నాస్ట్రాడమస్ 2025 భవిష్యవాణులు: మళ్లీ భయపెట్టే సంకేతాలు..!
ప్రపంచ చరిత్రలో ఎన్నో మిస్టరీలకు నిలయంగా నిలిచిన వాటిలో నాస్ట్రాడమస్ భవిష్యవాణులు ఒకటి.
By: A.N.Kumar | 9 Sept 2025 3:00 AM ISTప్రపంచ చరిత్రలో ఎన్నో మిస్టరీలకు నిలయంగా నిలిచిన వాటిలో నాస్ట్రాడమస్ భవిష్యవాణులు ఒకటి. ఫ్రెంచ్ వైద్యుడు, జ్యోతిష్కుడు అయిన మిచెల్ డి నోస్ట్రెడామ్ (Nostradamus) 16వ శతాబ్దంలో రాసిన 'లెస్ ప్రోఫెటీస్' పుస్తకంలోని అంచనాలు నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అస్పష్టమైన శైలిలో, నాలుగు పంక్తుల కవితలు (క్వాట్రైన్‌లు) గా ఆయన రాసిన భవిష్యవాణులు శతాబ్దాల తరువాత జరిగిన అనేక చారిత్రక సంఘటనలకు సరిపోలుతున్నాయని చాలామంది చరిత్రకారులు చెబుతారు.
2025 కోసం నాస్ట్రాడమస్ హెచ్చరికలు
2025 సంవత్సరానికి సంబంధించి నాస్ట్రాడమస్ చేసిన అంచనాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇవి ఆందోళన కలిగించేలా ఉన్నాయి. బ్రిటన్ (యూకే) , యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణిస్తాయని నాస్ట్రాడమస్ పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయంగానే కాకుండా ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తక్షణమే కనిపించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో మిలియన్ల ప్రాణాలను బలి తీసుకున్న ప్లేగు వంటి వ్యాధి ప్రపంచాన్ని మళ్లీ కుదిపేస్తుందని నాస్ట్రాడమస్ అంచనా వేశారు. ఇది ఏ వ్యాధి అని ఆయన కచ్చితంగా చెప్పకపోయినా, మహమ్మారి స్థాయిలో వ్యాపించే అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మనల్ని వెంటాడుతూ ఉండగా, ఇలాంటి భవిష్యవాణి మరింత భయపెడుతోంది.
గతంలో నిజమైన ఆయన భవిష్యవాణులు
నాస్ట్రాడమస్ రాసిన క్వాట్రైన్‌లు సారూప్యంగా ఉన్నాయని అనేకమంది చరిత్రకారులు విశ్లేషించారు. ఫ్రెంచ్ విప్లవం, నెపోలియన్ బోనపార్టే ఎదుగుదల, హిట్లర్ ఉద్భవం , రెండవ ప్రపంచ యుద్ధం, అమెరికాలో 9/11 ఉగ్రదాడి.. ఈ సంఘటనలు ప్రపంచ చరిత్రలో కీలక మలుపులుగా నిలిచాయి. నాస్ట్రాడమస్ అంచనాలు నిజమయ్యాయి అనే నమ్మకం ప్రజల్లో మరింత బలపడడానికి ఇవే ప్రధాన కారణాలు.
* ప్రజలలో ఆందోళన, నిపుణుల అభిప్రాయం
నాస్ట్రాడమస్ పేరు వినగానే చాలామందిలో భయం, ఆశ్చర్యం ఒకేసారి కలుగుతాయి. ఎందుకంటే ఆయన అంచనాలు నిజమైతే పెద్ద మార్పులు, విపత్తులు సంభవించాయనే నమ్మకం ఉంది. అయితే నిపుణులు మాత్రం ఈ భవిష్యవాణులను జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు.
నాస్ట్రాడమస్ రాసిన కవితలు చాలా అస్పష్టంగా ఉండటం వలన వాటిని అనేక రకాలుగా అర్థం చేసుకోవచ్చని, భవిష్యవాణులు నిజం కావడమే కాకుండా జరిగిన సంఘటనలకు అనుగుణంగా మనం వాటిని అన్వయించుకోవడం ఎక్కువగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
నాస్ట్రాడమస్ అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఆయన రాసిన ప్రతి క్వాట్రైన్ నేటికీ ప్రపంచాన్ని ఆసక్తికి, ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. 2025లో ఆయన పేర్కొన్న వ్యాధి ప్రబలింపు నిజమైతే అది మానవాళికి ఒక పెద్ద సవాల్ అవుతుంది. ఇది నిజమవుతుందా? లేక కేవలం ఊహాగానాలుగా మిగిలిపోతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
