దత్తాత్రేయుడి.. శిగలో పద్మవిభూషణ్!
ఏపీకి చెందిన ఆయనకు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అత్యున్నత పౌరపురస్కారం `పద్మభూషణ్`ను ప్రకటించారు.
By: Garuda Media | 26 Jan 2026 1:43 PM IST''దత్తాత్రేయుడు.. ఇలా చెబితే ఎవరికి తెలుస్తుంది.. 'నోరి' అని చెప్పండి''- అంటూ.. గతంలో రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్య.. దత్తాత్రేయుడి ప్రాచుర్యం గురించి చెప్పకనే చెబుతుంది. `నోరి దత్తాత్రేయుడి`గా దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న `రేడియేషన్ ఆంకాలజీ` వైద్యంలో చెయ్యితిరిగిన డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.. దత్తాత్రేయుడు. ఏపీకి చెందిన ఆయనకు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అత్యున్నత పౌరపురస్కారం `పద్మభూషణ్`ను ప్రకటించారు. కాగా.. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే నోరి.. పద్మశ్రీ అందుకున్నారు. ప్రస్తుతం నోరి వయసు 79 సంవత్సరాలు.
ఎంత ఎత్తుకుఎదిగినా..
కృష్ణా జిల్లాలో మంటాడ గ్రామంలో 1947 అక్టోబరు 21న జన్మించిన దత్తాత్రేయుడు.. మచిలీపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి, కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు. అనంతరం.. హైదరాబాద్‌లొని ఉస్మానియా వైద్య కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం.. అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ కేసులు పెరుగుతుండడంతోపాటు.. మరణాలు కూడా సంభవిస్తున్న పరిస్థితి నెలకొంది. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేన్సర్ వైద్య నిపుణులు అరుదుగా మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేన్సర్ వైద్య విద్య కోసం.. విదేశాలకు వెళ్లారు. మహిళలలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడంలో సిద్ధహస్తులుగా పేరుతెచ్చుకున్నారు.
బసవ రామ తారకం..
అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన నోరి దత్తాత్రేయుడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సేవలు అందించారు. దివంగత ఎన్టీఆర్ సతీమణి బసవ రామ తారకం క్యాన్సర్ చికిత్సకు అమెరికా వెళ్లినపుడు.. ఆమెకు కూడా నోరి వైద్యం అందించారు. ఆ సమయంలో బసవతారకం.. కేన్సర్ ఆసుపత్రి ఆలోచనకు ఆయన బీజం వేశారు. ఆమె తిరిగి ఏపీకి చేరుకున్నాక.. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కు చెప్పారు. కానీ, ఆమె జీవించి ఉండగా.. ఆ ప్రయత్నం సాకారం కాలేదు. మరణానంతరం.. హైదరాబాదులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇస్టిట్యూట్ ఏర్పాటు చేశారు. దీనికి తొలి చైర్మన్‌గా నోరి వ్యవహరించారు.
జగన్-చంద్రబాబు తేడా లేదు!
నోరి దత్తాత్రేయుడికి రాజకీయాలతో సంబంధం లేకుండా.. అన్ని ప్రభుత్వాలు కూడా సమున్నత గౌరవాన్ని ఇచ్చాయి. గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఆయనను సలహాదారుగా నియమించారు. ఆయన సూచనలతోనే.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల రొమ్ము కేన్సర్‌కు పరీక్షలు చేసే బృహత్తర కార్యక్రమానికి అప్పట్లో శ్రీకారం చుట్టారు. నేటికీ కొనసాగుతోంది. ఇక, జగన్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత..చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. కూడా నోరికి పెద్దపీట వేశారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం కూడా.. 2025 జూన్ 29న సలహాదారుగా నియమించుకుంది. కేన్సర్ నివారణ, సంరక్షణ విషయాల్లో ఆయన సలహాలు ఇస్తున్నారు.
