Begin typing your search above and press return to search.

ఓపెన్ అయిన మాజీ సీజేఐ....వైసీపీ మీద ఇండైరెక్ట్ ఎటాక్

అమరావతి రాజధాని రైతులు చేసిన త్యాగం గొప్పదని రమణ అన్నారు వారు తమకు వారసత్వంగా వచ్చిన భూములను కేవలం రాష్ట్రం కోసం త్యాగం చేశారు అని అన్నారు.

By:  Satya P   |   3 Nov 2025 1:45 PM IST
ఓపెన్ అయిన మాజీ సీజేఐ....వైసీపీ మీద ఇండైరెక్ట్ ఎటాక్
X

దేశంలో న్యాయవ్యవస్థ మీద ఈ రోజుకీ అందరికీ నమ్మకం ఉంది. ఏ వ్యవస్థలో అయినా అన్యాయం జరిగినా సరిదిద్ది తగిన న్యాయం చేస్తుందని ఈ దేశంలో సగటు పౌరుడు నమ్ముతాడు. ఇదిలా ఉంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో సీజేఐగా పనిచేయడం అంటే నడుస్తున్న ఒక న్యాయాలయం గానే వారిని చూడాలి. ఇక వారి మీదనే ఒక దశలో ఒత్తిడి వచ్చింది అంటే ఏమి జరుగుతోంది అన్నది మేధావుల నుంచి కూడా సామాన్యుల వరకూ చర్చగానే ఉంటుంది. మ్యాటర్ లోకి వస్తే మాజీ సీజేఐ ఎన్‌వీ రమణ అయితే ఇన్నాళ్ళకి ఓపెన్ అయ్యారు. ఫ్లాష్ బ్యాక్ ని ఆయన ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. నాడు ఏమి జరిగిందో చెబుతూ ఇండైరెక్ట్ గా ఆనాటి వైసీపీ ప్రభుత్వం మీద ఎటాక్ చేశారు.

ఒత్తిళ్ళు పెట్టారని అంటూ :

న్యాయ వ్యవస్థ మీద ఒక దశలో ఒత్తిళ్ళు పెట్టారని ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు తన మీదనే ఒత్తిళ్ళు వచ్చాయని ఆయన అన్నారు. అమరావతి ఉద్యమానికి తాను అండగా నిలబడటం వల్లనే తనపైన కూడా ఒత్తిళ్ళు తెర వెనక కుట్రలకు పాల్పడ్డారు అని హాట్ కామెంట్స్ చేసారు. ఏకంగా తన కుటుంబ సభ్యుల మీదనే క్రిమినల్ కేసులు పెట్టారని, భూములు కొనడమే నేరంగా చిత్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ రాజకీయంగా ప్రతీకార చర్యలుగానే చూడాలని అన్నారు.

రైతుల త్యాగం గొప్పది :

అమరావతి రాజధాని రైతులు చేసిన త్యాగం గొప్పదని రమణ అన్నారు వారు తమకు వారసత్వంగా వచ్చిన భూములను కేవలం రాష్ట్రం కోసం త్యాగం చేశారు అని అన్నారు. ఒక పవిత్రమైన ఉద్దేశ్యంతో చేసిన ఈ ప్రయత్నానికి న్యాయ వ్యవస్థ కూడా అండగా నిలబడింది అని ఆయన గతాన్ని గుర్తు చేశారు. అయితే ఆ అండ ఉన్నందుకు గానూ ఒత్తిళ్ళు మామూలుగా రాలేదని ఆయన గతాన్ని తలచుకున్నారు. అమరావతి రాజధాని విషయంలో న్యాయం ధర్మం గెలిచిందని అన్నారు.

గతంలో ఏమి జరిగింది :

ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు మూడు రాజధానులు ప్రస్తావన చేసింది. దాని మీద అసెంబ్లీలో చట్టాన్ని కూడా చేసింది. సరిగ్గా అదే సమయంలో ఎన్వీ రమణకు సుప్రీం కోర్టులో సీజేఐ అయ్యే చాన్స్ వచ్చింది. అయితే ఆయన మీద ఏకంగా నాటి సీఎం ఫిర్యాదు చేస్తూ లేఖ కూడా కేంద్ర పెద్దలకు రాశారు అన్నది ఉంది. అప్పట్లో ఈ విషయం కలకలమే రేపింది. ఆ లేఖ న్యాయ వ్యవస్థ మీద ధిక్కరణ అని జాతీయ స్థాయిలో డిబేట్లు జరిగాయి. మొత్తం మీద ఆ లేఖలోని సారాంశాలను ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు అంతర్గతంగా విచారణ జరిపించింది. అయితే అందులో వాస్తవాలు లేవని తేల్చారు. ఇక ఎన్వీ రమణ సీజేఐ గా బాధ్యతలు స్వీకరించి సుమారు రెండేళ్ళ పాటు కొనసాగారు. ఆయన 2022 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. ఇప్పటికి మూడేళ్ళు పై దాటింది. ఇన్నేళ్ళ తరువాత ఆయన తాజాగా అమరావతికి వచ్చిన సందర్భంగా నాటి అంశాలని పరోక్షంగా ప్రస్తావిస్తూ న్యాయ వ్యవస్థకు కూడా ఒత్తిళ్ళు తెచ్చే రాజకీయాలు సాగాయని చెప్పడం విశేషం అంటున్నారు.

న్యాయం ఉన్నందువల్ల :

అమరావతి రాజధాని విషయంలో న్యాయం ఉంది అని అందుకే న్యాయ వ్యవస్థ కూడా గట్టిగా నిలబడింది అని మాజీ సీజేఐ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. ఆనాడు కనుక ఒత్తిళ్ళకు లొంగి తగ్గిపోతే అమరావతి రాజధాని ప్రాజెక్ట్ కానీ ఆ స్వరూపం కానీ ఉండేది కాదేమో అన్న మాట కూడా ఆయన అనడం విశేషం. ఆ సమయంలో రాజ్యాంగం కోసం ఆలోచించినందుకు పలువురు న్యాయమూర్తులకు బదిలీలు బహుమతిగా ఇచ్చారని అన్నారు. అయితే న్యాయ వ్యవస్థ మీద రాజకీయ ఒత్తిడులు ఉండరాదు అని ఆయన అంటూ అలా కనుక జరిగితే అది చాలా ప్రమాదకరమైన ధోరణులకు దారి తీస్తుందని అన్నారు. మొత్తం మీద చూస్తే మాజీ సీజేఐ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఫ్లాష్ బ్యాక్ లో ఏమి జరిగింది అన్నది అంతా మరోసారి మననం చేసుకోవడం చేస్తున్నారు. చాలా కాలానికి ఈ విధంగా ఒక మాజీ సీజేఐ ఓపెన్ అయి గతాన్ని చెప్పడం మాత్రం ఇపుడు చర్చనీయాంశంగానే ఉంది.