ఉత్తరాదికి అందలం.. దక్షిణాదికి మొండిచేయి.. అభివృద్ధి అంటే భవనాలు కట్టడమేనా మోదీజీ?
వేల కోట్లతో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సందడి లేకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ టెర్మినల్స్ వీడియోను నెటిజన్లు ‘ఘోస్ట్ ఎయిర్పోర్ట్’గా అభివర్ణిస్తున్నారు. అభివృద్ధి పేరుతో భారీ నిర్మాణాలకే ప్రాధాన్యం కాకుండా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖ వంటి దక్షిణాది నగరాల అవసరాలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
By: A.N.Kumar | 20 Nov 2026 10:53 PM ISTవేల కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన ఆ భారీ కట్టడాలు చూస్తుంటే గర్వంగా అనిపించాలి... కానీ ప్రయాణికుల అడుగుజాడలు లేని నిశ్శబ్ద టెర్మినల్స్‌ను చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. ఒకవైపు ఎగిరే రెక్కల కోసం ఎదురుచూస్తున్న ఖాళీ ప్రాంగణాలు.. మరోవైపు తమ నగరాలకు ప్రాజెక్టులు రాక ఆశల కళ్లతో నిరీక్షిస్తున్న దక్షిణాది ప్రజల ఆవేదన.. ఈ రెండింటి మధ్య నిజమైన అభివృద్ధి ఎక్కడ దాక్కుందోనన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసును తొలిచేస్తోంది.
దేశంలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే.. అదీ అవసరం లేని వారికే కేటాయించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో మనసును కలచివేస్తోంది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలోని నిశ్శబ్ద దృశ్యాలను చూస్తూ కొందరు దానిని 'దెయ్యాల ఎయిర్పోర్ట్' అని సెటైర్లు వేశారు. అద్భుతమైన టెర్మినల్స్.. మెరిసే అద్దాలు.. అత్యాధునిక హంగులు... అన్నీ ఉన్నాయి. కానీ ప్రయాణికుల సందడి ఎక్కడ? ఆకాశంలో ఎగిరే విమానాల రణగొణ ధ్వనులు ఎక్కడ? ఒక భవనం ఎంత అందంగా ఉన్నా.. అది మనుషుల అవసరాలను తీర్చనప్పుడు.. ఆ వైభవం కేవలం నిశ్శబ్దానికే పరిమితమవుతుందన్న ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది.
కేవలం ఒక్క వీడియో చూసి మొత్తం వ్యవస్థను తప్పుబట్టలేం. ఏ కొత్త ప్రాజెక్టుకైనా ప్రారంభ దశలో కొన్ని పరిమితులు.. సమయపాలన.. సర్వీసుల విస్తరణ వంటి అంశాలు ఉంటాయి. నిజమే. కానీ ఈ దృశ్యం లేవనెత్తిన మౌలిక ప్రశ్న మాత్రం మన గుండెను తాకుతోంది. అభివృద్ధి అంటే కేవలం భారీ నిర్మాణాలు చేపట్టడమేనా? రిబ్బన్ కటింగ్లతో ఫొటో షూట్లతో ప్రకటనలతో ఆగిపోయేదా? లేక సామాన్యుడి జీవితంలో వెలుగులు నింపడమా?
ఈ చర్చ ఇప్పుడు మరో సున్నితమైన కోణాన్ని తాకుతోంది. దేశ ప్రగతి రథంలో ఉత్తరాదికి పెద్దపీట వేస్తూ దక్షిణాదిని విస్మరిస్తున్నారన్న భావన దక్షిణ భారత ప్రజల్లో బలంగా నాటుకుంటోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టులు, మెట్రోలు, రైల్వే కారిడార్ల హడావుడి కనిపిస్తుంటే... దక్షిణాది రాష్ట్రాలు మాత్రం తమ న్యాయమైన వాటా కోసం.. పెండింగ్ ప్రాజెక్టుల ఆమోదాల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాయి.
దేశంలోని ఏ మూల అభివృద్ధి జరిగినా సంతోషించాల్సిందే. కానీ అభివృద్ధి పటం ఒక ప్రాంతానికే పరిమితమై.. మరో ప్రాంతం ఆకాంక్షలను పక్కన పెడితే ఆ వేదన మాటల్లో చెప్పలేనిది. అభివృద్ధిలో ప్రాంతీయ సమతుల్యత లోపించినప్పుడు.. అది ప్రజల్లో ఒక రకమైన అన్యాయపు భావనను మిగులుస్తుంది.
భారీ భవనాలు కట్టడం ద్వారా అధికారం.. ఆడంబరం కనిపించవచ్చు. కానీ నిజమైన ప్రగతి కనిపించేది ప్రజల ప్రయాణ సౌలభ్యంలో.. వారి సమయం ఆదా కావడంలో.. వారి వ్యాపారాలు వృద్ధి చెందడంలో.. విమానాశ్రయాలు.. మెట్రోలు.. బుల్లెట్ రైళ్లు.. ఇవేవైనా సరే, ప్రజలకు అవసరమైన చోట.. జనసమర్ధమున్న చోట.. ప్రజలు ఎక్కువగా వాడే చోట కట్టాలి. సౌకర్యాలు ప్రజలకు చేరువైనప్పుడే వాటికి సార్థకత. నోయిడా లాంటి అవసరం లేని చోట కడితే ఇలాగే అవి కేవలం ఖరీదైన కట్టడాలుగానే మిగిలిపోతాయి.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి నగరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తున్నాయి. ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, వైద్యం వంటి రంగాల్లో దేశానికి అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెడుతున్నాయి. అలాంటి నగరాలకు.. దక్షిణాది ప్రాంతాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరగడం నిజంగా బాధాకరం. రాజకీయ లెక్కల కంటే ప్రాంతీయ అవసరాలు.. ఆర్థిక సామర్థ్యం.. ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదిక కావాలి.
ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని ఆధునీకరించాలనే సంకల్పం ఉండొచ్చు. అది మంచిదే. కానీ ఆ ప్రయాణంలో దక్షిణాది గొంతు కూడా వినిపించాలి. ఒకవైపు కొత్త కట్టడాల ప్రారంభోత్సవాలు.. మరోవైపు ప్రయాణికుల కోసం ఎదురుచూసే ఖాళీ ప్రాంగణాలు.. ఇంకోవైపు తమ ప్రాంతాలకు ప్రాజెక్టులు రాక నిరాశతో ఉన్న ప్రజలు.. ఈ వైరుధ్యం తొలగిపోవాలి. మోడీ దక్షిణాది బిజీ నగరాలకు అలాంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
విమానాశ్రయాలు నిర్మించడం ఒక అడుగు మాత్రమే. వాటిలో విమానాలు ఎగరడం.. ప్రయాణికుల నవ్వులతో ఆ ప్రాంగణాలు కళకళలాడటం అసలైన విజయం. మనకు కావాల్సింది నిశ్శబ్దంగా ఉండే కట్టడాలు కాదు... ప్రజల ఆశలను మోసుకెళ్లే సజీవ ప్రగతి.. ఈ విషయంలో మోడీజీ జర ఆలోచించాలని నోయిడా ‘ఘోస్ట్ ఎయిర్ పోర్టు’ వీడియో చూసి నెటిజన్లు, మేధావులు కోరుతున్నారు.
