ఉత్తరాంధ్రకు బిగ్ అలెర్ట్... పొంచి ఉన్న పెను ముప్పు !
ఉత్తరాంధ్ర జిల్లాలు ఇపుడు తీవ్ర వాయుగుండం తాకిడికి అతలాకుతలం అవుతున్నాయి. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో అతి భారీ వర్షాలు గత ఇరవై నాలుగు గంటల నుంచి కురుస్తూంటే భారీ వర్షాలు విశాఖలో పడుతున్నాయి.
By: Satya P | 22 Sept 2026 10:36 PM ISTఉత్తరాంధ్ర జిల్లాలు ఇపుడు తీవ్ర వాయుగుండం తాకిడికి అతలాకుతలం అవుతున్నాయి. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో అతి భారీ వర్షాలు గత ఇరవై నాలుగు గంటల నుంచి కురుస్తూంటే భారీ వర్షాలు విశాఖలో పడుతున్నాయి. ఇక మరో ఇరవై నాలుగు గంటల పాటు తీవ్ర వాయుగుండం ప్రభావం ఉంది అని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇదిలా ఉంటే తీవ్ర వాయుగుండంగా బలపడిన వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర మీదనే అధికంగా ఉంటుందని చెబుతున్నారు.
రాత్రి దాటాల్సిందే :
ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 140 కిలోమీటర్లు , ఒడిశాలోని పూరీకి 210 కిలొ మీటర్లు విశాఖపట్నానికి 220 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రికి ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన విశాఖపట్నం గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం, గురువారం భారీ వర్షాలు కురుస్తాయని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ జిల్లాలు ఎఫెక్ట్ :
ఇక తీవ్ర వాయుగుండం మరో రెండు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి , ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్స్ :
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారత వాతావరణ విభాగం హై అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరో వైపు చూస్తే ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని అంటున్నారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి జిల్లాలకు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఇక ఈ ప్రాంతాల వాసులను భద్రమైన ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
వాయుగండం గానే :
వానలు లేక సతమతం అవుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలకు తీవ్ర అల్ప పీడనం ప్రభావంతో భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. అయితే వీటి వల్ల ఇబ్బందులు లేకుండా బయటపడాలని అంతా చూస్తున్నారు. భారీగా పడుతున్న వానలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో తుఫాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఉత్తరాంధ్రాలోని జిల్లాలకు బుధవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా అత్యవసరం అయితే తప్ప ఇంటి వద్దనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
