Begin typing your search above and press return to search.

అక్టోబర్ 2న యూపీఐ బంద్ అవుతుందా? గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు క్లారీటీ ఇదే

ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా యూపీఐ సేవలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీసీఐ) గానీ, బ్యాంకులు గానీ లేదా ప్రభుత్వం గానీ నిలిపివేయడం లేదు.

By:  A.N.Kumar   |   28 Sept 2026 11:34 PM IST
అక్టోబర్ 2న యూపీఐ బంద్ అవుతుందా? గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు క్లారీటీ ఇదే
X

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని.. 'నో యూపీఐ డే’ పేరుతో వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను బంద్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనివల్ల నిత్యం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి యాప్‌లను ఉపయోగించే కోట్లాది మంది వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం ఆందోళన నెలకొన్నాయి. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న వేళ అక్టోబర్ 2న అసలు డిజిటల్ చెల్లింపులు పనిచేస్తాయా లేక బంద్ అవుతాయా అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా యూపీఐ సేవలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీసీఐ) గానీ, బ్యాంకులు గానీ లేదా ప్రభుత్వం గానీ నిలిపివేయడం లేదు. సాంకేతికంగా యూపీఐ నెట్‌వర్క్ అంతా యథావిధిగా పనిచేస్తుంది. 'నో యూపీఐ డే' అనేది ప్రభుత్వ ప్రకటన కాదని కేవలం కొన్ని వ్యాపార, వర్తక సంఘాలు ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రూల్స్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసన మాత్రమేనని స్పష్టమైంది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వంటి ప్రధాన వ్యాపార సంస్థలు దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని ఎలాంటి అధికారిక పిలుపునివ్వలేదు. అయితే, స్థానిక స్థాయిలో ఉన్న కొన్ని వర్తక సంఘాలు తమ నిరసనను తెలియజేయడానికి అక్టోబర్ 2న దుకాణాల్లో క్యూఆర్ కోడ్‌లను వాడకపోవడం.. లేదా యూపీఐ చెల్లింపులను స్వీకరించకపోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి.

అక్టోబర్ 2న గూగుల్ పే, ఫోన్ పే , పేటీఎం వంటి అన్ని యూపీఐ యాప్‌లు సాధారణంగానే పనిచేస్తాయి. యాప్ తెరవడం, వ్యక్తి నుంచి వ్యక్తికి డబ్బులు పంపడం లేదా ఆన్‌లైన్ రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులు వంటివి ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతాయి. మీరు వెళ్లిన దుకాణంలో వ్యాపారి యూపీఐ చెల్లింపును వద్దని నిరాకరించడం వేరు.. యూపీఐ యాప్ పనిచేయకపోవడం వేరు అనే విషయాన్ని గుర్తించాలి. నిరసనలో పాల్గొనే కొన్ని నిర్దిష్ట దుకాణాల్లో మాత్రమే వ్యాపారులు క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా చెల్లింపులను స్వీకరించకపోవచ్చు.

అసలు ఈ ఎండీఆర్ వివాదం ఏంటంటే 2026 అక్టోబర్ 15 నుంచి కొన్ని రకాల వ్యాపార యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని మర్చంట్ లావాదేవీలకు ఈ రుసుము వర్తించే అవకాశం ఉంది. సాధారణ వినియోగదారులు ఒకరికొకరు చేసుకునే వ్యక్తిగత (పీ2పీ) చెల్లింపులపై అలాగే వ్యాపారులకు చేసే రూ.2,000 లోపు లావాదేవీలపై ఈ చార్జీలు ఉండవు. ఈ చార్జీల వల్ల తమ లాభాల శాతంలో కోత పడుతుందని.. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అక్టోబర్ 2న బయటకు వెళ్లేటప్పుడు లేదా దుకాణాల్లో కొనుగోళ్లు చేసేటప్పుడు వినియోగదారులు తమ వద్ద కొంత అత్యవసర నగదు ఉంచుకోవడం మంచిది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి భయాందోళనలకు గురికాకుండా ప్రభుత్వం లేదా సంబంధిత బ్యాంకుల నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. మొత్తానికి అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిలిచిపోదు. అన్ని యూపీఐ యాప్‌లు ఎప్పటిలాగే పనిచేస్తాయి. కేవలం వ్యాపారులు మాత్రమే యూపీఐని వాడకుండా నిరసన తెలుపుతారు.