Begin typing your search above and press return to search.

అంతరిక్ష్యంలో న్యుటెల్లా.. గర్వంగా చెప్పుకున్న కంపెనీ..

సాధారణంగా అంతరిక్షంలో ఆహారం తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ద్రవ పదార్థాలు లేదా చిన్న ముక్కలు నౌక అంతా చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంటుంది.

By:  Tupaki Political Desk   |   7 April 2026 3:01 PM IST
అంతరిక్ష్యంలో న్యుటెల్లా.. గర్వంగా చెప్పుకున్న కంపెనీ..
X

చంద్రుడిని చుట్టి రావాలనే మానవజాతి కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్ర ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈసారి కేవలం వ్యోమగాముల సాహసాలే కాదు, అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ‘తీపి’ అతిథి కూడా అంతరిక్ష నౌకలో ప్రత్యక్షమైంది. వ్యోమగాములతో పాటు శూన్యంలో తేలియాడుతూ కనిపించిన ఆ దృశ్యం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

జీరో గ్రావిటీలో న్యుటెల్లా విన్యాసాలు

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్రలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వ్యోమగాములతో పాటు మనందరికీ ఇష్టమైన ‘న్యుటెల్లా’ డబ్బా కూడా ఈ అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. వ్యోమనౌక లోపల జరుగుతున్న దృశ్యాలు లైవ్‌స్ట్రీమ్ అవుతుండగా, అంతరిక్షంలోని జీరో గ్రావిటీ ప్రభావంతో వ్యోమగాములతో పాటు న్యుటెల్లా డబ్బా కూడా గాలిలో తేలియాడుతూ కనిపించింది. ఈ వింత దృశ్యం చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

న్యుటెల్లా హల్ చల్..

దీనికి సంబంధించిన వీడియోను న్యుటెల్లా సంస్థ స్వయంగా ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా పంచుకుంది. ‘మానవజాతి చరిత్రలో ఎవరూ వెళ్లలేనంత సుదూర ప్రాంతానికి మా ఉత్పత్తి ప్రయాణించడాన్ని మేము గొప్ప గౌరవంగా భావిస్తున్నాం’ అని ఆ సంస్థ పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ‘న్యుటెల్లాపై నాకున్న ఇష్టానికి ఈ వీడియోనే నిదర్శనం, ఇది భూమిపైనే కాదు అంతరిక్షంలో కూడా ఫేమస్’ అంటూ చమత్కరిస్తున్నారు.

నాసా కెనడీ స్పేస్ సెంటర్ రియాక్షన్

ఈ వైరల్ వీడియోపై నాసా కెనడీ అంతరిక్ష కేంద్రం కూడా చాలా సరదాగా స్పందించింది. "మా ఆర్టెమిస్ సిబ్బంది చంద్రుడికి సంబంధించిన అద్భుతమైన ఫోటోలను తీస్తుంటే, మేము ఇక్కడ ఈ స్వీట్‌ను ఆస్వాదిస్తున్నాం" అంటూ కామెంట్ చేసింది. అంతరిక్షంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండే వ్యోమగాములకు ఇలాంటి చిన్న చిన్న ఆహ్లాదకరమైన అంశాలు ఎంతో ఉత్సాహాన్నిస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అంతరిక్షంలో ఆహారం

సాధారణంగా అంతరిక్షంలో ఆహారం తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ద్రవ పదార్థాలు లేదా చిన్న ముక్కలు నౌక అంతా చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వ్యోమగాములకు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఆహారాన్ని అందిస్తారు. న్యుటెల్లా వంటి చిక్కటి పదార్థాలు స్పేస్ క్రాఫ్ట్ లోపల సులభంగా వాడుకోవడానికి వీలుగా ఉండడం వల్ల కూడా వీటిని అనుమతించి ఉండవచ్చు.

ఆర్టెమిస్-2 మిషన్ ప్రత్యేకత

అర్టెమిస్-2 అనేది దశాబ్దాల తర్వాత మళ్లీ మనిషిని చంద్రుడిపైకి పంపేందుకు నాసా వేస్తున్న రెండో అడుగు. ఈ యాత్రలో నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రయాణించి సురక్షితంగా భూమి పైకి వస్తారు. ఇది విజయవంతమైతే, తదుపరి మిషన్‌లో చంద్రుడిపై మనిషి అడుగు పెట్టడం ఖాయం. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో న్యుటెల్లా లాంటి బ్రాండ్లు భాగస్వామ్యం కావడం ఆ సంస్థకు ఒక గొప్ప మార్కెటింగ్ అవకాశంగా కూడా మారింది.

అంతరిక్ష పరిశోధనలు అంటే కేవలం రాకెట్లు, గ్రహాలు మాత్రమే కాదు.., మనిషికి ఇష్టమైన చిన్న చిన్న సరదాలు కూడా ఉంటాయని ఈ సంఘటన నిరూపించింది. టెక్నాలజీ ఎంత పెరిగినా, భూమిపై మనం ఇష్టపడే రుచులను అంతరిక్షంలో ఆస్వాదించడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఈ వీడియో చూస్తుంటే, భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం అందుబాటులోకి వస్తే మనకు ఇష్టమైన తినుబండారాలన్నీ అక్కడ దొరుకుతాయేమో అనిపిస్తోంది!