Begin typing your search above and press return to search.

నోబెల్ పీస్ ప్రైజ్ గెలిస్తే ఎన్ని రూ.కోట్లు ఇస్తారు.. నోబెల్ ప్రతిష్ఠ కోల్పోయిందన్న పుతిన్

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి మరోసారి అంతర్జాతీయ చర్చకు దారితీసింది.

By:  A.N.Kumar   |   10 Oct 2025 10:36 PM IST
నోబెల్ పీస్ ప్రైజ్ గెలిస్తే ఎన్ని రూ.కోట్లు ఇస్తారు.. నోబెల్ ప్రతిష్ఠ కోల్పోయిందన్న పుతిన్
X

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి మరోసారి అంతర్జాతీయ చర్చకు దారితీసింది. తాజాగా 2025 సంవత్సరానికి గాను వెనిజులాకు చెందిన విపక్ష నేత మరియా కొరీనా మచాడో ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన సాహసోపేత పోరాటానికి గుర్తింపుగా నార్వే నోబెల్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, ఈ ఎంపికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. నోబెల్ బహుమతి "తన ప్రతిష్ఠను కోల్పోయింది" అంటూ ఘాటుగా విమర్శించారు.

* నోబెల్ ప్రతిష్ట కోల్పోయిందన్న పుతిన్, నెతన్యాహు

ట్రంప్‌కు బహుమతి ఇవ్వకపోవడంపై పుతిన్ , ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. "ట్రంప్‌ అన్నివిధాలా అర్హులు. ఆయన మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారు. శాంతికోసం పనిచేయని పలువురికి నోబెల్ ఇచ్చారు. దీంతో ఆ బహుమతి విలువ తగ్గిపోయింది," అని పుతిన్ విమర్శించారు.

పుతిన్ వ్యాఖ్యలకు నెతన్యాహు కూడా మద్దతు తెలిపారు. "శాంతిపై నోబెల్ కమిటీ మాటలకే పరిమితమైంది. కానీ ట్రంప్‌ చేసి చూపించారు. ఆయనకే ఆ బహుమతి దక్కాల్సింది," అని నెతన్యాహు అభిప్రాయపడ్డారు.

* నోబెల్ గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తారు?

ప్రతిష్టతోపాటు నోబెల్ బహుమతి విజేతకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది. ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ విజేతకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ అందించారు. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 10.25 కోట్లు (పది కోట్ల ఇరవై ఐదు లక్షలు). ఈ మొత్తంతో పాటు విజేతకు బంగారు పతకం, సర్టిఫికేట్ కూడా లభిస్తాయి.

* ట్రంప్ నామినేషన్‌పై కమిటీ వివరణ

ట్రంప్‌కు అవార్డు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో నోబెల్ కమిటీ ఒక కీలక స్పష్టత ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ పేరుతో వచ్చిన నామినేషన్లు గడువు తేదీ అయిన జనవరి 31 తర్వాతే తమకు అందినట్లు కమిటీ తెలిపింది. అందువల్ల, నిబంధనల ప్రకారం వాటిని పరిశీలనకు తీసుకోలేదని కమిటీ తేల్చిచెప్పింది.

అయితే పుతిన్, నెతన్యాహు వంటి ప్రపంచ నేతల వ్యాఖ్యలతో నోబెల్ ఎంపిక ప్రక్రియపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. కానీ, నోబెల్ కమిటీ మాత్రం మచాడో ఎంపికలో పారదర్శకత పాటించామని, ఆమె ప్రజాస్వామ్య పోరాటం ప్రపంచానికి ఒక ఆదర్శమని చెబుతోంది.