపాడాలన్నా వేగంగా వెళ్లే శక్తివంతమైన వాహనాలు అవసరం. రాత్రి సమయంలో పర్యవేక్షణ కోసం .. అడవుల్లో చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శక్తివంతమైన లైట్లు, సెర్చ్ లైట్లు తప్పనిసరి అని వారు వాదిస్తున్నారు.
ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశం
2024లో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. కేవలం మార్పుల కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉండవచ్చని ప్రతిపక్షాలు , ప్రజలు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. అటవీశాఖలో పారదర్శకత ఉండాలని.. ప్రజాధనాన్ని వృథా చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోపే ఇలాంటి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై విచారణకు మొగ్గు చూపింది.
అటవీ సంరక్షణ ముఖ్యం అనడంలో సందేహం లేదు, కానీ ఆ పేరుతో విలాసవంతమైన మార్పులకు కోట్లాది రూపాయలు వెచ్చించడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి.
