Begin typing your search above and press return to search.

బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్... ఆ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తన ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో పలు చోట్ల భారీ వర్షాలు, ఈదురు గాలులు హల్ చల్ చేస్తున్నాయి.

By:  Raja Ch   |   2 Oct 2025 3:47 PM IST
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్... ఆ జిల్లాల ప్రజలకు బిగ్  అలర్ట్!
X

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తన ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో పలు చోట్ల భారీ వర్షాలు, ఈదురు గాలులు హల్ చల్ చేస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల, ఉమ్మడి గోదావరి జిల్లాల్లోను వర్షాలు కురుస్తున్నాయి. ఇక... విశాఖపట్నంలో గురువారం ఉదయం నుంచి ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో పాటు భారీ వర్షం కురిసింది.

అవును... బంగాళ్లాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రధానంగా విశాఖ, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షంతో పాటు ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కార్యాలయం సమీపంలో భారీ వృక్షంతో పాటు ఆకాశవాణి కేంద్రం వద్ద, ఇతర ప్రాంతాల్లోనూ భారీ చెట్లు పడిపోయాయి.

ఇందులో భాగంగా సిటీలోని పలు కాలనీల్లో కొన్ని చెట్లు ఇళ్లపైనా, ఇంటి గోడలపైనా, కార్లపైనా పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయ ఏర్పడింది. మరోవైపు ఈదురు గాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. గురువారం ఉదయం నుంచి వాయుగుండం ప్రభావం కనిపించింది!

ఈ సందర్భంగా స్పందించిన వాతావరణ శాఖ... వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలో... శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర మధ్యలో పరదీప్, గోపాల్ పూర్ పోర్టులకు సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణకోస్తాలోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. దీంతో.. వర్ష ప్రభావిత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

అల్లూరి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద!:

అల్పపీడనం కారణంగా అల్లూరి జిల్లాలో గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి! ఇందులో భాగంగా... పెదబయలు, పాడేరు, ముంచంగి పుట్టు, జి.మాడుగుల, అరకులోయ, హుకుంపేట, అనంతగిరి, చింతపల్లి, జీకే వీధి మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో... ముంచంగి పుట్టు మండలం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

కోనసీమ జిల్లాలో గోదావరి వరద కష్టాలు!:

తాజాగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి జిల్లాల లంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో... పి.గన్నవరం నియోజకవర్గంలో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో... అయినవిల్లి లంక, ఎదురు బిడియం కాజ్వే, అప్పనపల్లి కాజ్ వేలపై వరద ప్రవాహం కొనసాగుతోంది.

దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో రాజోలు నియోజకవర్గంలోని సఖినేటిపల్లి లంక, కొత్త లంక, రామరాజులంక, పెదలంక గ్రామాల్లో వరద కష్టాలు మొదలయ్యాయి. దీంతో... ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనూ, నిత్యావసర వస్తువులకు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.