క్రిష్ణ తో నటించాలని పట్టుబట్టిన ఎన్టీఆర్ !
ఇక 1973 చివరిలో చూస్తే కనుక క్రిష్ణ వరసగా హీరోగా చేస్తూ మంచి ఊపు మీద ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు సడెన్ గా అల్లూరి సీతారామ రాజు మూవీ తీయాలని కోరిక కలిగింది.
By: Satya P | 12 April 2026 9:22 AM ISTతెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా సీనియర్ టాప్ ఫోర్ హీరోల సమయంలో ఉండేది. ఎన్టీఆర్ ఏఎన్నార్ ఒక తరం హీరోలు రెండవ తరంలో కృష్ణ శోభన్ బాబు హీరోలుగా వచ్చి తమకంటూ సొంత ఇమేజ్ ని సాధించారు. ఈ నలుగురూ కలిసి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినీ సీమను నిలబెట్టారు. తమదైన నటనతో ప్రేక్షాభిమానాన్ని విశేషంగా పొందారు. ఇక ఈ నలుగురిలో సూపర్ స్టార్ క్రిష్ణ ది ఒక భిన్నమైన శైలి. ఆయన సాహసానికి పెట్టింది పేరు. అందుకే ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ సందర్భంలో సీనియర్ హీరోలతో గ్యాప్ వచ్చినా ముందుకే సాగేవారు. అందుకే డేరింగ్ అండ్ డేషింగ్ హీరో కృష్ణ అన్న పేరు వచ్చింది.
అభిమాన నటుడు అంటూ :
తెలుగు సినిమా రంగంలోకి క్రిష్ణ అడుగు పెట్టడానికి కారణం తన అభిమాన హీరో ఎన్టీఆర్ అని ఎన్నో సార్లు క్రిష్ణ చెప్పేవారు. ఇక ఎన్టీఆర్ చేతుల మీదుగానే క్రిష్ణ సినీ రంగ ప్రవేశం జరగాల్సి ఉంది. ఎన్టీఆర్ తన సొంత నిర్మాణ సంస్థ ఎన్ఏటీ బ్యానర్ మీద సీతారామ కళ్యాణం మూవీ తీస్తున్నపుడు ఆయనను క్రిష్ణ కలిశారు. నటించాలన్న తన కోరిక వ్యక్తం చేశారు. అయితే అప్పటికి రెండు పదుల వయసులో ఉన్న క్రిష్ణను చూసిన ఎన్టీఆర్ మరి కొన్నాళ్ళు ఆగమని సూచించారని చెబుతారు. ఆ తరువాత తేనే మనసులు మూవీతో కృష్ణ సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి విధితమే.
ఎన్టీఆర్ క్రిష్ణల మధ్యన :
ఇక 1973 చివరిలో చూస్తే కనుక క్రిష్ణ వరసగా హీరోగా చేస్తూ మంచి ఊపు మీద ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు సడెన్ గా అల్లూరి సీతారామ రాజు మూవీ తీయాలని కోరిక కలిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ మూవీ తీయవద్దు అని అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే అది డ్రై సబ్జెక్ట్ అని హీరో పాత్రకు పాటలు కానీ హంగులు కానీ ఉండవని ఎన్టీఆర్ అన్నారుట. పైగా క్రిష్ణ అప్పటికి మూడు పదుల వయసులో ఉన్నారు. యంగ్ అండ్ రొమాంటిక్ రోల్స్ వేసుకోమని సలహా ఇచ్చారుట. కానీ క్రిష్ణ పట్టుదలగా ఆ మూవీని తీసి బంపర్ హిట్ కొట్టారు. దాంతో ఇద్దరి మధ్యన అది ఒక అగాధంగా మారింది. ఇక ఆది జరిగిన మూడేళ్ళకు దాన వీర శూర కర్ణ మూవీకి పోటీగా కురుక్షేత్రం మూవీని క్రిష్ణ తీశారు. దీంతో ఇద్దరి మధ్య మరింత గ్యాప్ వచ్చేసింది. దాంతో ఇద్దరూ ఎవరికి వారుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
తమ్ముడి పాత్ర కోసం :
ఈ సమయంలో 1981 ప్రాంతంలో ఎన్టీఆర్ వద్దకు ఒక సబ్జెక్ట్ వచ్చింది. అందులో ఇద్దరు అన్నదమ్ముల పాత్రతో కూడిన కధ ఉంది. అన్నగా ఎన్టీఆర్ చేస్తే తమ్ముడి పాత్ర ఎవరు అన్న చర్చ జరిగింది అయితే వెంటనే ఎన్టీఆర్ క్రిష్ణ తమ్ముడు పాత్ర వేస్తే నేను అన్న వేషం వేస్తాను అని పట్టుబట్టారుట. అయితే కృష్ణ ఈ పాత్ర వేస్తారా అన్న సందేహం నిర్మాతలకు ఉంది. ఎందుకంటే ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి. కానీ క్రిష్ణ వద్దకు ఈ సబ్జెక్ట్ తీసుకెళ్తే ఎన్టీఆర్ కి తమ్ముడి పాత్ర వేయడానికి ఫుల్ హ్యాపీగా ఒప్పుకున్నారు. అలా దాదాపుగా తొమ్మిదేళ్ళ పాటు గ్యాప్ తో గడిపిన ఇద్దరు అగ్ర హీరోలు కలసి సినిమా చేయడం అప్పట్లో ఒక సంచలన వార్తగా మారింది.
చంద్రబాబు క్లాప్ తో :
ఇక ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఈ సినిమాకు క్లాప్ కొట్టింది ఆనాటి కాంగ్రెస్ మంత్రి సినిమాటోగ్రఫీ శాఖ చూస్తున్న నారా చంద్రబాబు నాయుడు. అప్పటికి ఆయన ఎన్టీఆర్ కి అల్లుడు కాలేదు. బాబు క్లాప్ తో స్టార్ట్ అయిన ఆ మూవీయే వయ్యారి భామలు వగలమారి భర్తలు. ఎన్టీఆర్ కి జతగా శ్రీదేవి, క్రిష్ణ పక్కన రాధిక నటించిన ఈ మూవీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీశారు. కుటుంబ కధా చిత్రాలను చక్కగా తీయడంలో పేరున్న కట్టా సుబ్బారావు దీనికి డైరెక్టర్. ఈ మూవీ మంచి హైప్ తో రిలీజ్ అయింది. ఇద్దరి హీరోల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో తమాషా ఏంటి అంటే ఇద్దరు హీరోలకు సమానంగా పాటలు ఫైట్స్, డైలాగ్స్, సన్నివేశాలు అన్నీ పంచారు. ఇద్దరి కాస్ట్యూమ్స్ కూడా దాదాపుగా ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
