ఇంటింటికీ వైద్యం.. చంద్రబాబు 'ఇంటి' నుంచే మొదలు..!
నిజమే! త్వరలోనే ఇంటింటికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ ప్రారంభించారు.
By: Garuda Media | 6 Nov 2025 10:05 AM ISTనిజమే! త్వరలోనే ఇంటింటికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ ప్రారంభించారు. గతంలో వైసీపీ విలేజ్ క్లినిక్‌లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసే ఉంటుంది. అయితే.. అది ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. కానీ.. మంచి కార్యక్రమం కావడంతో చంద్రబాబు భేషజాలకు పోకుండా.. సదరు కార్యక్రమాన్ని కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంపైనే మంత్రి సత్యకుమార్ ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు.
ఏం చేస్తారు..?
గతంలో వైసీపీ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలోనూ అధునాత సదు పాయాలతో ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని భావించింది. వీటిలో అన్నిరకాల పరీక్షలతో పాటు గర్భి ణులకు ప్రసవాల కూడా చేయనున్నారు. అయితే.. ఇది కార్యాచరణకు నోచుకోలేదు. దీనిపై చంద్రబాబు ఇటీవల అధ్యయనం చేయించారు. ఐవీఆర్ ఎస్ సర్వేలు కూడా చేయించారు. దీనిలో ప్రజల నుంచి సానుకూలత రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో `ఎన్టీఆర్ ఇంటింటి వైద్యం` పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తొలిగా ఎక్కడంటే..
ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానంలో విలేజ్ క్లినిక్‌ల స్తానంలో ఇంటింటి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయనున్నారు. అంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ.. నిత్యం ఏఎన్ ఎంలు వస్తారు. అదేసమయంలో మొబైల్ రక్తపరీక్ష, ఎయిడ్స్, మూత్ర పరీక్షలు, క్షయ, కలరా, నిమ్ము.. షుగర్ టెస్టులను అందుబాటులో కి తీసుకువస్తారు. అక్కడికక్కడే ప్రజల నుంచి రక్తనమూనాలు తీసుకుని పరీక్షలు చేస్తారు. వీటి రిజల్ట్ ను కూడా అప్పటికప్పుడే అందిస్తారు. మందులు.. ఇంజక్షన్లను కూడా ఫ్రీగా ఇస్తారు.
ప్రాథమికంగా.. ఈ ప్రాజెక్టును ఈ నెల 20 నుంచి సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే ప్రారంభించనున్నారు. దీనిపై ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. దీని ప్రకారం.. కుప్పంను క్లస్టర్ల వారీగా విభజించి.. ఇంటింటికీ ఏఎన్ ఎంలను కేటాయిస్తారు. ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు ఏఎన్ ఎంలు ఉంటారు. వీరు నిరంతరం.. ఆయా ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలించడంతోపాటు.. వారికి అవసరమైన మందులు కూడా అందించనున్నారు.
