Begin typing your search above and press return to search.

బసవతారకం చారిటబుల్ ట్రస్ట్: అస్సామీల‌కు సాయమే కాదు.. ఈ ఏడాది టాప్-10 సేవా కార్యక్రమాలు!

ఇటీవల అస్సాంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కోసం ఈ ట్రస్ట్ నేరుగా రంగంలోకి దిగింది.

By:  Sivaji Kontham   |   7 Aug 2026 10:54 PM IST
బసవతారకం చారిటబుల్ ట్రస్ట్: అస్సామీల‌కు సాయమే కాదు.. ఈ ఏడాది టాప్-10 సేవా కార్యక్రమాలు!
X

స్వర్గీయ నందమూరి తారక రామారావు- బసవరామ తారకం దంపతుల ఆశయాల స్ఫూర్తితో రూపుదిద్దుకున్న `నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్` ఈ ఏడాది సేవా రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. శ్రీమతి బసవరామ తారకం గారి శతజయంతి సందర్భంగా ప్రారంభమైన ఈ ట్రస్ట్.. స్వల్ప కాలంలోనే ఎన్నో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. తాజాగా అస్సాం వరద బాధితులకు సహాయం అందించడమే కాకుండా.. ఈ ఏడాది సమాజానికి అందించిన టాప్-10 సేవా కార్యక్రమాలతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఇటీవల అస్సాంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కోసం ఈ ట్రస్ట్ నేరుగా రంగంలోకి దిగింది. తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం వంటి నగరాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా స్వచ్ఛందంగా సరుకులను సేకరించింది. ఈ నిత్యవసరాలను, ఆహార పదార్థాలను, బట్టలను `ది ఎంబ్రియోస్` అనే ఎన్జీఓ సంస్థ ద్వారా ప్రత్యేక ట్రక్కుల ద్వారా అస్సాం వరద ప్రాంతాలకు పంపించి బాధితులకు తక్షణ ఉపశమనాన్ని అందించడం ఈ ఏడాది చేపట్టిన అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఇది కేవ‌లం ఒక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ఇంకా ఈ ఏడాది ప‌లు సేవాకార్య‌క్ర‌మాల‌ను ఈ సంస్థ ద్వారా కొన‌సాగించారు.

ఈ ఏడాది ట్రస్ట్ సాధించిన అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో భాగంగా..పేద విద్యార్థులకు ఉచిత విద్యా కుసుమాలు అందించడం.. మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ.. అత్యవసర వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం అందించడం వంటి ముఖ్యమైన అడుగులు పడ్డాయి. ``సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు`` అనే అన్నగారి సిద్ధాంతాన్ని ఆచరణలో చూపుతూ.. నందమూరి మోహనకృష్ణ నేతృత్వంలో లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవలను వికలాంగులు, వృద్ధుల ఆశ్రమాలకు విస్తరించడం ద్వారా ఈ ఏడాది నిర్వహించిన సేవా జాబితాలో ఇవి టాప్ స్థానాల్లో నిలిచాయి.

మరోవైపు.. నందమూరి మోహన్ రూపా -నందమూరి సీమంతిని ఆధ్వర్యంలో డిజిటల్ పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చారు. సాయం అందించిన దాతల వివరాలను, ట్రస్ట్ సహాయ కార్యక్రమాలను ట్ర‌స్ట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు ప్రజలకు పంచుకుంటున్నారు. విదేశీ ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యాన్ని పెంపొందించడం.. స్థానిక యువతను సేవా మార్గంలో నడిపించడం ఈ సంవత్సరం ట్రస్ట్ సాధించిన మరొక ప్రధాన పరిణామం.

ఏ అభ్యర్థన వచ్చినా స్పందిస్తూ... ప్రకృతి విపత్తుల సమయం నుంచి రోజువారీ పేదల అవసరాల వరకు నిరంతరం అండగా నిలవడం ఈ ట్రస్ట్ ప్రత్యేకత. నందమూరి కుటుంబ సభ్యులు .. స్వచ్ఛంద కార్యకర్తల సమన్వయంతో సాగుతున్న ఈ సేవలు.. తల్లిదండ్రుల ఆశయాలకు నిజమైన నివాళిగా నిలుస్తున్నాయి. భ‌విష్య‌త్ రోజుల్లో కూడా ఈ ట్రస్ట్ ద్వారా మరిన్ని సామాజిక సంక్షేమ కార్యక్రమాలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండ‌టం స్ఫూర్తిదాయ‌కం. ఎన్బీకే సినిమాలు, రాజ‌కీయాల‌తో ఎంతో త‌ల‌మునక‌లుగా ఉన్నా, బ‌స‌వ‌తార‌కం ద్వారా సోద‌రుల‌తో క‌లిసి సేవాకార్య‌క్ర‌మాల‌ను విడిచిపెట్ట‌కుండా కొన‌సాగించ‌డం అత‌డి ఉన్న‌త‌మైన ఆలోచ‌న‌ల‌కు నిద‌ర్శ‌నం.