Begin typing your search above and press return to search.

పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. 8 మంది మృతి

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫరీదాబాద్ ప్రమాదకర పేలుడు పదార్థాల్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.

By:  Garuda Media   |   15 Nov 2025 9:44 AM IST
పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. 8 మంది మృతి
X

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫరీదాబాద్ ప్రమాదకర పేలుడు పదార్థాల్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. వీటిని జమ్ముకశ్మీర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ లో నిల్వ ఉంచారు. శుక్రవారం రాత్రి వీటి శాంపిల్స్ సేకరించే సమయంలో చోటు చేసుకున్న పేలుడు ధాటికి 8 మంది మృతి చెందగా.. 30 మంది వరకు గాయపడినట్లుగా చెబుతున్నారు. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది. సీజ్ చేసిన పేలుడు పదార్థాల్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భారీ పేలుడుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.

ఈ ఘటనలో మృతి చెందిన వారంతా పోలీసులు.. ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. శరీర భాగాలు 300 మీటర్ల దూరంలో పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి 11.22 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అంత రాత్రి పూట పేలుడు పదార్థాల శాంపిల్స్ సేకరించటం ఏమిటి? అన్నది ప్రశ్న. మరో కీలకమైన అంశం ఏమంటే.. ఈ పేలుడు పదార్థాల్ని తీసుకొచ్చింది శుక్రవారం కాదు. తెచ్చి చాలా రోజులే అయయింది. అలాంటప్పుడు ఇంత ఆలస్యంగా.. అది కూడా అర్థరాత్రి వేళలో శాంపిల్స్ సేకరించాల్సిన అవసరం ఏమిటి? అన్నది మరో ప్రశ్న.

ప్రమాదకర పేలుడు పదార్థాల్ని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎలా ఉంచుతారన్నది మరో ప్రశ్న. ప్రొసీజర్ ప్రకారం చూసినప్పుడు.. సీజ్ చేసిన సామాగ్రిని పోలీస్ స్టేషన్ లో ఉంచటం మామూలుగా జరిగే చర్యే అయినప్పటికి.. ప్రమాదకర పేలుడు పదార్థాల్ని సీజ్ చేసిన సమయంలో.. వాటిని జాగ్రత్తగా నిల్వ ఉంచితే బాగుంటుంది కదా? అన్నది ప్రశ్న. హర్యానాలోని ఫరీదాబాద్ లో అక్కడి పోలీసులు ఉగ్రకుట్రను భగ్నం చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా 360 కేజీల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ లింకుల ఆధారంగా భారీ ఉగ్రముప్పు తప్పినట్లైంది.

అయితే.. ఆ సంతోషం లేకుండా పోయింది. ఎందుకంటే.. ఇప్పటికే ఉగ్రవాదులు సూసైడ్ బాంబర్ తో దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో కారు పేలుడు ఘటనతో పలువురు మరణించగా..తాజా ఉదంతంతో మరికొందరి ప్రాణాలు పోయిన పరిస్థితి. ఫరీదాబాద్ లో సీజ్ చేసిన పేలుడు సామాగ్రిని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచినట్లుగా చెబుతున్నారు. వీటి శాంపిల్స్ సేకరించే క్రమంలోనే ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.