ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ చివరి భేటీ అదే
వెండి తెర వేలుపు తెలుగు తేజం ఎన్టీఆర్ జీవితం ఎంతో స్పూర్తి దాయకం. నటుడిగా విశ్వవిఖ్యాత సార్వభౌముడిగా ఆయన కీర్తిని గడించారు.
By: Satya P | 17 Jan 2026 10:57 PM ISTవెండి తెర వేలుపు తెలుగు తేజం ఎన్టీఆర్ జీవితం ఎంతో స్పూర్తి దాయకం. నటుడిగా విశ్వవిఖ్యాత సార్వభౌముడిగా ఆయన కీర్తిని గడించారు. మూడున్నర దశాబ్దాలుగా వెండి తెర మీద రాముడు కృష్ణుడు సహా అనేక పురాణ పాత్రలను పోషించి జానపద చారిత్రాత్మక సాంఘిక చిత్రాలు మూడు వందల యాభై పై చిలుకు నటించిన ఎన్టీఆర్ ఆరు పదుల వయసులో ప్రజా సేవ చేయడం కోసం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన తెలుగువారి కోసం తెలుగు దేశం పార్టీని పెట్టి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారం అందుకుని గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. నాలుగు సార్లు సీఎం గా ప్రమాణం చేశారు.
అన్న గారి మహాభినిష్క్రమణం :
మొత్తం ఎనిమిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీని పాలించారు. పద్నాలుగేళ్ల రాజకీయ జీవితం ఆద్యంతం ఉత్తేజ పూరితం సంచలనం గానే సాగింది. ఇక సెలవు అంటూ 1996 జనవరి 18న ఎన్టీఆర్ ఈ భువి నుంచి ఆ దివికి మహాభినిష్క్రమణం చేశారు. నేడు ఆయన ముప్పయ్యవ వర్ధంతి. ఈ సందర్భంగా సార్థక నామధేయుడు అయిన తారక రాముణ్ణి మరోసారి తలచుకోవడం ఆయన జ్ఞాపకాలను నెమరేసుకోవడంలో ఎంతో ఆనందం ఉంది.
ఎంతో సంస్కారం :
ఎన్టీఆర్ అంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెబుతారు. అంతే కాదు ఆయన ఎంతో సంస్కార సంపన్నుడు కూడా. శత్రువుగా ఎవరిని భావించినా వారి విషయంలోనూ ఆయన ప్రత్యేక కక్ష్యలు ఏవీ పెట్టుకోలేదు, తనను గద్దె నుంచి దించిన కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ విమర్శలే చేశారు తప్ప వ్యక్తిగతంగా తీసుకోలేదు. 1984 ఆగస్టు 15న తనను గద్దె దించి నాదెండ్ల భాస్కరరావుకి సీఎం సీటు అప్పగించిన ఉదంతంలో కేంద్రంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెర వెనక చేసిన వ్యూహాలు ఎత్తులు అన్నీఎ తెలిసి కూడా ప్రజాస్వామ్య యుతంగానే పోరాడి తిరిగి అధికారం సంపాదించారు, నెల తిరక్కుండానే సీఎం అయ్యారు.
ఇందిరకు స్వాగతం :
ఎన్టీఆర్ ని గద్దె దించడం అన్నది తెలుగు వారి అందరిలోనూ ఎంతో ఆగ్రహం కలుగచేసింది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం మీద ద్వజమెత్తేలా చేసింది. మొత్తానికి నాడు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ పాలు పంచుకున్నారు. కేంద్రాన్ని గడగడలాడించారు. చివరికి అన్న గారి చేతికి పగ్గాలు అందించక తప్పలేదు. ఇది జరిగిన నెల రోజులకు అంటే అక్టోబర్ నెల మధ్యలో నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. ఆమె పర్యటనకు వస్తే ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ స్వాగతం పలుకుతారా లేదా అన్న మీమాంస అందరిలో ఉంది ఎందుకంటే కేంద్ర రాష్ట్రం మధ్య భీకరమైన రాజకీయ
పోరు అన్నట్లుగా ఒక తీరున అంతకు ముందు ఉద్యమం సాగింది. దాంతో మంత్రులను ఎవరినో పంపిస్తారు అనుకుంటే అన్న గారే స్వయంగా వచ్చి అనంతపురంలో ఇందిరమ్మకు ఘన స్వాగతం పలికారు. దీంతో అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అది ఎన్టీఆర్ సంస్కారం అని అంతా మెచ్చుకున్నారు కూడా.
నిధుల విషయంలో :
ఇక ఆ పర్యటనలో భాగంగా ప్రధానితో ఆ జిల్లాలో సమావేశమైనపుడు రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలోనూ ఎన్టీఆర్ గట్టిగానే అడిగారు అన్నది అప్పటి అధికారులు దగ్గరుండి చూసిన వారి మాట. కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని సమాఖ్య వ్యవస్థలో అది భాగమని చెబుతూ ఎన్టీఆర్ కాస్తా బిగ్గరగానే ప్రధానితో రాష్ట్రం వాటా గురించి అడిగారు అన్నది భోగట్టా. అంటే రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి ఎన్టీఆర్ కేంద్రంలో ఉక్కు మహిళగా ఉన్న ఇందిరమ్మను సైతం ఏ మాత్రం రాజీ లేని ధోరణిలో ప్రశ్నించారు అన్నది ఆనాటి పత్రికల కధనంగా ఉంది. అలా ముఖ్యమంత్రిగా తన బాధ్యతను అన్న గారు బాగానే నెరవేర్చారు అని చెప్పుకున్నారు.
అదే లాస్ట్ భేటీ :
ఇక ఇందిరాగాంధీతో అన్న గారి చివరి భేటీ అనంతపురం జిల్లాలోనే సాగింది అని చెబుతారు. అది జరిగిన కొద్ది రోజులకు అంటే అక్టోబర్ నెల 31న శ్రీమతి ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురి అయ్యారు. ఆ తరువాత ఆమె వారసుడిగా కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేయడం అన్నది వేరే సంగతి. మొత్తానికి చూస్తే ఇందిరాగాంధీకి ఘనంగా స్వాగతం పలికి రాష్ట్ర సమస్యలను అన్న గారు పూర్తిగా వివరించిన పర్యటనగా అనంతపురం జిల్లా విషయంలో జరిగినదని చెప్పుకుంటారు.
