చిన్న ఒవైసీకి ఏమైంది? 55 ఏళ్లకే ఇంత వైరాగ్యమా?
మజ్లిస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్బరుద్దీన్ తన కుమారుడ్ని తన రాజకీయ వారసుడిగా తెర మీదకు తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నట్లు చెబుతున్నారు.
By: Garuda Media | 4 Oct 2026 5:00 PM IST55 ఏళ్లు వచ్చేశాయి.. ముసలివాడినయ్యా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. శేష జీవితాన్ని మక్కాలో గడిపేస్తా.. ఇలా అనూహ్య రీతిలో మాట్లాడి.. వార్తల్లోకి వచ్చారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమ్ముడు కం మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తాజాగా బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే.. 55 ఏళ్లు అన్నది రాజకీయాల్లో ఏ మాత్రం పెద్ద వయసు కాదు. కానీ.. రిటైర్మెంట్ కావటానికి తాను సిద్ధంగా ఉన్న విషయాన్ని అక్బరుద్దీన్ స్పష్టం చేయటంతో.. ఎందుకిలా? అక్బరుద్దీన్ కు ఏమైంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తమకు చెందిన కాలేజీలో ఇంటర్ పాసైన విద్యార్థులకు ధ్రువపత్రాల్ని పంపిణీ చేసే సందర్భంలో తాను ప్లస్ టూ వరకు చదివానని చెప్పేందుకు తాను ఏ మాత్రం సిగ్గుపడనని చెప్పిన ఆయన.. ఆకాశాన్నంటే ఒవైసీ విద్యా సంస్థల భవనాల్ని తాను నిర్మించానని చెబుతూ.. ‘కొందరు నా పరువుతో ఆటలాడుకుంటున్నారు. ఇబ్బందులు క్రియేట్ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎవరి ముందూ తలవంచే ప్రసక్తే లేదు. ఈ దేశం అందిరిదీ. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. నేను ఉన్నా లేకుననా ఒవైసీ విద్యాసంస్థల భవనాల్లో నా గళం శాశ్వతంగా నిలిచిపోతుంది’’ అంటూ భావోద్వేగంతో మాట్లాడిన ఆయన.. తన రిటైర్మెంట్ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది.
తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తనకు స్పష్టత లేదని చెబుతూ.. తాను పోటీ చేస్తానో లేదో? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘నాకిప్పుడు యాభై ఐదేళ్లు. ముసలివాడినయ్యా. బహుశా పోటీ చేయకపోవచ్చు’ అంటూ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. రాజకీయాల్లో 55 ఏళ్లు అన్నది మధ్య వయస్కుడిగా వ్యవహరిస్తారు. అంతేకాదు.. తాను అన్నింటిని వదిలేసి.. మక్కాలోనే ఉండాలని ఉందని.. అక్కడే కన్నుమూయాలన్నదే తన కోరికగా చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు మజ్లిస్ కార్యకర్తలకు షాకింగ్ గా మారాయి. అక్బరుద్దీన్ తండ్రి సుల్తాన్ సలహుద్దీన్ ఒవైసీ సంగతే తీసుకుంటే.. 72 ఏళ్ల వయసులోనూ రాజకీయాలు చేశారు. అందుకు భిన్నంగా చిన్న ఒవైసీ ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
మజ్లిస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్బరుద్దీన్ తన కుమారుడ్ని తన రాజకీయ వారసుడిగా తెర మీదకు తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండటం.. కొడుకును రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించటం ద్వారా తాను రిటైర్మెంట్ కావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒవైసీ కుటుంబం నుంచి నాలుగో తరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తన కొడుకు (డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ) చేత డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. సాంకేతికంగా ఏదైనా సమస్యలు ఎదురైతే.. పనికి వస్తుందని ఇలా చేశారు. పోటీకి ఎలాంటి సమస్యలు రాకపోవటంతో కొడుకు నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అయితే.. ఈ విషయాలేవీ అప్పట్లో అంతగా ఫోకస్ కాలేదు.
ఇక అక్బరుద్దీన్ ఒవైసీ కొడుకు (నూరుద్దీన్ ఒవైసీ) విషయానికి వస్తే 26 ఏళ్ల వయసున్న ఇతను డాక్టర్. ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ఎండీ అనస్థీషియా చదివిన ఇతను కొంతకాలంగా సలార్ -ఇ-మిల్లత్ విద్యా సంస్థల బాధ్యతల్ని చూసుకుంటున్నాడు. తండ్రితో పాటు డమ్మీ నామినేషన్ వేసిన ఇతను.. 2024 లోక్ సభ ఎన్నికల వేళ.. తన పెదనాన్నకు మద్దతుగా చురుకుగా ప్రచారాన్ని నిర్వహించాడు. అక్బరుద్దీన్ ఒవైసీకి ఒక కుమార్తె, కుమారుడు. ఇటీవలే కుమార్తె పెళ్లి లండన్ లో జరిగింది. అక్బరుద్దీన్ కొడుకు విషయానికి వస్తే ఇతనిపై ఎలాంటి కేసులు లేవు. క్లీన్ హిస్టరీగా చెప్పొచ్చు. ఓవైపు వెంటాడుతున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో కొడుక్కి రాజకీయ వారసుడిగా తెర మీదకు తీసుకొచ్చి.. బాధ్యతలు అప్పజెప్పేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే చాంద్రాయణగుట్ట నుంచి కానీ చార్మినార్ నుంచి కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే విజయవంతంగా ఒవైసీ నాలుగో తరం రాజకీయాల్లోకి వచ్చేసినట్లు అవుతుంది.
