మాస్ లేఆఫ్ అలర్ట్: ప్రమాదంలో 14 వేల ఉద్యోగాలు ? భారీ కోతల దిశగా నోకియా!
ప్రపంచమంతా 5జీ విప్లవం కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆ సాంకేతికతను అందించే సంస్థలే నష్టాల ఊబిలో కూరుకుపోవడం ఆశ్చర్యకరం.
By: A.N.Kumar | 28 March 2026 10:21 AM ISTఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని శాసించిన ఫిన్లాండ్ టెలికాం దిగ్గజం నోకియా.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి 'ఉద్యోగ కోతల' కత్తిని నమ్ముకోవడం టెక్ రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం కేవలం ఒక కంపెనీకి పరిమితమైన సమస్య కాదు.. ఇది మొత్తం గ్లోబల్ టెక్, టెలికాం మార్కెట్‌లో నెలకొన్న అస్థిరతకు నిదర్శనం.
5జీ కలలు.. వాస్తవాల చేదు నిజాలు
ప్రపంచమంతా 5జీ విప్లవం కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆ సాంకేతికతను అందించే సంస్థలే నష్టాల ఊబిలో కూరుకుపోవడం ఆశ్చర్యకరం. నోకియా ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం 5జీ పరికరాలకు ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడమే. ముఖ్యంగా భారతదేశం వంటి అతిపెద్ద మార్కెట్లలో టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్ విస్తరణ వేగాన్ని తగ్గించడం నోకియా వంటి వెండర్లపై తీవ్ర ప్రభావం చూపింది. 2025 నాలుగో త్రైమాసికంలో భారత మార్కెట్లో నోకియా అమ్మకాలు 15 శాతం పడిపోవడం ఒక ప్రమాద ఘంటిక.
నిర్వహణ లోపమా? మార్కెట్ ఒత్తిడా?
సంస్థలో జరుగుతున్న ఈ మార్పులను గమనిస్తే కేవలం ఆర్థిక నష్టాలే కాకుండా అంతర్గత నిర్వహణ లోపాలు కూడా కనిపిస్తున్నాయి. 2023లో క్లౌడ్, మొబైల్ నెట్‌వర్క్ విభాగాలను విలీనం చేసినప్పుడు పనుల డూప్లికేషన్ ఒకే పనిని ఇద్దరు చేయడం జరుగుతుందని యాజమాన్యం గుర్తించలేకపోయింది. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి వేలాది మంది ఉద్యోగులను బలిపశువులను చేయడం ఎంతవరకు సమంజసం అన్నది నైతిక ప్రశ్న.
భారత టెక్ నిపుణులపై నీలినీడలు
భారత్‌లో నోకియాకు ఉన్న 17,000 మంది ఉద్యోగుల్లో కోతలు విధిస్తే అది ఇక్కడి ఐటీ, టెలికాం నిపుణుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు లేఆఫ్స్‌తో భయపెడుతుండగా ఇప్పుడు నోకియా కూడా అదే బాట పట్టడం ఆందోళనకరం. కంపెనీ తన పాత నాయకత్వాన్ని మార్చి కొత్త రక్తాన్ని ఎక్కించినా క్షేత్రస్థాయిలో ఉద్యోగ భద్రత లేనిదే ఆశించిన ఫలితాలు రావడం కష్టం.
టెక్ కంపెనీలు కేవలం లాభాల వేటలో పడి మానవ వనరుల విలువను మర్చిపోకూడదు. వ్యయ నియంత్రణ పేరుతో చేసే ఈ కోతలు స్వల్పకాలికంగా బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచవచ్చు కానీ దీర్ఘకాలంలో కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌ను నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. నోకియా వంటి దిగ్గజాలు కేవలం ఉద్యోగులను తొలగించడంపైనే కాకుండా కొత్త ఆవిష్కరణలు.. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమను తాము మలచుకోవడంపై దృష్టి సారించాలి. లేకపోతే ఈ 'కోతల పర్వం' టెక్ రంగాన్ని మరింత అనిశ్చితిలోకి నెట్టే ప్రమాదం ఉంది.
