Begin typing your search above and press return to search.

భారత్ న్యూక్లియర్ పవర్ వైపు వేగంగా అడుగులు.. విషాదాలను మరిచిపోతున్న వేళ.. కొత్త ఆశలు..

అణు విద్యుత్ ఎంత శుద్ధమైనదో, అంతటి సవాళ్లతో కూడుకున్నది. యురేనియం శుద్ధి, అణు వ్యర్థాల సురక్షిత నిల్వ, ఉగ్రవాద ముప్పు వంటివి ఈ రంగానికి నిత్య సవాళ్లు.

By:  Tupaki Political Desk   |   26 April 2026 10:49 AM IST
భారత్ న్యూక్లియర్ పవర్ వైపు వేగంగా అడుగులు.. విషాదాలను మరిచిపోతున్న వేళ.. కొత్త ఆశలు..
X

చెర్నోబిల్, ఫుకుషిమా వంటి భయంకరమైన విపత్తుల తర్వాత ప్రపంచం అణు విద్యుత్ పేరు వింటేనే వణుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, నేడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరిగిన ఇంధన అవసరాలు ప్రపంచాన్ని 'అణు పునరుత్థానం' వైపు నడిపిస్తున్నాయి. 1986లో చెర్నోబిల్ రియాక్టర్ పేలినప్పుడు సోవియట్ యూనియన్ దానిని దాచాలని చూసింది, కానీ రేడియోధార్మికత సరిహద్దులు దాటి స్వీడన్ వరకు వెళ్లడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అటువంటి చేదు జ్ఞాపకాల నుంచి నేటి 'శుద్ధ ఇంధన' అవసరాల వరకు అణు విద్యుత్ ప్రస్థానంపై క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుత ప్రపంచం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉంది. ఒకవైపు కర్బన ఉద్గారాలను తగ్గించి భూమిని కాపాడాలి, మరోవైపు కృత్రిమ మేధ, భారీ డేటా సెంటర్ల కోసం అంతరాయం లేని విద్యుత్ కావాలి. సౌర, పవన విద్యుత్ వనరులు ప్రకృతిపై ఆధారపడతాయి, కానీ అణు విద్యుత్ మాత్రం నిరంతరాయంగా శక్తిని అందిస్తుంది. అందుకే జర్మనీ వంటి దేశాలు అణు ప్లాంట్లు మూసివేసినా, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ వైపు మొగ్గు చూపడం పెరుగుతోంది. హర్మూజ్ జలసంధి వంటి చోట్ల ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలిగినా, అణు ఇంధనం (యురేనియం) నిల్వలు రెండేళ్ల వరకు అందుబాటులో ఉంచుకుంటే ఒక భరోసా వస్తుందని శాస్త్రవేత్తలు ఆయా ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నారు.

ఎస్‌ఎంఆర్‌ల విప్లవం

పాతకాలపు భారీ అణు ప్లాంట్ల నిర్మాణానికి దశాబ్దాల సమయం, వేల కోట్ల ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, మైక్రో రియాక్టర్లు సరికొత్త విప్లవాన్ని తెస్తున్నాయి. ఇవి పరిమాణంలో చిన్నవి, భద్రతలో మిన్న. ఏదైనా ప్రమాదం జరిగితే మానవ ప్రమేయం లేకుండానే ఇవి ఆగిపోయే సాంకేతికతను కలిగి ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతాలు లేదా డేటా సెంటర్ల పక్కనే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల విద్యుత్ రవాణాలో వచ్చే నష్టాలు తగ్గుతాయి.

అణు విద్యుత్ వైపునకు పరుగెడుతున్న ప్రపంచ దేశాలు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లో 400 పైగా రియాక్టర్లు పనిచేస్తున్నాయి. ఇందులో అమెరికా 94 రియాక్టర్లతో అగ్రస్థానంలో ఉండగా, చైనా కొత్త రియాక్టర్ల నిర్మాణంలో దూసుకుపోతోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో భారత్ తన అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు చేర్చాలని లక్ష్యం పెట్టుకొని పని చేస్తుంది.

థోరియం వినియోగం: భారత్ వద్ద ప్రపంచంలోనే అత్యధిక థోరియం నిల్వలు ఉన్నాయి. ఇటీవల 500 మెగావాట్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ‘క్రిటికాలిటీ’ సాధించడంతో, యురేనియం దిగుమతులపై ఆధారపడకుండా సొంత థోరియం ద్వారా విద్యుత్ తయారు చేసుకునే రోజులు దగ్గరపడ్డాయి. దీనికోసం ప్రభుత్వం రూ.20 వేల కోట్లు కేటాయించి, 2033 నాటికి ఐదు ఎస్‌ఎంఆర్‌లను నిర్మించాలని కసరత్తు చేస్తోంది.

దీర్ఘకాలిక పెట్టుబడులు కావాలి..

అణు విద్యుత్ రంగంలో అతిపెద్ద సవాలు నిర్మాణ వ్యయం. ఒక అణు రియాక్టర్‌ను నిర్మించడానికి పట్టే సమయం, ప్రారంభ పెట్టుబడి ఇతర విద్యుత్ వనరులతో పోలిస్తే చాలా ఎక్కువ. ఒక మెగావాట్ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించడానికి పట్టే కాలంలో, సౌర లేదా పవన విద్యుత్ ప్రాజెక్టులను చాలా వేగంగా పూర్తి చేయవచ్చు. ఒక్కసారి నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత, అణు విద్యుత్ అత్యంత చౌకైనదిగా మారుతుంది. ఎందుకంటే దీని నిర్వహణ ఖర్చులు తక్కువ, ఒక ప్లాంట్ దాదాపు 60 నుంచి 80 ఏళ్ల పాటు సేవలను అందిస్తుంది. భారత్ వంటి దేశాల్లో ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఇదే. ప్రారంభంలో భారం అనిపించినా, భవిష్యత్తు ఇంధన అవసరాలకు ఇది శాశ్వత పరిష్కారం.

ప్రజాభిప్రాయంతో పాటు భద్రతపై అవగాహన పెంచాలి.

అణు విద్యుత్ విస్తరణలో సాంకేతికత కంటే ప్రజాభిప్రాయం కీలక పాత్ర పోషిస్తుంది. చెర్నోబిల్ వంటి పాత తరం ప్రమాదాల నీడ ప్రజల మనసుల్లో ఉండడం వల్ల, కొత్త ప్లాంట్ల ఏర్పాటును స్థానిక ప్రజలు తరచుగా వ్యతిరేకిస్తుంటారు. దీనిని అధిగమించడానికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు అత్యాధునిక 'థర్డ్, ఫోర్త్ జనరేషన్' రియాక్టర్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ ఆధునిక రియాక్టర్లు 'పాసివ్ సేఫ్టీ' ఫీచర్లతో వస్తాయి. అంటే విద్యుత్ సరఫరా నిలిచిపోయినా లేదా మానవ తప్పిదం జరిగినా, గురుత్వాకర్షణ వంటి ప్రకృతి సిద్ధమైన శక్తుల ద్వారా రియాక్టర్ తనంతట తానుగా చల్లబడిపోతుంది. పారదర్శకమైన భద్రతా ఆడిటింగ్, ప్రజలతో నిరంతర సంభాషణ ద్వారా మాత్రమే అణు విద్యుత్ పట్ల భయాందోళనలను తొలగించి, దానిని ఒక ప్రధాన స్రవంతి ఇంధన వనరుగా మార్చడం సాధ్యం అవుతుంది.

అణు విద్యుత్ ఎంత శుద్ధమైనదో, అంతటి సవాళ్లతో కూడుకున్నది. యురేనియం శుద్ధి, అణు వ్యర్థాల సురక్షిత నిల్వ, ఉగ్రవాద ముప్పు వంటివి ఈ రంగానికి నిత్య సవాళ్లు. ముఖ్యంగా యుద్ధ సమయాల్లో అణు ప్లాంట్లు శత్రువుల లక్ష్యాలుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి, 'మితిమీరిన విశ్వాసం' పనికిరాదు. అణు విద్యుత్‌తో పాటు గ్రీన్ హైడ్రోజన్, ఇతర పునరుత్పాదక వనరులను సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే దేశ ఇంధన భద్రతకు సరైన మార్గం. భద్రత విషయంలో చిన్న పొరపాటు జరిగినా తరతరాల వినాశనానికి దారితీస్తుందని చెర్నోబిల్ మనకు నేర్పిన పాఠం ఎప్పటికీ గుర్తే ఉండాలి.