తుపాన్లకు పేర్లు ఎవరు పెడతారు? దీనికి నిబంధనలు ఏమైనా ఉన్నాయా?
ఈ నియమాలను పాటించిన తరువాతే, ఆ పేర్లను ప్రాంతీయ వాతావరణ సంస్థల ప్యానెల్ తుది జాబితాలో చేరుస్తుంది.
By: Tupaki Political Desk | 27 Oct 2025 8:30 PM ISTతుపానులు రావడం అనేది భూమిపై జరిగే ఒక సహజ వాతావరణ ప్రక్రియ. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం, అల్పపీడనం ఏర్పడటం వంటి వాతావరణ పరిస్థితులు కలయికతో తుపాన్లు ఉద్భవిస్తాయి. అయితే ఒకే సమయంలో వచ్చే తుపాన్లను గుర్తించడానికి వాటికి ప్రత్యేకంగా పేర్లు పెడుతున్నారు. ప్రజలకు సమాచార మార్పిడి సులభతరం చేయడంతోపాటు తుఫానుల తీవ్రతను సులభంగా గుర్తుంచుకోవడానికి ప్రజలను అప్రమత్తం చేయడానికి పేర్లు పెట్టాలని అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయించారు. ఈ విధానం తొలుత అమెరికాలో ప్రారంభమవగా, 2004 నుంచి ఉత్తర హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని 13 సభ్య దేశాల కూటమి కూడా ఇందుకు సమ్మతించింది.
ఉత్తర హిందూ మహాసముద్ర తీర ప్రాంతం అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం సమీపంలో ఉన్న దేశాల కూటమి. ఇందులో మొత్తం 13 సభ్య దేశాలు ఉండగా, వాటిలో మనదేశంతోపాటు బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), యెమెన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు అన్నీ కలిసి ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫాన్లకు పేర్లు పెడుతున్నాయి.
తుపాను వచ్చినప్పుడు, ఆయా దేశాల ఆంగ్ల అక్షరాల వరుస క్రమం ప్రకారం పేర్లు పెడతారు. ఒకసారి ఉపయోగించిన పేరును మళ్లీ ఉపయోగించరు. ఇందుకోసం ప్రత్యేక నిబంధనలు పాటిస్తారు. ముందుగా 13 దేశాలు ఒక్కొక్కటిగా సూచించిన పేర్లతో ఒక జాబితాను తయారు చేస్తారు. ఈ పేర్లు మత విశ్వాసాలు, సంస్కృతి, రాజకీయాలకు సంబంధించినవి కాకుండా ఉండాలి. గరిష్టంగా 8 అక్షరాలు మాత్రమే ఉండాలి. సులువుగా పలకడానికి వీలుగా పేర్లు సూచించాల్సివుంటుంది.
ఈ పేర్లు ప్రధానంగా కమ్యూనికేషన్ సౌలభ్యం ఉండేలా ఉండాలి. అదేవిధంగా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సివుంది. ఆ పేరు ఏ విధమైన రాజకీయాలు, మతం, సాంస్కృతిక విశ్వాసాలు, లేదా లింగ భేదాలకు సంబంధించినదిగా ఉండకూడదు. అగౌరవ పరిచేవిధంగా, అసభ్యకరంగా, క్రూరత్వంతో కూడినదిగా లేదా ప్రపంచంలో ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉండకూడదని సభ్య దేశాలు తీర్మానించాయి. ఇక ఒకసారి తుపానుకు పెట్టిన పేరును మరోసారి ఉపయోగించకూడదన్న నిబంధన విధించారు.
పేరును ప్రతిపాదించే దేశం దాని స్పెల్లింగ్, ఉచ్చారణ వాయిస్ రికార్డింగ్ ను తప్పనిసరిగా సమర్పించాల్సివుంటుంది. ఈ నియమాలను పాటించిన తరువాతే, ఆ పేర్లను ప్రాంతీయ వాతావరణ సంస్థల ప్యానెల్ తుది జాబితాలో చేరుస్తుంది. మన దేశం తరఫున ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ (IMD) ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం తుపాన్ల పేర్లను సూచిస్తుంది. 2004 నుంచి ఇప్పటివరకు మన దేశం నుంచి పది తుపానులకు పేర్లు పెట్టారు. 2004 నుంచి 2019 వరకు మొదటిజాబితాలో 8 తుఫాన్లకు 2020 తర్వాత సమర్పించిన రెండో జాబితాలో రెండు తుఫాన్లకు భారత్ సూచించిన పేర్లు పెట్టారు.
2004 నవంబరులో అరేబియా సముద్రంలో సంభవించిన తుఫానుకు తొలిసారిగా భారత్ సూచించిన అగ్ని పేరు పెట్టారు. ఆ తర్వాత 2007లో బంగాళాఖాతంలో వచ్చిన తుఫానుకు ఆకాష్ అనే పేరు పెట్టారు. 2009లో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కు బిజిలీ అనే నామకరణం చేశారు. ఆ తర్వాత 2010, 2013, 2016, 2018, 2019 వరుసగా వచ్చిన తుపానులకు భారత్ సూచించిన పేర్లు పెట్టారు. 2010 నవంబరులో బంగాళాఖాతంలో వచ్చిన తుపాను ‘జల్’ అని పిలిస్తే 2016లో వచ్చిన తుపానుకు లహర్ గా పేరు పెట్టారు. 2016లో వార్దా, 2018లో సాగర్, 2019లో వాయు అనే పేర్లను భారత్ సూచించింది.
ఇక రెండో జాబితాలో సూచించిన పేర్ల నుంచి 2020, 2023లో అరేబియా సంద్రంలో వచ్చిన తుఫాన్లకు వాడుకున్నారు. 2020 నంబరులో గతి, 2023 అక్టోబరులో తేజ్ తుఫాన్ల పేర్లను భారత్ ఎంపిక చేసింది. ప్రస్తుతం ఏపీని షేక్ చేస్తున్న మొంథా తుఫాను పేరును థాయ్‌లాండ్ సూచించింది. థాయ్ భాషలో మొంథా అంటే సుగంధమైన లేదా అందమైన పువ్వు అన్న అర్థమని చెబుతున్నారు. ఈ క్రమంలో తర్వాత వచ్చే తుఫానుకు పేరు సిద్ధంగా ఉంది. మొంథా తర్వాత వచ్చే తుఫానును సెన్యార్ గా వ్యవహరిస్తారు. దీనిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది.
