ఎన్టీఆర్... 'సజీవ చరిత్ర'!
రామారావును పూజించేవారు ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా రామారావును ఏ రోజు విమర్శించలేదు.
By: Garuda Media | 16 Sept 2025 3:09 PM ISTఎన్టీ రామారావు అంటేనే తెలుగుజాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు స్వరూపం. ఆయనను అన్నగా ఆరాధనగా భావించే కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో అయితే ఎప్పటికీ ఎన్టీఆర్ పేరును ఎవరు మర్చిపోలేదు. ఇప్పటికీ ఆయన ఫోటోలు, ఆయన వేసిన శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వేషాలతో కూడిన చిత్రపటాలు మనకు ఆయా ఇళ్ళలో కనిపిస్తాయి. ఇటు నటనాపరంగా అటు రాజకీయంగా కూడా ఎన్టీఆర్ చేసిన సేవలు కానివ్వండి.. ఆయన పోషించిన పాత్రలు కానివ్వండి.. అజరామరంగా నిలిచాయి.
తాజాగా ఎన్టీఆర్‌కు నివాళిగా `సజీవ చరిత్ర` పేరుతో మరో పుస్తకం రానుంది. నిజానికి ఇప్పటికే ఎన్టీఆర్ హిస్టరీ కి సంబంధించి, ఆయన పోషించిన పాత్రలకు సంబంధించి సినిమాలు వచ్చాయి. నాటకాలు వచ్చాయి. అదేవిధంగా పుస్తకాలు కూడా రచించారు. కానీ ఎవరిశైలి వారిది. ఎవరి ఆవిష్కరణ వారిది. ఎవరి కోణం వారిది. కానీ, ఎప్పటికీ నిలిచి ఉండే అంశాల్లో కీలకమైనవి పేదలకు సేవ, రెండు రూపాయల కిలో బియ్యం, మహిళలకు ఆస్తిహక్కు, కరణాల రద్దు ఇట్లాంటివి అనేకం ఉన్నాయి.
మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగువాడు పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా పోటీ చేస్తున్నారు కాబట్టి నేను రాజకీయంగా పోటీ పడను అని నంద్యాల పార్లమెంటు ఎన్నికల సమయంలో రామారావు చేసిన ప్రకటన ఇప్పటికీ రాజకీయ నాయకులకు ఆదర్శంగానూ ఆసక్తిగాను ఉంటుంది. ఇట్లా ఎన్టీఆర్ జీవితంలో అనేక మలుపులున్నాయి. అనేకమైన ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇవన్నీ సజీవంగా ఇప్పటికే కాదు.. ఎప్పటికైనా నిలిచి ఉండే అంశాలే. ఇందులో ఎవరికి సందేహం లేదు. పార్టీలకు అతీతంగా కూడా రామారావును ప్రేమించే వారు ఉన్నారు.
రామారావును పూజించేవారు ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా రామారావును ఏ రోజు విమర్శించలేదు. ఆయన చేసిన పథకాలకు దోహద పడిన పరిస్థితి కూడా ఉంది. రెండు రూపాయల కిలో బియ్యం అంశం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రధాని పీవీ సహకరించారు. తనదైన శైలిలో సజీవ చరిత్రను సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌కు నివాళిగా మరో పుస్తకాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. ఇది భవిష్యత్తు రాజకీయ యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రయోగంగా భావిస్తున్నారు. ఏదేమైనా రామారావు లాంటి అత్యున్నత రాజకీయ శిఖరం అందరికీ గుర్తుండి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
