Begin typing your search above and press return to search.

నార్త్ కొరియా తదుపరి పాలకుడు ఎవరు? కిమ్ కుమారుడిపై పెరిగిన ఉత్కంఠ

ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వెల్లడించిన కొన్ని కీలక విశ్లేషణలు నార్త్ కొరియా భవిష్యత్ రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పుతున్నాయి.

By:  A.N.Kumar   |   11 Sept 2026 6:00 PM IST
నార్త్ కొరియా తదుపరి పాలకుడు ఎవరు? కిమ్ కుమారుడిపై పెరిగిన ఉత్కంఠ
X

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తదుపరి వారసుడు ఎవరు అనే అంశంపై అంతర్జాతీయ వేదికలపై మళ్లీ తీవ్ర చర్చ ప్రారంభమైంది. దశాబ్దాలుగా తీవ్ర పురుషాధిక్యత, మిలిటరీ ఆధిక్యత కలిగిన ఆ దేశంలో తదుపరి అధికారం కిమ్ కుమార్తెకు దక్కనుందా లేక ఆయనకు కుమారుడు ఉన్నాడా అనే ప్రశ్నలు ప్రపంచ దేశాల దౌత్యవేత్తలను, రాజకీయ విశ్లేషకులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వెల్లడించిన కొన్ని కీలక విశ్లేషణలు నార్త్ కొరియా భవిష్యత్ రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పుతున్నాయి.

గతంలో దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం కిమ్ జోంగ్ ఉన్, ఆయన భార్య రీ సోల్ జు దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారని భావించేవారు. వీరిలో మొదటి సంతానం కుమారుడని, ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు ఉన్నారని అంచనా వేసేవారు. అయితే ఇటీవల పాశ్చాత్య మీడియాలో కిమ్‌కు అసలు కుమారుడే లేడంటూ కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ స్పందిస్తూ కిమ్‌కు కుమారుడు ఉన్నాడా లేదా అన్న అంశాన్ని తమ నిఘా వర్గాలు ఇప్పటికీ లోతుగా పరిశీలిస్తున్నాయని.. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాలేదని వెల్లడించింది. ఒకవేళ ఆయనకు కుమారుడు ఉన్నప్పటికీ ప్రస్తుతం అతడు శారీరకంగా లేదా మానసికంగా దేశ నాయకత్వ బాధ్యతలు చేపట్టి నడిపించే స్థితిలో లేడని, అందుకే అతడిని బయటి ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచి ఉండవచ్చని సౌత్ కొరియా అంచనా వేస్తోంది. నార్త్ కొరియా ప్రభుత్వం తమ సుప్రీమ్ లీడర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతుంది కాబట్టి ఈ విషయంలో అధికారికంగా నిజాలు బయటకు రావడం దాదాపు అసాధ్యం.

అదే సమయంలో కిమ్ జోంగ్ ఉన్ తన రెండవ కుమార్తె కిమ్ జు ఏను గత కొంతకాలంగా అత్యంత కీలకమైన ప్రభుత్వ, సైనిక కార్యక్రమాల్లో ప్రముఖంగా ముందుకు తెస్తున్నారు. నార్త్ కొరియా రాజకీయ చరిత్రలోనే ఇది ఒక అపూర్వమైన ఘట్టంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఖండాంతర క్షిపణి ప్రయోగాలు, ప్రధాన సైనిక పరేడ్‌లు, రక్షణ రంగానికి సంబంధించిన ఉన్నత స్థాయి సమావేశాల్లో కిమ్ తన కుమార్తెతో కలిసి పాల్గొనడమే కాకుండా ఆమెకు మిలిటరీ జనరల్స్ సైతం అభివాదం చేసేలా వాతావరణాన్ని నిర్మించారు. గతంలో ప్రభుత్వ మీడియా ఆమెను ప్రియమైన కుమార్తె అని మాత్రమే పేర్కొనగా ఇప్పుడు గౌరవనీయమైన వారసురాలు అనే అర్థం వచ్చేలా సంబోధిస్తుండటం గమనార్హం. పితృస్వామ్య భావజాలం బలంగా ఉండే నార్త్ కొరియా సమాజంలో ఒక చిన్న వయసు ఉన్న అమ్మాయికి సైనిక వేదికలపై ఇంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక, ఆమెను భవిష్యత్ అధినేతగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని దక్షిణ కొరియా భావిస్తోంది.

నార్త్ కొరియాలో అధికారం పాక్తు రక్తం ప్రాతిపదికన కిమ్ రాజవంశంలోనే తరం నుండి తరానికి బదిలీ అవుతుంది. దేశాన్ని పాలించే అర్హత కేవలం ఆ రక్తసంబంధీకులకే ఉంటుందనే నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. ఒకవేళ కిమ్‌కు కుమారుడు ఉన్నప్పటికీ అతడు నాయకత్వానికి శారీరకంగానో లేదా మానసికంగానో సిద్ధంగా లేకపోతే కిమ్ జు ఏ వైపే అధికారం మొగ్గుచూపే అవకాశం నిశ్చయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతానికి కిమ్ కుమారుడి ఉనికిపై దక్షిణ కొరియాకే కాకుండా ప్రపంచ దేశాలకు సైతం కచ్చితమైన ఆధారం లభించలేదు. కానీ కిమ్ జు ఏకు లభిస్తున్న ప్రాధాన్యతను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఉత్తర కొరియాను ఒక మహిళా నియంత పాలించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.