Begin typing your search above and press return to search.

జుడియో.. వెస్ట్ సైడ్ రథసారధి నోయిల్ టాటా గుడ్ బై.. ఎందుకంటే?

ఇదంతా జరగటానికి కారణంగా ఒకరిని కీలకంగా చెప్పాలి. ఆయనే నోయిల్ టాటా. తన తల్లి సిమోన్ టాటా ఏర్పాటు చేసిన ట్రెంట్ లో 2010 ఆగస్టు 19న బోర్డు సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చారు.

By:  Garuda Media   |   26 Jun 2026 10:44 AM IST
జుడియో.. వెస్ట్ సైడ్ రథసారధి నోయిల్ టాటా గుడ్ బై.. ఎందుకంటే?
X

ట్రెంట్ అంటే ఇదేం కంపెనీ? అని అడిగేటోళ్లు చాలామందే ఉంటారు. అదే.. జుడియో.. వెస్ట్ సైడ్.. స్టార్ బజార్ పేరు చెబితే.. తమకు సుపరిచితమైన బ్రాండ్ గా చెప్పే వాళ్లు లక్షల్లో కనిపిస్తారు. అతి తక్కువ వ్యవధిలో అత్యంత నమ్మకమైన ఫ్యాషన్ బ్రాండ్ గా అవతరించటమే కాదు.. దేశంలోని అపరెల్ మార్కెట్ కు కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చిన బ్రాండ్ గా జుడియో చెప్పాలి. ఏడాదికి కొన్ని సందర్భాల్లో మాత్రమే దుస్తులు కొనుగోలు చేయాలన్న రూల్ ను పాతరేయటంతో జుడియో కీలకభూమిక పోషించిందని చెప్పాలి. పార్టీకి వెళ్లాలన్నా.. ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాలన్నా.. సరదాగా షాపింగ్ చేసే అలవాటును కొత్త తరానికి అలవాటు చేసిన బ్రాండ్ గా చెప్పాలి. అంతేనా.. యూత్ అవసరాల్ని గుర్తించి.. వారి బడ్జెట్ కు సూట్ అయ్యేలా డిజైన్ చేయటమే కాదు.. నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఉండటం.. లేటెస్ట్ ఫ్యాషన్ కు తగ్గట్లుగా తమ ఉత్పత్తుల్ని డిజైన్ చేయటం ద్వారా.. పుష్కర కాలంలో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. ఎంతోమందికి నమ్మకమైన బ్రాండ్ గా అవతరించింది.

ఇదంతా జరగటానికి కారణంగా ఒకరిని కీలకంగా చెప్పాలి. ఆయనే నోయిల్ టాటా. తన తల్లి సిమోన్ టాటా ఏర్పాటు చేసిన ట్రెంట్ లో 2010 ఆగస్టు 19న బోర్డు సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. సౌందర్య ఉత్పత్తులకు సంబంధించి లాక్మే బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ తొలుత నోయిల్ టాటా తల్లి సిమోన్ స్టార్ట్ చేశారు. తర్వాతి కాలంలో దీన్ని దేశంలోని అతి పెద్ద వస్తు ఉత్పత్తి సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (రిన్.. సర్ఫ్ ఎక్సెల్.. బ్రూక్ బ్రాండ్.. క్వాలిటీ వాలా.. డాల్డా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో) కు అమ్మేసిన తర్వాత ట్రెంట్ ను స్టార్ట్ చేశారు.

1998లో బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్ లో వెస్ట్ సైడ్ స్టోర్ ను స్టార్ట్ చేశారు. 2014 మార్చి 31న అప్పటి ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోవటంతో కంపెనీ పగ్గాలు నోయిల్ టాటా చేతికి వెళ్లిపోయాయి. అప్పటివరకు ట్రెంట్ చరిత్ర ఒకటైతే.. ఆ తర్వాత నుంచి దాని వేగం.. వ్యాపార విస్తరణ ఎంత భారీగా సాగిందన్న దానికి నిదర్శనంగా గణాంకాలు ఇట్టే చెప్పేస్తాయి. ట్రెంట్ సాధించిన అధ్బుత విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా నోయిల్ టాటాను చెప్పాలి. అలాంటి ఆయన తన రిటైర్మెంట్ గురించి తాజాగా ప్రకటించారు.ఈ ఏడాది నవంబరుకు ఆయన వయసు 70 ఏళ్లకు చేరుకోనుంది. దీంతో.. తాను ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న విషయాన్ని తాజాగా జరిగిన కంపెనీ ఏజీఎంలో ప్రకటించారు. ఇంతకు ముందు చెప్పినట్లు బెంగళూరులో ఒక స్టోర్ తో మొదలైన ట్రెంట్ ప్రయాణం ఇప్పుడు దేశ వ్యాప్తంగా 1200 స్టోర్లతో దిగ్గజ రిటైన్ సంస్థల్లో ఒకటిగా నిలిచిందని చెప్పొచ్చు. సంస్థ ఇంతలా ఎదగటంలో నోయిల్ టాటా కీలకభూమిక పోషించారని చెప్పాలి.

ట్రెంట్ తో పాటు ఆయన టైటాన్.. టాటా స్టీల్.. వోల్టాస్ లాంటి టాటా గ్రూప్ లోని ఆరు సంస్థల బోర్డుల నుంచి తప్పుకుంటారు. అయితే.. టాటా గ్రూప్ మాతృసంస్థ అయిన 'టాటా సన్స్' నియంత్రించే అత్యంత శక్తివంతమైన 'టాటా ట్రస్ట్స్'ఛైర్మన్ గా మాత్రం తన బాధ్యతల్ని ఎప్పటిలానే కంటిన్యూ చేస్తారు. ఇంతకూ ఆయన ఎందుకు తప్పుకుంటున్నారన్న విషయానికి వస్తే.. టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు 70 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

ట్రెంట్ ను ఆయన ఎంతలా పెంచి పెద్ద చేశారన్న విషయాన్ని కొన్ని గణాంకాల్ని ప్రస్తావించటం ద్వారా చెప్పొచ్చు. 2014లో ఆయన ట్రెంట్ బాధ్యతలు చేపట్టే వేళకు వార్షిక టర్నోవర్ రూ.2333 కోట్లు అయితే.. ఇప్పుడు ఏకంగా రూ.20,074 కోట్లు. అంటే.. వార్షిక టర్నోవర్ ఏకంగా 9రెట్లు పెరిగింది. మార్కెట్ విలువ విషయానికి వస్తే.. అప్పట్లో అంటే 2014 నాటికి రూ.4300 కోట్లు ఉంటే.. తాజాగా దీని విలువ అక్షరాల రూ.1.71లక్షల కోట్లు. అంటే.. ఈ పన్నెండేళ్ల కాలంలో 40 ప్లస్ రెట్లు పెరిగింది. ఆయన బాధ్యతలు చేపట్టే నాటికి నికర నష్టం రూ.19 కోట్లు అయితే.. ప్రస్తుతం వార్షిక నికర లాభం రూ.1721 కోట్లు కావటం గమనార్హం. ఒకస్టోర్ నుంచి ఇప్పుడు 321 నగరాల్లో 1286 స్టోర్లకు చేరుకుంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జుడియో స్టోర్లు 963 ఉంటే.. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 5వేలకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంస్థ షేరు విలువ విషయానికి వస్తే ఆయన కంపెనీ బాధ్యతలు చేపట్టే 2014 నాటికి ఒక్కో షేరు విలువ రూ.65-68 మధ్య ఉండేది. ప్రస్తుతం (జూన్ 2026) నాటికి ఈ షేరు విలువ ఒక్కొక్కటి రూ.3214గా పెరిగింది. నిజానికి ఈ మధ్యన రెండు షేర్లకు ఒక షేరు బోనస్ గా ఇవ్వటంతో ధర కాస్త సర్దుబాటు అయ్యింది. ట్రెంట్ షేరు ధర ఒక దశలో రూ.8346 వరకు దూసుకెళ్లింది. అయితే.. లాభాల్నిస్వీకరించేక్రమంలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిపారు. దీంతో.. షేరు ధర కాస్త తగ్గింది. అదే సమయంలో బోనస్ షేర్లను ప్రకటించిన నేపథ్యంలో సర్దుబాటులోభాగంగా ధరలు తగ్గాయి. ఏమైనా.. ట్రెంట్ లో నోయిల్ టాటా ప్రయాణం అత్యద్భుతమే కాదు.. భారత ష్యాషన్ మార్కెట్ కు కొత్త పాఠాల్ని నేర్పారని చెప్పాలి. అలాంటి ఆయన.. ఈ నవంబరులో ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్నారు. రాబోయే రోజుల్లో ట్రెంట్ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.