షిప్పుల్లో ఏంటీ వైరస్‌ల గోల? మొన్న హంటా.. నేడు నోరో.. అసలేం జరుగుతోంది బాసూ?
అయితే లాజిక్ సింపుల్.. వేల మంది ప్రయాణికులు ఒకే చోట, క్లోజ్డ్ ఏరియాలో రోజుల తరబడి ఉండటం వల్ల చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా అది దావాగ్నంలా అందరికీ పాకుతుంది.
By: Madhu Reddy | 14 May 2026 11:59 AM ISTవిహారయాత్ర అంటే సముద్రపు అలల మీద హాయిగా తేలిపోవాలి కానీ, ఇలా వైరస్‌ల మధ్య క్వారంటైన్ అవ్వడం ఏంటి? మొన్న చూస్తే 'హంటా వైరస్' అని ఎలుకల చుట్టూ తిరిగారు, ఈరోజు చూస్తే 'నోరోవైరస్' అంటూ ఆహారం మీద పడ్డారు. అసలు ఈ మధ్య కాలంలో లగ్జరీ షిప్పులు విహార నౌకలా లేక వైరస్‌లకు హోటల్లా అనే అనుమానం రాక మానదు. ఐర్లాండ్ నుంచి బయలుదేరిన ‘యాంబిషన్’ షిప్‌లో 1,700 మంది ఇప్పుడు ఆ సముద్రం మధ్యలోనే క్వారంటైన్ అవ్వాల్సి రావడం నిజంగా విచిత్రమైన పరిస్థితి.
హంటా వైరస్ వర్సెస్ ఎలుకలు:
మొన్నటికి మొన్న హంటా వైరస్ కలకలం రేపినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అది ఎలుకల ద్వారా వస్తుందని తేలింది. 'ఒకరి నుండి ఒకరికి సోకదు.. ఎలుకలు లేకుండా చూసుకోండి చాలు' అని అధికారులు సింపుల్‌గా చెప్పేశారు. అంటే, కోట్లు పెట్టి కట్టిన లగ్జరీ నౌకల్లో మనతో పాటు ఎలుకలు కూడా ఫ్రీగా షికారు చేస్తున్నాయన్నమాట! ఎలుకలు ఉండకూడదని రూల్ ఉన్నా, అవి ఎక్కడో ఒకచోట దూరి ప్రయాణికులకు 'వైరస్ ను గిఫ్ట్' గా ఇస్తూనే ఉన్నాయి.
నోరోవైరస్: ఇది మరీ వెరైటీ:
ఇక ఇప్పుడు వచ్చిన నోరోవైరస్ కథ వేరు. ఇది ఎలుకల దాకా వెళ్లక్కర్లేదు.. మనం తినే తిండి, తాగే నీరు కలుషితమైతే చాలు, విపరీతమైన వాంతులు, విరేచనాలతో ముప్పుతిప్పలు పెడుతుంది. 'యాంబిషన్' షిప్‌లో 90 ఏళ్ల వృద్ధుడు చనిపోవడంతో సీన్ సీరియస్ అయ్యింది. ఇక 50 మందికి పైగా సింప్టమ్స్ రావడంతో అధికారులు షిప్‌ను ఫ్రాన్స్‌లో ఆపేశారు. తిండి దగ్గర జాగ్రత్తగా లేకపోతే సముద్రం మధ్యలో చుక్కలు కనిపిస్తాయని ఈ వైరస్ ప్రయాణికులకు గుర్తు చేస్తోంది.
షిప్పుల్లో ఈ 'వింత' ఏంటి?:
అసలు నౌకల్లో ఇలాంటి వైరస్ గోల ఏంటి అని ఆశ్చర్యం కలగక మానదు. అయితే లాజిక్ సింపుల్.. వేల మంది ప్రయాణికులు ఒకే చోట, క్లోజ్డ్ ఏరియాలో రోజుల తరబడి ఉండటం వల్ల చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా అది దావాగ్నంలా అందరికీ పాకుతుంది. ఇక వంట గదిలో చిన్న పొరపాటు జరిగినా, ఎక్కడో ఒక మూల ఎలుక దూరినా.. ఇక అంతే సంగతులు! ఇప్పుడు లగ్జరీ అని మురిసిపోవాలా లేక లోపల వైరస్‌లు ఉన్నాయని భయపడాలా అర్థం కాని పరిస్థితి.
మొత్తానికి షిప్పుల్లో ప్రయాణం అంటే ఇప్పుడు లైఫ్ జాకెట్లతో పాటు శానిటైజర్లు, సొంత తిండి పొట్లాలు కూడా పట్టుకెళ్లాలేమో అనిపిస్తోంది. హంటా పోయి నోరో వచ్చినా.. మూల కారణం మాత్రం పరిశుభ్రత లోపమే అని అధికారులు మొత్తుకుంటున్నారు. విహారయాత్రలు విషాద యాత్రలుగా మారకముందే షిప్ కంపెనీలు మేల్కొంటే మంచిది. లేదంటే షిప్పులంటే జనాలకు భయం పుట్టడం ఖాయం!
