యుద్ధం దాటిన అనురాగం: ప్రేమ బంధాల బలం
రెండు సంవత్సరాల క్రితం, అక్టోబర్ 7, 2023 రోజున ఈ జంట ‘నోవా మ్యూజిక్ ఫెస్టివల్’లో ఆనందంగా గడిపేందుకు వెళ్లారు. కానీ ఆ రోజు వారి జీవితంలోనే అత్యంత భయానక రాత్రిగా మారింది.
By: A.N.Kumar | 14 Oct 2025 9:00 PM ISTప్రేమకు యుద్ధం కూడా అడ్డు కాదని చెప్పడానికి చరిత్రలో నిలిచిపోయే కథ ఇది. ఇజ్రాయెల్‌కు చెందిన యువజంట నోవా అర్గామణి, అవినాతన్ ఓర్‌ల అపూర్వ ప్రేమకథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. సుదీర్ఘంగా 738 రోజులు..దాదాపు రెండు సంవత్సరాలు.. హమాస్ చెరలో నరకయాతన అనుభవించిన అవినాతన్ ఓర్.. తాజాగా కుదిరిన శాంతి ఒప్పందం ఫలితంగా బందీ జీవితం నుంచి విముక్తి పొందాడు.
* ప్రేమికుల కలయిక.. కన్నీళ్లతో కూడిన ఆనందం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన తాజా శాంతి ఒప్పందం కింద విడుదలైన బందీల్లో ఓర్ ఒకరు. గాజా సరిహద్దులోని రయీమ్ క్రాసింగ్ వద్ద అతను స్వదేశంలో అడుగుపెట్టిన ఆ చారిత్రక క్షణంలో అతని ప్రియురాలు నోవా అర్గామణి ఉద్వేగంతో పరిగెత్తుకెళ్లి అతన్ని గట్టిగా హత్తుకుంది. బందీ జీవితంలో అనుభవించిన బాధ, విరహం ఆ ఆలింగనంలో కరిగిపోయాయి. వారు హగ్ చేసుకున్న, ముద్దులు పెట్టుకున్న ఈ అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, మిలియన్ల హృదయాలను తాకింది. ఈ కలయికను చూసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) కూడా భావోద్వేగానికి లోనైంది. తమ అధికారిక సోషల్ మీడియాలో ఈ చిత్రాలను షేర్ చేస్తూ "చివరికి నోవా అర్గామణి, అవినాతన్ ఓర్‌లు మళ్లీ కలిశారు" అని పేర్కొంది.
* ఒక సంగీత వేడుక నుంచి బందీ జీవితానికి
రెండు సంవత్సరాల క్రితం, అక్టోబర్ 7, 2023 రోజున ఈ జంట ‘నోవా మ్యూజిక్ ఫెస్టివల్’లో ఆనందంగా గడిపేందుకు వెళ్లారు. కానీ ఆ రోజు వారి జీవితంలోనే అత్యంత భయానక రాత్రిగా మారింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసినప్పుడు, వేలాది మంది ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఆ అల్లకల్లోలంలో హమాస్ మిలిటెంట్లు నోవాను, ఓర్‌ను బలవంతంగా గాజాలోకి తీసుకెళ్లారు. బందీగా నోవా ఏడుస్తూ వెళ్తున్న వీడియో అప్పట్లో ప్రపంచాన్ని కదిలించింది. ఆ క్షణం నుంచి మొదలైంది వారి వియోగం, యుద్ధ బాధ.
* నోవా పోరాటం – స్వేచ్ఛ కోసం నిరంతర కృషి
చైనీస్ మూలాలున్న ఇజ్రాయెల్ పౌరురాలైన నోవా అర్గామణి 245 రోజుల తర్వాత ఐడీఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా విముక్తి పొందింది. బందీ జీవితం నుంచి బయటపడ్డాక కూడా ఆమె తన ప్రియుడు ఓర్‌తో సహా మిగిలిన బందీల విడుదల కోసం నిరంతరం, ధైర్యంగా కృషి చేసింది. ఆమె పోరాటమే ఈ రోజు వారి కలయికకు బలం చేకూర్చింది.
* ఎన్విడియా సీఈఓ భావోద్వేగ లేఖ
అవినాతన్ ఓర్ అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఎన్విడియా సంస్థలో పనిచేసేవాడు. అతని విడుదల సందర్భంగా ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తమ ఉద్యోగులకు ఒక భావోద్వేగ లేఖ రాశారు. "రెండు సంవత్సరాల తర్వాత అవినాతన్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతని తల్లి ధైర్యం, విశ్వాసం ఈ కష్టకాలాన్ని జయించాయి" అని పేర్కొన్నారు. యుద్ధంలో కంపెనీకి చెందిన అనేక మంది ఉద్యోగులను కోల్పోయిన బాధను కూడా ఆయన ఈ లేఖలో గుర్తుచేసుకున్నారు.
* ప్రేమ శక్తి – యుద్ధం విఫలం
ప్రేమను విడదీయాలని యుద్ధం ప్రయత్నించింది, కానీ అది సాధ్యం కాలేదు. నోవా, ఓర్‌ల కలయిక ఈ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. "యుద్ధం ఎంతటి కఠినమైనదైనా, నిజమైన ప్రేమను బంధించలేదు." ఈ జంట యొక్క కన్నీళ్లు, ఆనందం, మళ్లీ కలిసిన క్షణం ఇప్పుడు మానవత్వానికి, ప్రేమ శక్తికి ప్రతీకగా మారింది. వారి కథ ప్రేమకు ఉన్న అపారమైన శక్తిని మరోసారి లోకానికి తెలియజేసింది.
