Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా ఫోకస్...కూటమికి ప్లస్ అవుతుందా ?

ఉత్తరాంధ్రా జిల్లాలలో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి స్వీప్ చేసి పారేసింది.

By:  Satya P   |   2 Aug 2026 9:06 AM IST
ఉత్తరాంధ్రా ఫోకస్...కూటమికి ప్లస్ అవుతుందా ?
X

ఉత్తరాంధ్రా జిల్లాలలో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి స్వీప్ చేసి పారేసింది. అరకు పాడేరు తప్ప అన్ని సీట్లు టీడీపీ కూటమి పరం అయ్యాయి. 2029 ఎన్నికల్లో ఇదే ఊపు కొనసాగించాలని కూటమి చూస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు అక్కడే చేపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే టాప్ రేంజిలో ఉన్న గూగుల్ డేటా సెంటర్ ని విశాఖలో ఏర్పాటు చేయించిన చంద్రబాబు కొద్ది నెలల క్రితం దాని శంకుస్థాపనను ఘనంగా నిర్వహించారు. 2028 నాటికి గూగుల్ తన ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయనుంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర సాయానికి భరోసా ఇచ్చారు.

మిట్టల్ స్టీల్ ప్లాంట్ తో :

ఇక అనకాపల్లి జిల్లాలో ఏకంగా లక్షా నలభై వేల కోట్ల రూపాయలతో రెండు దశలలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ రానుంది. దానికి కూడా చంద్రబాబు కేంద్ర మంత్రి కుమారస్వామితో కలసి శంకుస్థాపన చేశారు. తొలిదశ ఆపరేషన్స్ 2028లో మొదలవుతాయని చెబుతున్నారు. ఆ విధంగా డెడ్ లైన్ విధించి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రకాలైన అనుమతులు మంజూరు చేశారు. ఇక ఇదే జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ రానుంది. అలాగే ఇతర పరిశ్రమలు కూడా అనకాపల్లి జిల్లా చుట్టు పక్కల వస్తున్నాయి. విశాఖ జిల్లాలో చూస్తే అనేక ఐటీ కంపెనీలు తరలి వస్తున్నాయి. అదే విధంగా మరిన్ని డేటా సెంటర్లు కూడా విశాఖ విజయనగరం జిల్లాలలో ఏర్పాటుకు సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే భోగాపురం వద్ద అదానీ డేటా సెంటర్ కి కూడా రంగం సిద్ధం అయింది.

శ్రీకాకుళంలో సైతం :

ఇంకో వైపు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు కూడా 2028 నాటికి ఆపరేషన్స్ కి సిద్ధంగా ఉంది. అలాగే ఇక్కడే పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్ పోర్టుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి పూర్వ రంగం సిద్ధం అవుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు విజయనగరంలో అంగరంగ వైభవంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం అయింది. రానున్న రోజులలో అంటే వరసగా 2028 లలో అనేక పరిశ్రమలు ఉత్తరాంధ్రాలో ప్రారంభం కానున్నాయి అని అంటున్నారు.

కూటమికి సానుకూలంగా :

ఇదిలా ఉంటే ఉమ్మడి విశాఖ జిల్లా కూటమికి ఈ రోజుకీ కంచుకోటగా ఉంది. అక్కడ అభివృద్ధి జరుగుతున్న తీరు పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి పరిసరాలలో అయితే ఎన్నడూ చూడని విధంగా ప్రగతి ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. దాంతో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో సైతం కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత ఈ ప్రాజెక్టుల వల్ల రానుంది అని ఆయా పార్టీల నాయకులు బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు సైతం ప్రతీ శంకుస్థాపనను ప్రతీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్తరాంధ్రా అభివృద్ధి తమ ప్రాధాన్యత అని ఆయన గట్టిగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కూటమి కనుక స్వీప్ చేస్తే ఏపీలో అధికారం దక్కుతుందన్నది కూటమి ఆలోచనగా ఉంది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం వైపు నుంచి బాగానే కసరత్తు సాగుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు మొత్తం ఉత్తరాంధ్ర అభివృద్ధి దశనే కాదు రాజకీయ దశ దిశను మారుస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.