ఎన్.పీ.ఏ. షాకింగ్ రిపోర్ట్... అణు పరీక్షల కారణంగా 40 లక్షల మంది మృతి!
ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన అణు ప్రయోగాలు మానవాళికి తీరని శాపంగా మారాయి.
By: Raja Ch | 22 Jan 2026 4:00 PM ISTప్రపంచ దేశాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన అణు ప్రయోగాలు మానవాళికి తీరని శాపంగా మారాయి. రోజు రోజుకీ పెరుగుతున్న యుద్ధ భయాలు, దురాక్రమణల ఆందోళనల నేపథ్యంలో.. ఈ అణ్వాయుధాల టాపిక్ రోజు రోజుకీ తీవ్రమవుతోంది. ఈసారి మరో ప్రపంచ యుద్ధం వస్తే వీటి ద్వారా భూగ్రహం దాదాపు నాశనం అయిపోతుందని చెబుతున్నా.. ఎవరూ తగ్గడం లేదు సరికదా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో.. గత నవంబర్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. వాషింగ్టన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించవచ్చని సూచించారు. రష్యా, చైనా ఇప్పటికే అలా చేస్తున్నాయని ఆయన ఆరోపించాగా.. ఆ దేశాలు ఈ ఆరోపణలను ఖండించాయి. మరోవైపు అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిం దేశంగా పాకిస్థాన్ ఉండగా.. ఇరాన్ కూడా ఇటీవల ఆ ప్రయత్నాలు చేసిందని అంటారు. దీంతో.. ఆ ప్రయత్నాలను ఇజ్రాయెల్ అడ్డుకుంది.
ఈ క్రమంలో అణ్వాయుధాలు, అణు పరీక్షలపై ప్రపంచ దేశాలు అత్యుత్సాహం చూపిస్తోన్న తరుణంలో ఓ షాకింగ్ నివేదిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ప్రపంచ దేశాలు తమ సైనిక పరాక్రమాన్ని చాటుకునేందుకు నిర్వహించిన అణు పరీక్షలు, భూమిపై ఉన్న లక్షలాది మంది అమాయకపు ప్రజల ప్రాణాలు తీశాయని 'నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్' (ఎన్.పీ.ఏ) విడుదల చేసిన 304 పేజీల నివేదిక తెలిపింది. ఇందులోని విషయాలు షాకింగ్ గా ఉన్నాయి.
ఇందులో భాగంగా...1945 నుంచి 2017 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన 2,400కు పైగా అణు పరీక్షల వల్ల సు మారు 40 లక్షల మంది అకాల మరణం చెందారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ సందర్భంగా స్పందించిన ఫ్రెంచి పాలినేషియాకు చెందిన 37 ఏళ్ల ఎంపీ.. 1996లో పాలినేషియాలోని తమ ఇంటి వద్ద అణు పరీక్షలు నిర్వహించారని.. ఫలితంగా వాళ్లు మాకు విషం పెట్టారని.. అప్పుడు తన వయసు ఏడేళ్లని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన ఎన్.పీ.ఏ చీఫ్ రేమండ్ జోహన్సెన్.. గత అణ్వాయుధ పరీక్షలు నేటికీ ప్రాణాలను బలిగొంటున్నాయని అన్నారు. అణ్వాయుధాలను మళ్లీ పరీక్షించకుండా లేదా ఉపయోగించకుండా నిరోధించాలనే దృఢ సంకల్పాన్ని ఈ తాజా నివేదిక బలోపేతం చేస్తుందని తెలిపారు. ఇదే సమయంలో.. అణు పరీక్షల కాలం పరిణామాలు చాలా దీర్ఘకాలికంగా, చాలా తీవ్రంగా ఉన్నాయని కొలంబియా విశ్వవిద్యాలయ కెమిస్ట్రీ లెక్చరర్, న్యూక్లియర్ ఏజ్ పీస్ ఫౌండేషన్ అధిపతి, ఎన్.పీ.ఏ నివేదికకు దోహదపడిన ఇవానా హ్యూస్ హెచ్చరించారు.
ఇదే క్రమంలో... నేడు జీవించి ఉన్న ప్రతి వ్యక్తి వారి ఎముకలలో వాతావరణ పరీక్షల నుండి రేడియోధార్మిక ఐసోటోపులను కలిగి ఉంటారని ఈ నివేదిక సహ రచయిత, సౌత్ కరోలినా విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర ప్రొఫెసర్ మాగ్డలీనా స్టాకోవ్స్కీ తెలిపారు. ఇదే సమయంలో... రేడియేషన్ వల్ల కలిగే ప్రమాదాలు గతంలో అనుకున్నదానికంటే చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి.. నివేదిక సహ రచయిత టిల్మాన్ రఫ్ చెప్పారు.
ఇదే సమయంలో... అణ్వాయుధాలను కలిగి ఉన్న తొమ్మిది దేశాలైన రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్, భారతదేశం, ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఉత్తర కొరియాలలో గోప్యతా సంస్కృతి కొనసాగుతుందని.. ఈ దేశాలు నిర్వహించిన అణు పరీక్షల వల్ల సంభవించిన ఆరోగ్య, పర్యావరణ నష్టాలు వెల్లడి కాలేదని.. పరీక్షల తర్వాత రేడియోధార్మిక వ్యర్థాలను పాతిపెట్టిన ఖచ్చితమైన ప్రదేశాలు బహిర్గతం కాలేదని నివేదిక పేర్కొంది.
