Begin typing your search above and press return to search.

కారణ జన్ముడు ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు సినీ రాజకీయ రంగాలు రెండింట్లో విశేషంగా రాణించారు.

By:  Satya P   |   18 Jan 2026 4:17 PM IST
కారణ జన్ముడు  ఎన్టీఆర్
X

నందమూరి తారక రామారావు సినీ రాజకీయ రంగాలు రెండింట్లో విశేషంగా రాణించారు. ఆయన మూడున్నర దశాబ్దాల పాటు సినీ సీమలో రారాజుగా వెలుగొందారు. అనంతరం తనను ఎంతగానో ఆదరించిన ప్రజల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజా సేవ ద్వారా వారి రుణం తీర్చుకోవాలని ఎన్ టీఅర్ భావించారు. ఆయనకు ఆ ఆలోచన కూడా ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వచ్చింది అంటే ఆశ్చర్యం కాదు ఆసక్తికరంగా ఉంటుంది.

ఆ పాత్ర వేషధారణలో :

ఇక 1980 ప్రాంతంలో ఎన్టీఆర్ హీరోగా సర్దార్ పాపారాయుడు సినిమా తీస్తున్నారు. దాసరి నారాయణరావు దానికి దర్శకుడు. ఆ మూవీ జరుగుతున్నపుడు అందులో వచ్చే ఒక పాట కోసం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఎన్టీఆర్ కనిపిస్తారు. ఆ గెటప్ వేసుకున్న ఆయనలో ఎన్నో భావాలు కలిగాయి. అప్పుడు ఆయన షూటింగ్ స్పాట్ లోనే మీడియా వారితో మాట్లాడుతూ ప్రజలకు ఎంతో చేయాల్సి ఉందని అన్నారు. ఆ విధంగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన చూచాయగా చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆయన దాని మీదనే దృష్టి పెడుతూ సినిమాలు తగ్గించుకున్నారు. అప్పట్లో తెలుగు సినీ సీమలో నంబర్ వన్ హీరోగా ఎన్టీఆర్ ఉండేవారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుని చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తూ 1982 నాటికి తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఆ మీదట రాష్ట్రవ్యాప్తంగా ఆయన చైతన్య రధం మీద పర్యటించారు. అలా ఎన్టీఆర్ తొమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చారు. అది ప్రపంచ రికార్డుగా నేటికీ ఉంది.

రూపాయి వేతనం :

ఇక ముఖ్యమంత్రికి కూడా వేతనం ఉంటుంది. కానీ తాను కేవలం రూపాయి మాత్రమే తీసుకుంటాను అని నియమం పెట్టుకుని అన్న గారు పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పేదలకు ఇవ్వడమే కాదు జనతా వస్త్రాలు అందించారు. అలాగే పక్కా ఇళ్ళను నిర్మించడం ద్వారా కూడు గుడ్డ గూడు అన్న మూడు ప్రాథమిక అవసరాలను తీర్చి సామాన్యుడికి భరోసాగా నిలిచారు. కరణం మునసబు వ్యవస్థను తీసేసి గ్రామ స్వరాజ్యం అందించారు. అలాగే సమితులను మండలాలుగా మార్చి పాలనాపరంగా సంస్కరణలను తెచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కీలక నిర్ణయాలు ఆయన తీసుకున్నారు.

రాజకీయ సంస్కరణలు :

ఇక చదువుకున్న వారికి చట్ట సభలలో అవకాశం కల్పించడం బడుగు బలహీన వర్గాలకు ఎమ్మెల్యే ఎంపీ వంటి కీలక పదవులు ఇవ్వడం, అతి చిన్న వయసులోనే మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా బడుగు అణగారిన వర్గాలలో సాధికారికత కల్పించడం ద్వారా ఎన్ టీఆర్ రాజకీయ సంస్కరణలకు ఎంతో కృషి చేశారు అని చెప్పాలి. అదే విధంగా పైసా కూడా పార్టీ ఫండ్ వసూలు చేయకుండా టికెట్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది. దాంతో ఎంతో పేదవారు, రాజకీయం గురించి కూడా అవగాహన లేని వారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోయారు.

మహిళలకు ప్రాధాన్యత :

మహిళల కోసం ఎన్టీఆర్ తన హయాంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆస్తి హక్కులో ఆడబిడ్డకు సగం వాటా అన్నది ఆయన మదిలో పుట్టిన ఆలోచనగానే ఉంది. దానినే చట్టబద్ధం చేశారు. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపన ఆయన మరో ఆలోచన. అలాగే హెల్త్ యూనివర్శిటీని ఆయన విజయవాడలో నెలకొల్పారు.

ఆయన సరిసాటి లేరు :

ఒక్కరే ఎన్టీఆర్ అని చెప్పాలి. ఆయన సరిసాటి ఎవరూ లేరని కూడా ఒప్పుకుని తీరాలి. సినీ రాజకీయ రంగాలలో ఆయన సాధించిన రికార్డులు అసమానం. సినీ రంగంలో ఆయన వేసినన్ని పౌరాణిక పాత్రలు ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదు, అలా అక్కడ తన కీర్తిని శాశ్వతం చేసిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలో సైతం తొమ్మిది నెలలలోనే అధికారంలోకి రావడం తాను పాలించిన సమయంలో ఎన్నో వినూత్న ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదాన్ని నిజం చేసి చూపించడం ఇవన్నీ మరొకరికి సాధ్యపడవు, ఎవరూ చేయలేరని చెప్పాలి.

తెలుగు జాతిని కన్నీట ముంచేసింది :

ఎన్టీఆర్ కారణ జన్ముడిగా చెప్పాలి. ఆయన వంటి వారు యుగానికి ఒక్కరే పుడతారు అని అంటారు. మళ్లీ అలాంటి వారు రావాలీ అంటే యుగాల వరకూ ఎదురు చూడాలేమో. ఎన్టీఆర్ 1996 జనవరి 18న మరణించారు. ఆయన మరణం వార్త తెలుగు జాతిని కన్నీట ముంచేసింది. దేశమంతా కదిలిపోయింది. ఒక చరిత్ర సృష్టించడానికి ఈ భూమి మీదకు వచ్చి తన పని పూర్తి చేసి తిరిగి దివికి ఏగిన మహానుభావుడు మహా పురుషుడు ఎన్ టీఆర్. తెలుగు జాతి ఉన్నంతవరకూ ఆ మూడు అక్షరాలు శిలాక్షరాలే అని చెప్పక తప్పదు.