ఎమ్మెల్యే వెర్సస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఈ గొడవ ఎక్కడిదాకా?
ఈ వివాదం మొదలై పది రోజులు గడిచిపోగా.. ఫ్యాన్స్ తగ్గట్లేదు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేలా ఎమ్మెల్యే వైపు నుంచి ఏ ప్రయత్నం జరగట్లేదు.
By: Garuda Media | 26 Aug 2025 9:59 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి కొన్ని రోజుల కిందట అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో కాల్ ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే. ఈ ఆడియో లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే స్పందిస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియో తనది కాదంటూనే, అభిమానులకు సారీ చెప్పారాయన.
అంతటితో వ్యవహారం సమసిపోతుందనుకుంటే.. అభిమానులు మాత్రం ఊరుకోలేదు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి అనంతపురంలో ఒకట్రెండు రోజులు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. తర్వాత హైదరాబాద్ వేదికగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆయన మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టాలి అన్నది వారి డిమాండ్. కానీ అవేవీ జరగట్లేదు. దీంతో అభిమానులు కూడా తగ్గట్లేదు.
ఈ వివాదం మొదలై పది రోజులు గడిచిపోగా.. ఫ్యాన్స్ తగ్గట్లేదు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేలా ఎమ్మెల్యే వైపు నుంచి ఏ ప్రయత్నం జరగట్లేదు. ఇటు తెలుగుదేశం పార్టీ, అటు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని ఎలా సెటిల్ చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయా అనిపిస్తోంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తారక్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అనంతపురానికి చేరుకున్నారు. వారి వాహనాలను పోలీసులు ఎక్కడిక్కడ కట్టడి చేయగా.. బస్సుల్లో, వేరే మార్గాల్లో వాళ్లు అనంతపురానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు.
పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీ ఛార్జ్ చేశారు. అభిమానులను పోలీసులు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శాంతియుతంగా నిరసన చెబుతుంటే.. ఫ్యాన్స్ మీద దాడులేంటి అంటూ సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అభిమానులను నియంత్రించకపోతే.. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని.. ఎమ్మెల్యే మీద ఎటాక్ చేస్తే పరిస్థితి ఏంటని పోలీసులు అంటున్నారు. ఎమ్మెల్యే ఏమో.. ఇదేమీ పట్టనట్లు తన పని తాను చేసుకుపోతున్నారు.
ఆయన బహిరంగ క్షమాపణ చెప్పేస్తే సరిపోతుంది కదా అని ఓ వర్గం వాదిస్తోంది. కానీ సెల్ఫీ వీడియోతో చెప్పిన సారీ సరిపోదా.. లీక్ అయిన ఆడియో కాల్ గురించి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెబితే ఎమ్మెల్యే స్థాయికి సరిపోతుందా అని ఇంకో వర్గం వాదిస్తోంది. అంతిమంగా ఇది తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం చేసేలానే ఉందన్నది విశ్లేషకుల మాట.
