మాజీ మంత్రి సబితకు నోటీసులు: హైకోర్టు కీలక ఆదేశం
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఓబుళాపురం మైనింగ్ గనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
By: Garuda Media | 18 Aug 2025 5:30 PM ISTతెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓబులాపురం మైనింగ్ అక్రమాల కేసులో తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమెతో పాటు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐఏఎస్ కృపానందానికి కూడా నోటీసులు జారీ చేసింది. గతంలో నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఏం జరిగింది?
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఓబుళాపురం మైనింగ్ గనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీనిపై సీబీఐ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ మైనింగ్ అనుమతులు ఇవ్వడంలో అప్పటి మంత్రిగా సబిత, ఐఏఎస్ అధికారులు కృపానందం, శ్రీలక్ష్మి సహా పలువురి పాత్ర ఉందని పేర్కొంది. ఈ క్రమంలో వారిపై ఛార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. అయితే.. తమకు ఈ కేసుతో సంబంధం లేదని.. విధానపరమైన నిర్ణయానికి మాత్రమే తాము కట్టుబడి ఉన్నామని వారు వాదనలు వినిపించారు.
ఈ క్రమంలోనే నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్లు వేసి.. ఉపశమనం పొందారు. శ్రీలక్ష్మి విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమెపై తిరిగి కేసును కొనసాగిస్తున్నారు. తాజాగా సబిత, కృపానందంలను కూడా నాంపల్లి కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ.. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని.. కృపానందం సహా.. సబితను ఆదేశించింది. అనంతరం విచారణను సెప్టెంబరు కు వాయిదా వేసింది.
