చావును వెతుక్కుంటూ నాలుగు గంటల మౌన ప్రయాణం
ఇది నాగరీక సమాజం అని భ్రమలలో ఉన్న వారికి ఇంకా అనేక చోట్ల జరిగే ఘాతుకాలు అకృత్యాలు దిమ్మ దిరిగేలా చేస్తున్నాయి.
By: Satya P | 26 Aug 2026 7:33 AM ISTఇది నాగరీక సమాజం అని భ్రమలలో ఉన్న వారికి ఇంకా అనేక చోట్ల జరిగే ఘాతుకాలు అకృత్యాలు దిమ్మ దిరిగేలా చేస్తున్నాయి. ఒళ్ళు గగుర్పొడిచేలా కూడా ఈ దారుణాలు ఉంటున్నాయి. మన కళ్ళ ముందే మన ఎదురింట్లో పక్కింట్లో సమీపంలో జరిగే మారణ హోమాలు బహుశా అడవులలో భయంకరమైన జీవుల మధ్య కూడా జరిగి ఉండవేమో అనిపిస్తుంది. ఎంతో మంది చుట్టూ ఉన్న ఒంటరిగా దుర్మార్గులతో పోటీ చేస్తూ అలసి సొలసి జీవితాలను అర్ధాంతరంగా చాలిస్తున్న అమాయకులు బాధితులు ఎందరో ఇంకా ఉన్నారు అంటే నాగరీక సమాజం అని ఒప్పుకోవడానికి కూడా మనసు పూర్తిగా అంగీకరించే పరిస్థితి లేదనిపిస్తోంది.
నూకరాజు కుటుంబం బలి :
సభ్య సమాజంలో నిన్నటిదాకా వారు పౌరులుగా బతికారు. తమకు ఇంతటి సమాజం నుంచి రక్షణ లభిస్తుందని భావించి ఉంటారు. తామున్నది జనంలోనే అనుకుని ఉంటారు. జనారణ్యంలో జీవిస్తున్నామని ఇక తమకు ఎవరూ తమకు సాయం చేయలేరని తాము పూర్తిగా నిస్సయాహులమని దుర్మార్గులతో ఒంటరి పోరాటం చేసే సత్తువ కూడా తమకు లేదని తెలుసుకున్న నాడు అన్ని విధాలుగా ఆశలు మూసుకుని పోయిన నాడు వారికి చివరికి మిగిలిన ఆశ్రయం ఏకైక స్థావరం మృత్యు లోగిలి అని అర్ధం అవుతుంది. అలా బతుకులను తెల్లార్చి చల్లార్చి వారు ఇస్తున్న సందేశం ఏమిటి అన్నది సమాజం ఆలోచించుకుంటే సిగ్గు బాధ భయం కూడా కలుగుతాయేమో. ఎందుకంటే సమాజంలో ఏ రకమైన రక్షణ దొరకదని భావించే కాకినాడ జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఏఐ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఉసుకు తీసుకుంది.
పోలీసుల విచారణ :
కాకినాడ జిల్లాకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మృతి కేసుకు సంబంధించి సాధిక్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రైఫిల్ షూటింగ్ ట్రైనర్ అయిన సాధిక్ ఖాన్ నూకరాజు కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకున్నాడని ఆ తర్వాత వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. జూలై 2న మృతి చెందిన జగదీశ్వర్ రెడ్డి హత్య వెనక సాధిక్ ప్రమేయం ఉందని అతనికి విషం అంటే సైనైడ్ ఇచ్చి హత్య చేశాడని జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపణలతో పాటు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇక సౌజన్య కుమారుడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి ఇదే విషయం మీద మీడియాతో తాజాగా మాట్లాడుతూ సంచలన విషయాలే చెప్పాడు.
ప్రశ్నగా మిగిలిన బాలుడు :
సాధిక్ ఖాన్ అనే కిరాతకుడు తమ జీవితాల్లో ఎలా ప్రవేశించి కుటుంబాన్ని మొత్తం ఎలా కబలించాడో సామూహిక హత్యలో బతికిన నూకరాజు కుటుంబంలోని ఏకైక వ్యక్తి పదేళ్ళ బాలుడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి మీడియాకు తాజాగా చెప్పిన విషయాలు వింటే విభ్రాంతి కలుగుతుంది. తనకు రైఫిల్ షూటింగ్ నేర్పిస్తాను అని పరిచయం అయిన సాధిక్ ఖాన్ తన తండ్రిని ఎలా చంపాడో చెప్పాడు, చివరికి తన తల్లి సౌజన్యను ఎలా మోసం చేశాడో బాలుడు రియాన్ష్ మీడియా ముందు కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. తన తండ్రి జగదీశ్వర్ రెడ్డి హత్య వెనక సాధిక్ ఉన్నాడని రియాన్ష్ ఆరోపించాడు.
విస్తుబోయే నిజాలు :
కాకినాడకు చెందిన ప్రముఖ మానేపల్లి జువెలర్స్ కుటుంబానికి చెందిన జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఆయన భార్య సౌజన్య, ఆమె తల్లిదండ్రులు అయిన నూకరాజు దంపతులను ఇలా ఈ నలుగురి మృతికి సాదిక్ ఖాన్ కారణం అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక రియాన్ష్ కార్తికేయ రెడ్డి దీని మీద మాట్లాడుతూ సాధిక్ మొదట తన తండ్రి జగదీశ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపించాడు. అందుకే ముంబై, కెనడా నుంచి ప్రమాదకర రసాయనాలు తెప్పించి వాటిని ప్రోటీన్ షేక్‌లలో, ఆహారంలో కలిపి ఇచ్చి నెమ్మదిగా తన తండ్రి ఆరోగ్యం పాడు చేశాడని ఆరోపించాడు. అదే విధంగా తన తల్లి సౌజన్యను కూడా శారీరకంగా మానసికంగా తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడని రియాన్ష్ చెప్పాడు. సౌజన్యను రహస్యంగా వీడియోలు తీసి వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తూ మొత్తం ఆస్తులను తన పేరు మీద రాయించుకున్నాడని చెప్పాడు. అంతే కాదు బ్యాంకు ఖాతాలకు అనుసంధానమైన ఫోన్ నంబర్లను మార్చేసి, ఆర్థికంగా వారిని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. తన తల్లి ఈ విషయాలు ఎవరికైనా చెబితే తనను ఉగ్రవాదులకు అమ్మి వేస్తాను అని తనకు అన్ని చోట్లా ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని బెదిరించాడని చెప్పాడు. వీటన్నిటికీ పరాకాష్ట ఏమిటి అంటే సౌజన్య కుటుంబం ఫోన్‌కు ట్రాకింగ్ యాప్‌లు పెట్టి వారిని ప్రతీ రోజూ ఇరవై నాలుగు గంటలూ నిఘా నీడలో బంధించి సాధిక్ ఖాన్ హింసించడం.
చావు బరువుని మోస్తూ :
ఘోరాతి ఘోరం ఏమిటి అంటే హాయిగా చనిపోలేని నిస్సహాయత నూకరాజు కుటుంబానిది. చావుకు ముందు కూడా అంతా కలసి ఒక్కసారి అయినా మనస్పూర్తిగా మాట్లాడకోవడానికి కూడా లేకుండా సాధిక్ ఖాన్ నిఘా నీడలో అంతలా ఉంచాడు. అందుకే ఆత్మహత్యకు ముందు నూకరాజు కుటుంబ సభ్యులంతా ఒకే కారులో నాలుగు గంటల పాటు మౌనంగానే ప్రయాణించారు. తాము మాట్లాడుకుంటే సాదిక్ తమను ఎక్కడ ట్రాక్ చేస్తున్నాడేమోనన్న భయం వారిని మౌనంగానే రోదించేలా చేసింది. ఇది బాలుడు రియాన్ష్ చెబుతూంటే విన్న వారికి మీడియాలో చూసిన వారికి గుండె తరుక్కుపోయేలాగానే ఉందంటే ఎంతటి విషాదమంది.
జనసేన ఎంపీ డిమాండ్ :
ఇదిలా ఉంటే కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ బాలుడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దారుణ ఘటనపై సీబీఐ విచారణ జరిపి, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పిల్లల ద్వారా తల్లులను లోబరుచుకునే కొత్త రకం జిహాద్ ఇది అని ఎంపీ విమర్శించారు. ఇక బాలుడు రియాన్ష్, అతని తల్లి సౌజన్య రాసిన లేఖల ఆధారంగా పోలీసులు ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితుడు సాధిక్ పై సర్పవరం పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు అయింది. జగదీశ్వర్ రెడ్డి మృతి, నూకరాజు కుటుంబం మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకున్న ప్రయత్నాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రంగంలోకి దిగడంతో ఒక కుటుంబం మొత్తాన్ని పొట్టన పెట్టుకున్న నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని పడాలని కూడా రాష్ట్ర ప్రజానీకం అంతా కోరుకుంటున్నారు.
